‘గ్యాంగ్‌ రేప్‌’పై గందరగోళం

ABN , First Publish Date - 2021-09-17T09:23:28+05:30 IST

ఛేదించామని పోలీసులు భావించిన గ్యాంగ్‌రేప్‌ కేసు కొత్త చిక్కుల్లో పడింది. భర్తను కట్టేసి, భార్యపై.

‘గ్యాంగ్‌ రేప్‌’పై గందరగోళం

ఛేదించామనుకున్న కేసులో కొత్తచిక్కులు

తలలు పట్టుకున్న గుంటూరు పోలీసులు

త్వరలోనే ఛేదిస్తాం: అర్బన్‌ ఎస్పీ హఫీజ్‌


గుంటూరు, సెప్టెంబరు 16: ఛేదించామని పోలీసులు భావించిన గ్యాంగ్‌రేప్‌ కేసు కొత్త చిక్కుల్లో పడింది. భర్తను కట్టేసి, భార్యపై అఘాయిత్యం జరిపిన ఈ కేసులో గుంటూరు పోలీసుల ఎదుట నేరం అంగీకరించిన అనుమానితులు ఇప్పుడు తూచ్‌ అనేశారు. బాధితురాలి నుంచి దోచుకున్న బంగారం సత్తెనపల్లిలో తాకట్టు పెట్టినట్టు వారిచ్చిన దుకాణం అడ్ర్‌సకు వెళ్లిన పోలీసులకు అక్కడా సరైన ఆధారాలు లభించలేదు. దుకాణం యజమానులు తమ వద్ద బంగారం తాకట్టు పెట్టలేదని చెప్పడంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు. తాము నేరం చేయలేదని.. పోలీసులు కొడతారనే భయంతోనే ఒప్పుకొన్నామని అనుమానితులు కొత్తవాదన వినిపించడంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. ఈనెల 8న రాత్రి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు పాలడుగులో ఓ శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా గ్రామ పొలిమేరల్లో అగంతకులు వారిని అటకాయించి పొలాల్లోకి తీసుకెళ్లి భర్తను కొట్టి కట్టేసి అతడి ముందే భార్యపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితులను గుర్తించలేకపోయారు.


అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో నిందితులు సెల్‌ఫోన్‌ వినియోగించలేదు. అయినా, పోలీసులు ఘటనా స్థలం పరిధిలోని సెల్‌టవర్‌ నుంచి ఆ సమయంలో వచ్చిన ఫోన్‌కాల్స్‌ డంప్‌ను జల్లెడపట్టారు. ఫలితం లభించలేదు. పోలీసు జాగిలాలను రంగంలోకి దించినా అవి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగిపోయాయి. నిందితులు సెల్‌ఫోన్‌ వినియోగించకపోవటంతో పోలీసులకు సాంకేతికపరమైన ఆధారాలు లభ్యంకాలేదు. బాధితుల వద్ద నిందితులు సత్తెనపల్లి ప్రాంతం పరిధిలోని అబ్బూరు గ్రామం పేరు ఉచ్చరించారు. దీంతో నిందితులు అక్కడి సమీప గ్రామాలకు చెందినవారై ఉండొచ్చునని పోలీసులు అనుమానించారు. సమీపంలోని కొర్రపాడు గ్రామంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా రాత్రి వేళ జంగుపిల్లులు, కుందేళ్లు వంటి వాటిని పట్టుకునేందుకు వెళుతుంటారు. ఈ క్రమంలో సంఘటన జరిగిన రోజు రాత్రి కూడా వీరు జంగుపిల్లుల వేటకు వెళ్లటం, అంతేగాక సాధారణంగా వేటకు వెళ్లి వేకువజామునే వచ్చే వారు ఆ రోజు తెల్లవారేవరకు రాకుండా మరోసారి మద్యం సేవించి ఇంటికి వచ్చినట్టు పోలీసుల దృష్టికిరావటంతో వారిపై అనుమానాలు బలపడ్డాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 


ఇదే తరహాలో రెండు దోపిడీలు

సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసుల దృష్టికి  ఇదే పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గత నెలలో జరిగిన రెండు దోపిడీ ఉదంతాలు వచ్చాయి. నెల రోజుల క్రితం మేడికొండూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని విశదల గ్రామ శివారులో గుంటూరు-సత్తెనపల్లి రోడ్డులో ఓ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. తండ్రి, కుమార్తె కారులో వెళుతూ రాత్రి 10 గంటల సమయంలో విశదల గ్రామ పరిధిలో మెయిన్‌ రోడ్డు పక్కన కారు ఆపుకుని కారులో భోజనం చేస్తున్నారు. ఆటోలో వచ్చిన అగంతకులు వీరి కారులోకి ఎక్కి కత్తులతో బెదిరించి వాహనాన్ని మళ్లించారు. కొద్దిదూరం వెళ్లాక వారి వద్ద ఉన్న నగదు, ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకుని పారిపోయారు. మేడికొండూరు స్టేషన్‌లో కేసు నమోదైంది. వారం రోజులకు ఇదే ప్రాంతంలో ఓ జంట ద్విచక్ర వాహనంపై రాత్రి సమయంలో వెళుతుండగా.. మారణాయుధాలతో బెదిరించి వారి ఆభరణాలను దోచుకున్నారు. అయితే ఆ రెండు ఘటనల్లో నిందితులు కేవలం దోపిడీకి పాల్పడ్డారేగానీ అత్యాచారానికి పాల్పడలేదు. ఆ నేరాలకు, సామూహిక అత్యాచారానికి సంబంధం ఉండకపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

Updated Date - 2021-09-17T09:23:28+05:30 IST