అయోమయం!

ABN , First Publish Date - 2021-06-12T04:55:49+05:30 IST

మాల్‌ పట్టణం కొంత రంగారెడ్డి జిల్లా పరిధిలో,

అయోమయం!
మధ్యాహ్నం రెండు గంటలకు రెండు జిల్లాలను కలిపే మాల్‌ ప్రాంతం..

  • ఒకే పట్టణం.. రెండు లాక్‌డౌన్‌లు
  • నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మాల్‌లో అమలు
  • రెండు జిల్లాల్లో వేర్వేరు లాక్‌డౌన్‌ సమయాలు 
  • ఇబ్బంది పడుతున్న జనం


యాచారం :  మాల్‌ పట్టణం కొంత రంగారెడ్డి జిల్లా పరిధిలో, మరికొంత భాగం నల్లగొండ జిల్లా పరిధిలో ఉంది. అయితే కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విష యం విధితమే. అయితే నల్లగొండ జిల్లాలో మధ్యాహ్నం 2గంటల నుంచి లాక్‌డౌన్‌ ఉండగా, రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 5గంటల తర్వాత లాక్‌డౌన్‌ అమలవుతోంది. మాల్‌ పట్టణం రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో ఇక్కడ రెండు లాక్‌డౌన్‌లు అమలవుతున్నాయి. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. 

నల్లగొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల  వరకు లాక్‌డౌన్‌ సడలింపు సమయంగా ఉంటే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మాల్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ సడ లింపు సమయంగా ఉంది. ఏ సమయంలో లాక్‌డౌన్‌ పాటించాలో అర్ధం కాక మాల్‌లో ప్రజలు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు. 

రెండు జిల్లాల సరిహద్దు కేవలం 100ఫీట్ల రహదారి మాత్రమే. ఇక్కడ వివిధ రకాల వస్తువులు, దుస్తులు, పండ్లు, ధాన్యం,  నిత్యావసర సరుకులతోపాటు కూరగాయల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఇక్కడ మంగళవారం సంత జరుగు తుంది. ఆ రోజు కనీసం కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరు గుతుంది. మాల్‌కు తమకు అవసరమైన వస్తువుల క్రయవిక్రయాల కోసం చింతపల్లి, మర్రిగూడ, యాచారం మండలాలకు చెందిన జనం వస్తుంటారు. వీరిని మధ్యాహ్నం రెండు గంటలు దాటితే నల్లగొండ జిల్లా పరిధిలోకి వెళ్లనీయడం లేదు. నల్లగొండ జిల్లా పరిధిలోని మాల్‌లో మధ్యాహ్నం రెండు గంటలకే లాక్‌డౌన్‌ పడుతుండటంతో ఆ సమయంలోనే చిరువ్యాపారులు ఇంటిదారి పడుతున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మాల్‌లో చిరువ్యాపారులు కూడా మధ్యాహ్నం రెండు గంటలకే తమ వ్యాపారం ముగించుకోవాల్సి వస్తుంది. ఒకే పట్టణంలో రెండు లాక్‌ డౌన్‌లు ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు, వ్యాపారులు అంటున్నారు.


మాల్‌, మంతన్‌గౌరెల్లి పోవాలంటే..

యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చేరుకోవాలంటే మాల్‌ను దాటి వెళ్లాలి. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ముఖ్య కూడలిలో పోలీ సులు చెక్‌పోస్టు పెట్టి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. యాచారంకు వచ్చినవారు మంతన్‌గౌరెల్లికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వెళ్లాలంటే నల్లగొండ జిల్లా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


పొలానికి పోనివ్వడం లేదు

మాల్‌ నుంచి నా వ్యవసాయ బావికి ఎరువు తీసుకుపోతుంటే నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకొని నానా ఇబ్బంది పెట్టారు. రెండు జిల్లాల పరి ధిలో ఉన్న మాల్‌ పట్టణంలో రెండు లాక్‌డౌన్‌ సమయాలు కాకుండా, సాయంత్రం ఐదు గంటల తర్వాత అమలు చేయడానికి నల్లగొండ జిల్లా పోలీసులు చొరవ తీసుకోవాలి. 

 - శేఖర్‌, మాల్‌, రంగారెడ్డి జిల్లా 



Updated Date - 2021-06-12T04:55:49+05:30 IST