Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయోమయం.. గందరగోళం...

ప్రభుత్వ ఉద్యోగుల విభజన ప్రక్రియపై అసంతృప్తి   
విభజిత జిల్లాల వారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ ఏదని ప్రశ్న
కొత్త పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్‌
వరంగల్‌, హన్మకొండ జిల్లా కేంద్రాలకు అధిక డిమాండ్‌
జూనియర్లు యాదాద్రి, కాళేశ్వరం జోన్లకు వెళ్లక తప్పని పరిస్థితి
ఉపాధ్యాయుల విభజన ఊసే లేదు
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విస్మరణ


హనుమకొండ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల విభజన ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఉద్యోగులు ఒకింత ఆందోళనకు, గందరగోళానికి లోనవుతున్నారు. క్యాడర్‌ స్ర్టెంత్‌ విభజించకుండా, నూతన జిల్లాలు, నూతన జోన్లు, నూతన మల్టీ జోన్ల వారీగా కొత్త పోస్టులను మంజూరు చేయకుండా ప్రభుత్వం విభజన ప్రక్రియను చేపట్టడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రక్రియ తీవ్ర అయోమయానికి దారితీసే పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తమతో సమావేశమై చర్చించినప్పటికీ తమ అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నాయకులు  విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ విభజనకు జారీ చేసిన మార్గదర్శకాల్లో కూడా స్పష్టత లేదని అంటున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా విభజన అనంతరం ఏర్పడిన ఆరు జిల్లాలైన వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు...  భద్రాద్రి,  యాదాద్రి,  కాళేశ్వరం జోన్‌ల పరిధిలోకి వెళ్లాయి. దీంతో రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో లేని సం క్షిష్ట పరిస్థితి ఇక్కడే ఏర్పడింది. ఇప్పుడు అందరి దృష్టి భద్రాది జోన్‌ పరిధిలోని వరంగల్‌, హన్మకొండ జిల్లా కేంద్రాల పైనే ఉంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఇక్కడికే ఆప్షన్‌ పెట్టుకుంటే విభజన ప్రక్రియపై తీవ్ర ఒత్తిడి పడే పరిస్థితి ఉంది. జనగామ, ములుగు, భూపాలపల్లి జి ల్లాల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారు యాదాద్రి, కాళేశ్వరం జోన్‌ల పరిధిలోకి వెళ్లారు. వారు కూడా స్థానికత పేరుతో వరంగల్‌, హన్మకొండ జిల్లా కేం ద్రాలనే ఆప్షన్‌గా ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంది. దీనితో పరిస్థితి మరింత సంక్షిష్టంగా మారనున్నది.

మిగతా వారికి...?
జోనల్‌ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో, మాడల్స్‌ స్కూల్స్‌, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగ విభజన ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులకే ప్రకటించారు. ఉపాధ్యాయుల గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వం వీరి విషయంలో విడిగా జీవో ఇవ్వనున్నట్టు చెబుతోంది. అది ఎప్పుడనేది స్పష్టత ఇవ్వలేదు. తమ పరిస్థితి ఏమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. వీరిని కూడా వీలైనంత త్వరగా జోనల్‌ వ్యవస్థ ప్రకారం కేటాయించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ రంగ, కార్పొరేషన్‌, స్థానిక సంస్థల్లో సుమారు లక్షా 20వేల మంది ఉద్యోగులు ఉన్నట్టు అంచనా.

మూడు జిల్లాల్లో గందరగోళం
జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ జిల్లాలు ప్రస్తుతం యాదాద్రి, కాళేశ్వరం జోన్‌ల పరిధిలో ఉన్నాయి.  ఈ మూడు జిల్లాల్లో  పనిచేసే ఉద్యోగులంతా స్థానికత పరంగా భద్రాది జోన్‌లోకి వచ్చేవారే. వీరంతా యాదాద్రి, కాళేశ్వరం జోన్‌లలోనైనా ఉండవచ్చు... లేదా భద్రాది జోన్‌లోకైనా రావచ్చు. సహజంగానే ఈ ఉద్యోగులంతా స్థానికతను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌, హన్మకొండ జిల్లాలకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ అన్ని పోస్టులేవి? అప్పుడు సీనియర్లు మాత్రమే ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుంది. జూనియర్లంతా విధిలేక వేరే జోన్లకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు. భవిష్యత్తులో వీరంతా యాదాద్రి, కాళేశ్వరం జోన్‌ల పరిధికే పరిమితం కావాల్సి వస్తుంది. దీంతో ఈ మూడు జిల్లాల ఉద్యోగులంతా విభజన ప్రక్రియ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జనగామ జిల్లా ఉద్యోగులకు సంబంధించి మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఈ జిల్లాకు   చెందిన రెండు మండలాలు చేర్యాల, మద్దూరు సిద్దిపేట జిల్లాలోకి వెళ్ళాయి. ఫలితంగా ఈ మండలాల ఉద్యోగులు రాజన్న సిరిసిల్ల జోన్‌ పరిధిలోకి వెళ్ళారు. వీరు కూడా స్థానికతను డిమాండ్‌ చేస్తూ వరంగల్‌కే ఆప్షన్‌ పెట్టుకోవచ్చు. పోస్టులే లేనప్పుడు వీరి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. అదే క్యాడర్‌ స్ట్రెంత్‌ పక్రటిస్తే ఉద్యోగులు ఒక అంచనాకు వస్తారు. పెట్టుకునే వారు ఆప్షన్‌ పెట్టుకుంటారు. లేని వారు లేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.

