Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగి సాగుపై గందరగోళం

వరి వద్దంటూ స్పష్టం చేసిన ప్రభుత్వం

ఆరుతడి పంటలు వేయాలని అధికారుల సూచన 

ఇప్పటి వరకు ఖరారు కాని పంటల ప్రణాళిక

 రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా మారింది ప్రస్తుత రైతులు పరిస్థితి. నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. కరెం టు కోతలు లేవు. తెగుళ్ల బెడద కన్పించడం లేదు. వరి సాగు చేస్తే ఎంతో కొం త లాభం వస్తుందనుకుంటున్న సమయంలోనే ప్రభు త్వం పిడుగులాంటి వార్త రైతుల చెవిన వేసింది. ఈ సారి వరి వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచనలు చేయడంతో దిక్కుతోచక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. యాసంగి సీజన్‌ ఆరంభమైనప్పటికీ పంటల ప్రణాళిక ఖరారుకాకపోవడం తో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం గందరగోళంలో పడింది. సాధారణ రైతులతోపాటు కౌలు రైతులు ఇప్పటివరకు ఏం పంటలు సాగు చేయాలనే దానిపై కొలిక్కి రాలేకపోతున్నారు. వరినార్లు పోస్తే ప్రభుత్వం ధాన్యం కొం టుందో లేదో ఆ తర్వాత పెట్టుబడి నష్టపోతామా ? అన్న మీమాంసలో పడిపోయారు. ప్రతీ సంవత్సరం నల్లగొండ జిల్లాలో యాసంగిలో 4.60లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 4.56లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా లో 2.50లక్షల ఎకరాలు.. మొత్తంగా 11లక్షల66వేల ఎకరాల్లో వరి సేద్యం చేసేవారు. అయితే ఈ సారి ఆరుతడి పంటలు వేసే లా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించాలని నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రణాళికలు ఖరారు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వానాకాలం పంట పూర్తయి నెలరోజు లు అయినప్పటికీ యాసంగి పై ఓ నిర్ణయానికి రాకపోవడంతో అటు అధికారుల కు, ఇటు రైతులకు ఎటూ పాలుపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకేంద్రంపై మెలిక పెడుతోందని ప్రభుత్వం పేర్కొంటూ అందుకనుగుణంగా అసలు ధాన్యం పండించవద్దంటూ చెబుతుండటంతో పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి జిల్లాలో బోరుబావులతోపాటు మైనర్‌, మేజర్‌ ప్రాజెక్టుల కింద పెద్దఎత్తున వ రి సాగవుతోంది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు వరివైపే మొగ్గుతున్నారు. ఇక ఇప్పటివరకు వరి పంటలు సాగు చేసిన పొలాల్లో ఆరుతడి పంటలు పండించడం కష్టతరమని రైతులు పేర్కొంటున్నారు. యాదాద్రి జిల్లాతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మూసీ ప్రాంతాల్లో పెద్దఎత్తున వరి సాగవుతోంది. ఇక నల్లగొండ జిల్లాలో సాగర్‌ ఆయకట్టు అయిన ఎడమకాల్వ కింద,డిండి ప్రాజెక్టు, ఏఎమ్మార్పీ కింద వరి పెద్దఎత్తున సేద్యం అవుతు న్న విషయం తెలిసిందే. దీంతో దిగుబడులు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు మొ గ్గుచూపడం కష్టమేనని సమాచారం. 


ప్రత్యామ్నాయ పంటల సాగుపై స్పెషల్‌ డ్రైవ్‌

వరిస్థానంలో ప్రత్యామ్నాయ పంట లు వేయాలని ప్రభుత్వం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల రెండో వారంలో అందుకు సంబంధించి షెడ్యూల్‌ ఖారారు కానుండగా రెండు, మూడు రోజులు పంటలపై ఓప్రణాళికను రూపొందించనున్నారు. వరిసాగు వద్దని చెబుతూ ఆరుతడి పంటలు వేయాలని స్పష్టం చేయనున్నారు. ఇప్పటి కే రైతులను చైతన్యంచేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధులతోపాటు రైతుబంధు సమితి సభ్యులూ గ్రామాల్లో రైతుల కు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే చాలావరకు వానాకాలం పంటలు వరికోత లు పూర్తయ్యాయి. రైతులు యాసంగి సాగు కు సిద్ధమవుతున్నారు. ఉప్పు డు బియ్యం తీసుకోబోమని ఎఫ్‌సీఐ స్పష్టం చేయడంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈసమస్యను అధిగమించడానికి వరి సాగును నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఏ పంటలు సాగు చేయాలనే దానిపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్ణయించనున్నారు. ఈస్పెషల్‌ డ్రైవ్‌కోసం వ్యవసాయశాఖ కమిషనరేట్‌ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ఆస క్తిలేని సమయంలో వారిని ఎలాగైనా ఆ పంటలవైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోనున్నారు.వరికి బదులు ఏ పంటలు వేస్తే ఎంత లాభం వస్తుంది అనే అంశంపై రైతులకు తెలియజేయనున్నారు. ఇకపోతే ప్రభుత్వం జోన్లవారీగా జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే యోచనలో ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను దక్షిణ తెలంగాణ జోన్‌లోకి మార్చి అందులో ప్రణాళికబద్దంగా పంటలు సాగు చేపే పనుల్లో పడ్డారు. 


