వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2021-08-01T05:35:48+05:30 IST

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో..

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

జెండా ఆవిష్కరణ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ


కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆటోస్టాండులో వైసీపీ జెండాను ఆవిష్కరణ కోసం ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం 5వ వార్డు మదసరా ఎదురుగా ఆటోస్టాండు వద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఎస్వీ వర్గీయులు ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే తమకు సమాచారం లేకుండా, ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎస్వీ మోహన్‌రెడ్డి వైసీపీ జెండాను ఎలా ఆవిష్కరిస్తారంటూ స్థానిక కార్పొరేటర్‌, కొందరు కార్యకర్తలు ఎస్వీ ఫ్లెక్సీలు, బ్యానర్లను శనివారం రాత్రి తొలగించేందుకు యత్నించారు. అంతలో అక్కడికి చేరుకున్న ఎస్వీ వర్గీయులు ఎలా తొలగిస్తారని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. కాసేపటికి పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఎవరూ వినకపోవడంతో పోలీసులు ఎమ్మెల్యేకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. చివరకు పోలీసులు ఎస్వీకి ఫోన్‌ చేసి జెండా ఆవిష్కరణ వాయిదా వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. 


కార్పొరేటర్లకు సమాచారం లేకుండా జెండా ఆవిష్కరణా?

మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్లకు సమాచారం లేకుండా వైసీపీ జెండాను ఎలా ఆవిష్కరిస్తారు. ఎమ్మెల్యేకి సమాచారం లేకపోయినా పర్వాలేదు.. కార్పొరేట్లకు చెప్పకపోవడం దారుణం. ఈ విషయం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను. నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఎస్వీ మోహన్‌రెడ్డి జెండా ఆవిష్కరణ చేపట్టారు. 

- ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌


జెండా ఆవిష్కరణకు అనుమతి అవసరమా?

వైసీపీ జెండాను ఆవిష్కరించడానికి అనుమతి తీసుకోవడం అవసరమా? ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వర్గీయులు పార్టీని భ్రష్టు పట్టించడానికి చేస్తున్న పన్నాగం ఇది. ఈ సమస్యను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఒక రోజు వాయిదా వేసుకుని మరుసటి రోజు కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చెప్పారు. చిన్నవిషయాన్ని పెద్ద సమస్యగా చేయడం సరికాదు. 

- మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి

Updated Date - 2021-08-01T05:35:48+05:30 IST