అంపైర్‌ వల్లే ఓడాం!

ABN , First Publish Date - 2020-09-22T09:35:56+05:30 IST

ఉత్కంఠ భరితంగా ముగిసిన పంజాబ్‌, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ సరికొత్త వివాదానికి దారి తీసింది.

అంపైర్‌ వల్లే ఓడాం!

రెఫరీకి పంజాబ్‌ ఫిర్యాదు

దుబాయ్‌: ఉత్కంఠ భరితంగా ముగిసిన పంజాబ్‌, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ సరికొత్త వివాదానికి దారి తీసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు 157 పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌ ద్వారా ఢిల్లీ గెలిచిన విషయం తెలిసిందే. అయితే 19వ ఓవర్‌లో లెగ్‌ అంపైర్‌ తీసుకున్న షార్ట్‌ రన్‌ నిర్ణయంతోనే తాము ఓడామని పంజాబ్‌ జట్టు ఆరోపించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని మ్యాచ్‌ రెఫరీకి ఫిర్యాదు చేసింది. జరిగిందేమిటంటే.. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మూడో బంతిని మయాంక్‌ ఎక్స్‌ట్రా కవర్‌ వైపు ఆడి రెండు పరుగులు తీశాడు. అయితే తొలి రన్‌ సమయంలో నాన్‌ స్ట్రయికర్‌ క్రిస్‌ జోర్డాన్‌ తన బ్యాటును క్రీజులో సరిగా ఉంచలేదని లెగ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఒక పరుగును తగ్గించాడు.


ఇక చివరి ఓవర్‌లో పంజాబ్‌ విజయానికి 13 పరుగులు అవసరపడగా మయాంక్‌ తొలి మూడు బంతుల్లోనే 12 రన్స్‌ సాధించి అవుటయ్యాడు. అటు మ్యాచ్‌ కూడా టై అయింది. కానీ టీవీ రీప్లేలో జోర్డాన్‌ బ్యాటు క్రీజులో పెట్టినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో కోత విధించిన ఆ పరుగును కలిపితే పంజాబ్‌కు 13 పరుగులు వచ్చేవి.. మ్యాచ్‌లో నెగ్గేది. అందుకే అంపైర్‌ తప్పిదంపై అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ ఆటగాళ్లు, ఫ్రాంచైజీ సహ యజమానురాలు ప్రీతీ జింటా అసంతృప్తిని వ్యక్తం చేశారు.


మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అంపైర్‌కివ్వాలి

లెగ్‌ అంపైర్‌ అనాలోచిత నిర్ణయంపై మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఘాటుగా స్పందించాడు. ‘స్టొయిని్‌సకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను నేను అంగీకరించను. షార్ట్‌ రన్‌ నిర్ణయాన్ని తీసుకున్న ఆ లెగ్‌ అంపైర్‌ దీనికి అర్హుడు. అది షార్ట్‌ రన్‌ కాదు.. మ్యాచ్‌లో తేడా అదే’ అని వీరూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-09-22T09:35:56+05:30 IST