‘కాళేశ్వరం’ లోపాలు బయటపడుతున్నాయి

ABN , First Publish Date - 2020-07-10T08:27:38+05:30 IST

‘కాళేశ్వరం’ లోపాలు బయటపడుతున్నాయి

‘కాళేశ్వరం’ లోపాలు బయటపడుతున్నాయి

నాసిరకంగా కాల్వల నిర్మాణ పనులు: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. లేకుంటే దీక్ష: జగ్గారెడ్డి 

 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీ వరకు నిర్మించిన కీలకమైన కాల్వకు ఇంజనీరింగ్‌ పనులు సరిగా చేయలేదన్నారు. గతంలోనూ ఈ కాల్వకు పగుళ్లు ఏర్పడ్డాయని, అయితే అవి బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలు, నాణ్యతా లోపంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై ఆందోళనకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోందని చెప్పారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాటికల్లా ఉత్తర్వులు రాని పక్షంలో శనివారం తాను ఒక రోజు దీక్ష చేపడతానని వెల్లడించారు. అయినా ప్రకటన రాకపోతే హైదరాబాద్‌ కేంద్రంగా ప్రతి రోజూ కార్యక్రమం చేపడతానని పేర్కొన్నారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఆ పథకానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. కేసీఆర్‌కు చెంచాగిరీని మానుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచేందుకు కర్నాటక చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. సచివాలయ ప్రాంగణంలోని రెండు మసీదులు, ఒక ఆలయాన్ని కూల్చివేయడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. రాష్ట్రంలో కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే.. మొక్కలు నాటుతూ, సచివాలయాన్ని కూలగొట్టడం పైశాచికత్వమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అన్నారు. 


ప్లకార్డు పట్టుకుంటే అరెస్టు చేస్తారా?: రేవంత్‌

ముఖ్యమంత్రి ఎక్కడంటూ ప్లకార్డు ప్రదర్శించినందుకు కాంగ్రెస్‌ కార్యకర్త సాయిబాబాను అరెస్టు చేయడం దారుణమని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రేవంత్‌పోలీస్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. బుధవారం రాత్రి నుంచి సాయిబాబాను స్టేషన్‌లోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు.


సీతక్కకు చంద్రబాబు, ఉత్తమ్‌ జన్మదిన శుభాకాంక్షలు 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, నారా లోకేశ్‌, మధుయాష్కీగౌడ్‌.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-07-10T08:27:38+05:30 IST