క్యాడర్‌ స్ట్రెంత్‌పై స్పష్టత ఏదీ?

ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్న పోస్టులను విభజించాలని మొదటి నుంచీ కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు? అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరిని కొత్త జిల్లాలకు పంపించారు. ఇప్పుడు కొత్త జిల్లాల పరంగా ఏ ప్రభుత్వ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉండింది. ప్రభుత్వం ఉన్న పోస్టులనే కొత్త జిల్లాలకు విభజించిందే కానీ,  కొత్త పోస్టులను మంజూరు చేయలేదు.  కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్ల వారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌ను ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడే ఉద్యోగులకు ఒక స్పష్టత వస్తుందంటున్నారు. దీనివల్ల ఒక ఉద్యోగికి తన కేడర్‌కు సంబంధించిన పోస్టులు జోన్‌ల వారీగా ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఈ ప్రక్రియను ప్రకటించకుండానే విభజన ప్రక్రియను చేపట్టడంతో ఉద్యోగులు గందరగోళానికి లోనయ్యే పరిస్థితి ఏర్పడింది.

రేపటికల్లా సీనియారిటీ లిస్టు
హనుమకొండ (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యోగుల లోకల్‌ క్యాడర్‌ సీనియారిటీ లిస్టు బుధవారం సాయం  త్రం కల్లా సిద్ధం కానుంది. ఈ మేరకు  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.   శాఖల వారీగా వివిఽధ కేటగిరీ పోస్టుల్లోని ఉద్యోగుల సీనియారిటీని రూపొందించాలని సూచించారు. ఇందుకు సంబంధించి తయారుచేసిన ఫార్మాట్‌లో వివరాలు పొందుపరచాలని కోరారు. ఈ జాబితా ఆధారంగా నూతన లోకల్‌ కేడర్‌లకు కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు.

ఒకరకమైన బదిలీలే...
హనుమకొండ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన లోకల్‌ కేడర్‌ కేటాయింపుల ప్రక్రియ ఒకరకంగా బదిలీల ప్రక్రియ లాగానే కనిపిస్తోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేపడతామని గతంలో చెప్పి, ఇప్పుడు సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు నష్టపోతారని అంటున్నారు. దీనికితోడు ఆప్షన్ల ఎంపికలో వివిధ కారణాల పేరుతో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని దీనివల్ల కూడా నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు.   కొత్త జిల్లాల ఆధారంగా ఏర్పాటుచేసిన జోన్‌లకు అలాట్‌ అయితే, ఇక ఎప్పటికీ అదే జోన్‌ల పరిధిలో ఉండాల్సి రావడం ఇబ్బందికరమైన విషయమని వారు చెబుతున్నారు. కేడర్‌ స్ర్టెంత్‌ను ఇక కొత్త జిల్లాల వారీగా రూపొందించడమే కాకుండా, మండలాలు, డివిజన్ల వారీగా కూడా రూపొందించాలని కోరుతున్నారు.

అదనపు పోస్టులు మంజూరు చేయాలి..
- ఎ,జగన్‌మోహన్‌రావు, టీజీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా  పరిస్థితి  ప్రత్యేకంగా ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆరు జిల్లాలుగా  విడిపోయింది. భౌగోళికంగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది వరంగల్‌, హన్మకొండ పట్టణాల్లో స్థిరపడ్డారు. స్థానికత కారణంగా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాల ఉద్యోగులు కూడా వరంగల్‌, హన్మకొండకు రావాలని కోరుకుంటారు. దీని వల్ల ఈ రెండు జిల్లాలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఫలితంగా విభజన ప్రక్రియ వారికి కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. ఈ రెండు జిల్లాల్లోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అదనపు పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉద్యోగుల విభజన జరగడానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేస్తే బాగుంటుంది.

Advertisement
Advertisement