కాంగ్రెస్‌ అనాదరణ–మోదీ ఆపన్నహస్తం

ABN , First Publish Date - 2021-08-03T06:23:30+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూలై 26న కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఆరోగ్య, న్యాయ, సామాజిక సంక్షేమ, విద్యా శాఖ కార్యదర్శులను...

కాంగ్రెస్‌ అనాదరణ–మోదీ ఆపన్నహస్తం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జూలై 26న కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఆరోగ్య, న్యాయ, సామాజిక సంక్షేమ, విద్యా శాఖ కార్యదర్శులను సమావేశానికి పిలిచారు. వైద్యవిద్యలో అఖిల భారత కోటాలో వెనుకబడినవర్గాలకు రిజర్వేషన్ కల్పించే విషయాన్ని వెంటనే సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. ఓబీసీలు ఈ మేరకు చేస్తున్న డిమాండ్ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నది. కోర్టుల్లో కూడా అనేక కేసులు కొనసాగుతున్నాయి. ఓబీసీలతో పాటు ఆర్థికంగా బలహీనవర్గాలకు కూడా మెడికల్ సీట్లలో రిజర్వేషన్ కల్పించాల్సిందిగా ఆయన ఆదేశించారు. సరిగ్గా మూడు రోజుల తర్వాత జూలై 29న మెడికల్, డెంటల్ విద్యాకోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మెడికల్, డెంటల్ విద్యాకోర్సుల్లో అఖిల భారత కోటాలో ఎంబిబిఎస్ విద్యార్థులకు మొత్తం లభ్యమయ్యే కోర్సుల్లో 15శాతం మందికి, పీజీ సీట్లలో 50శాతం మందికి సీట్లు లభిస్తాయి. 2007 తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సీట్లలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడం ప్రారంభించారు. కాని ఓబీసీల గురించి కానీ, ఆర్థికంగా వెనుకబడినవర్గాల గురించి కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ మోదీ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్ పట్ల అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సానుకూల వైఖరితో ఉండడం మూలంగానే ఇవాళ అత్యంత కీలకమైన వైద్యవిద్యాకోర్సుల్లో ఓబీసీలకు 4వేల సీట్లు లభించేందుకు అవకాశం కలిగింది.


ఓబీసీలంటే కాంగ్రెస్‌కు ఎప్పుడూ విలువ లేదు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. అనేకసార్లు ఆ పార్టీ అక్కసును కూడా ప్రకటించింది. 2014 ఎన్నికల ప్రచారంలో ‘మోదీ నీచ జాతి రాజకీయాలు చేస్తున్నారని’ కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా విమర్శించారు. మోదీ ఇందుకు ఏమీ నొచ్చుకోలేదు. ‘అవును నేను తక్కువ కులంలో జన్మించాను. కాని నేను సమైక్య భారతం నిర్మించేందుకే కల కన్నాను. మీరెన్నైనా నన్ను దూషించండి. నన్ను ఉరితీయండి. కాని కిందికులాలకు చెందిన సోదరులను అవమానపరచకండి. నేను సామాజికంగా వెనుకబడినవర్గం నుంచి వచ్చాను. అందువల్ల ఆ వర్గాల కోసం నేను అవలంభించే రాజకీయాలు తక్కువజాతి రాజకీయాలే అవుతాయి..’ అని ఆయన స్పష్టం చేశారు. ‘బహుశా అణగారినవర్గాల నిస్వార్థం, త్యాగాలు, సాహసాలే ఈ దేశం ఉన్నత స్థాయికి ఎదగడంలో కీలకపాత్ర పోషిస్తాయన్న విషయం కొంతమందికి తెలియదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో 283 సీట్లు సాధించి బిజెపి అధికారంలోకి వచ్చింది.