రైతులను మెప్పించేదెలా ?

ఉమ్మడి  జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా నీటి వనరులు ఉన్న నేపథ్యంలో వరిసా గు కాకుండా ఆరుతడి పంటలు వేయాలని రైతులను మెప్పించడం అంతసులువు కాదనేది స్పష్టమవుతోంది. వ్యవసాయ శాఖ అధికారులకు ఈ విషయం అవగతంకావడంతో గ్రామాలకు వెళ్లి వారిని ఏ విధంగా ప్రత్యామ్నాయం వైపు మళ్లించాలనే దానిపై ఆలోచిస్తున్నారు. రైతువేదికల వద్ద గ్రామసభలు ఏర్పాటు చేసి రైతు లకు అవగాహన కల్పించను న్నారు. ఆరుతడి పంటలు వేస్తే లాభాలు, అందుకనుగుణంగా మార్కెటింగ్‌ సౌకర్యం గురించి చెప్పాలని యోచిస్తున్నా రు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో యాసంగి సందడి మొదలుకాలేదు. ఇకపోతే ఇప్పటికే దేవరకొండ, మునుగోడువంటి ప్రాంతాల్లో కొంతమంది రైతులు వేరుశెనగవంటి పంట ల సాగువైపు మళ్లినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. 11లక్షల66వేల ఎకరాలకు పైగా యాసంగిలో వరి సేద్యం అవుతున్న నేపథ్యంలో ఒకేసారి ఇంత పెద్దఎత్తున వరిని నియంత్రించాలంటే అంత సులువుకాదని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా నచ్చజెప్పాలనే విషయంపై రాష్ట్రస్థాయిలో ఇటు మూడు జిల్లాల్లోని వ్యవసాయశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే వానాకాలం సాగులో వరి సేద్యం పెద్దఎత్తున కావడంతోపాటు దిగుబడి కూడా కనీవినీ ఎరుగనిరీతిలో వచ్చింది. దిగుబడి అధికంగా వస్తుండటం, వరిలో తెగుళ్లు లేకపోవడం వల్లయాసంగిలో వరి వేస్తేనే మంచిది అన్న విధంగా రైతులు ఆలోచన చేస్తుండగా వ్యవసాయశాఖ మాత్రం ఆరుతడి పంటలు తప్పనిసరి అని తేల్చి చెబుతోంది. మున్ముందు ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటుంది, రైతులు ఏ విధంగా ఇతర పంటల వైపు మొగ్గుచూపుతారనే దానిపై వేచి చూడాల్సి ఉంది. 


వరి సాగు వద్దంటే కష్టమే : యాదయ్య, గోపులాపురం, తిప్పర్తి 

ప్రభుత్వం వరి సాగు వద్దంటే కష్టమే. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేయాలంటున్నారు. ఆరుతడి పంటలు వేయడం వల్ల రైతులకు గిట్టుబాటు కాదు. ఆ పంటలను అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. రైతులు ఆరుతడి పంటలే వేయాలి : శ్రీధర్‌రెడ్డి, జేడీఏ, నల్లగొండ

ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు ఆరుతడి పంటలే వేయాలి. వరి పంటను వేయకూడదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.  గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తాం. ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తు ప్రచారం

యాదాద్రి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రచారం చేసేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. మార్కెటింగ్‌, విత్తన డీలర్లు, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బ్యానర్లను ఏర్పాటుచేశారు. ‘‘యాసంగిలో పండించే వరి ధాన్యం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోనందువల్ల.. యాసంగి పంట తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయదు. వరిపంటకు బదులు మినుము, పెసర, నువ్వులు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, శనగలు మొదలైన ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందిగా సూచించనైనది..’’ అని బ్యానర్లు ఏర్పాటుచేశారు. వరి విత్తన వంగడాలను విక్రయించవద్దని జిల్లా యంత్రాంగం డీలర్లకు ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పటికే వరి విత్తనాల స్టాక్‌ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. దుకాణాల్లో ఉన్న వరి విత్తనాల స్టాక్‌ వివరాలను అధికారులు నమోదు చేసుకుని, తమ అనుమతి లేకుండా రైతులకు విక్రయించవద్దంటూ ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 17 మండలాల్లోనూ వరి సాగుచేస్తారు. వానాకాలంలో మొత్తం 4.30లక్షల ఎకరాల్లో పలు పంటలను సాగు చేయగా, వీటిలో 2.69 లక్షల ఎకరాల్లో వరి, 1.53లక్షల ఎకరాల్లో పత్తి, దాదాపు 26,000 ఎకరాల విస్తీర్ణంలో కంది, నూనెగింజలు, ఇతర పంటలు సాగు చేశారు. వానాకాలంలో పండించిన వరి దాదాపు 4లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు సాధారణంగా 2.17లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తారు. యాసంగిలో వీలైనంత వరకు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి మళ్లించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ యాసంగిలో సేద్యం చేయడానికి మరికొన్ని రోజులు ఉండగానే వ్యవసాయ శాఖ ముందస్తుగానే ముమ్మరంగా ప్రచారం చేపడుతోంది. 

Advertisement
Advertisement