2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మోదీ కులాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ‘నరేంద్రమోదీ తక్కువజాతికి చెందిన వ్యక్తి. అందుకే ఆయన నాగరికంగా వ్యవహరించడం లేదు..’ అని ఒకప్పడు రాజీవ్‌గాంధీ కుడిభుజం, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ నిందించారు. పైగా ‘గందీ నాలీకీ కీడా’ (మురికి గుంటలో ఉండే పురుగు) అన్నారు. మోదీ జీవితచరిత్ర చదివిన వారెవరికైనా ఆయన కిందిజాతికి చెందిన ఓబీసీ వర్గాన్నుంచి వచ్చారని, వడ్ నగర్ అనే చిన్న రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్ముకుని జీవించే ఆయన తండ్రి ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో కిటీకీలు, నల్లా సదుపాయం కూడా లేని చిన్న ఇంట్లో నివసించేవారని తెలుసు. అలాంటి వ్యక్తిని అవమానించిన కాంగ్రెస్‌ను ఓబీసీలు ఎందుకు ఆదరిస్తారు? నాడు కాంగ్రెస్ అవమానకర భాషను గుజరాతీ ప్రజలు తీవ్రంగా తిరస్కరించి మరోసారి బీజేపీకి ఘనవిజయాన్ని సమకూర్చారు. 2017లో కాంగ్రెస్‌లో చేతులు కలిపిన గుజరాత్ ఓబీసీ నేత అల్పేష్ థాకూర్ 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో అన్ని పదవులకూ రాజీనామా చేసి భారతీయ జనతాపార్టీలో చేరారు. ఓబీసీ, ఎస్‌సి, ఎస్టీలను ఐక్యం చేసేందుకు ఏక్తా మంచ్‌ను ఏర్పాటు చేసిన అల్పేష్ థాకూర్ కాంగ్రెస్ పార్టీ తనను, తన వర్గీయులను ఘోరంగా అవమానించి నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు కాంగ్రెస్‌లో అవమానం తప్ప మరేమి మిగిలింది?


ఇవాళ భారతీయ జనతాపార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో అత్యధికులు ఓబీసీలు కాగా, బిజెపి శాసనసభ్యులు, ఎంపీలలో అత్యధికులు అదేవర్గానికి చెందినవారు. 113 మంది ఓబీసీలు బిజెపి తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అందుకే ప్రధానమంత్రి స్వయంగా తన మంత్రివర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారు. సమాజంలో ఇప్పటికే అధికఫలితాలు అనుభవిస్తున్న కొన్ని ఓబీసీ వర్గాలకే ప్రయోజనాలు పరిమితం కాకుండా చూసేందుకు భారతీయ జనతాపార్టీ కుర్మీ, కుశావహా, లోధీ, కొయిరీ వంటి వంటి చిన్న యాదవేతర బీసీలను ప్రోత్సహించడం ప్రారంభించింది. ఇలాంటి ఉపవర్గాలను గుర్తించి వారికి అధిక ప్రయోజనాలు దక్కేలా చేసేందుకు రాజ్యాంగంలోని 340వ అధికరణ కింద రాజ్యాంగసవరణ చేసి కమిషన్ వేసింది కూడా మోదీ ప్రభుత్వమే. అంతేకాదు, ఓబీసీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఏర్పర్చిన వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతాపార్టీ సర్కారే. ఈ కమిషన్‌కు సివిల్‌కోర్టు అధికారాలు కల్పించారు. బీసీల ప్రయోజనాలను దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకోవడమే కాక, వారి పరిస్థితులను అధ్యయనం చేసి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి సిఫారసులు చేసే అధికారం కూడా కమిషన్‌కు ఉన్నది.


ప్రపంచంలో అతి పెద్ద రాజకీయపార్టీ అయిన బిజెపిలో చేరిన 18 కోట్ల మందిలో అత్యధికులు ఈ వర్గాలకు చెందిన వారే కాగా దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో ఓబీసీలకు, ఇతర నిమ్నవర్గాలకు బిజెపి అత్యధికసీట్లు కేటాయిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోనే కాదు, రాష్ట్రాల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, గవర్నర్లుగా కూడా బిజెపి వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించింది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా స్కీమ్, ఉజ్జ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాల్లో ఓబీసీలు, ఇతర నిమ్నవర్గాలకే అధిక ప్రయోజనం లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజిక సంక్షేమ పథకాలను సమీక్షించిన మోదీ ‘జాతీయ వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ’ వంటి అనేక సంస్థల పనితీరును మెరుగుపరిచారు. ఓబీసీలకు రుణాలు, ఉపకారవేతనాలు, హాస్టల్ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లభించేలా చూశారు. ఓబీసీల్లో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం కల్పించారు.


ఓబీసీలు, దళితులు, అణగారినవర్గాలకు బీజేపీ, మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. కానీ పేద ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన, అణగారినవర్గాల శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తున్న మోదీని ఎదుర్కోవడం తమకు సులభం కాదని ఎన్ని పరాజయాల తర్వాతనైనా ప్రతిపక్షాలకు అర్థం కాకపోవడం విడ్డూరం. తాము అధికారంలో ఉన్నంతకాలం అగ్రవర్ణాలకు, భూస్వాములకు, ఆశ్రిత పెట్టుబడిదారులకు, బడా వ్యాపారులకు ఊడిగం చేసిన కాంగ్రెస్‌కు ఇంకా బిజెపి అగ్రవర్ణాల పార్టీగానే కనిపిస్తున్నదంటే ఆ పార్టీని కళ్ళున్న కబోదిగా అభివర్ణించాలి.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-08-03T06:23:30+05:30 IST