పంజాబ్ నేర్పిన పాఠాలు.. మేఘాలయ కాంగ్రెస్‌లో చల్లారిన మంటలు

ABN , First Publish Date - 2021-10-05T19:26:54+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ పరిణామాల నుంచి ఏఐసీసీ కొన్ని గుణపాఠాలను నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. పంజాబ్ తరహాలో..

పంజాబ్ నేర్పిన పాఠాలు.. మేఘాలయ కాంగ్రెస్‌లో చల్లారిన మంటలు

గౌహతి: పంజాబ్ కాంగ్రెస్ పరిణామాల నుంచి ఏఐసీసీ కొన్ని గుణపాఠాలను నేర్చుకున్నట్టే కనిపిస్తోంది.  పంజాబ్ తరహాలో మేఘాలయ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభాన్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికైతే చల్లబరిచింది. గత రెండు రోజులుగా మేఘాలయ నేతలు ముకుల్ సంగ్మా, విన్సెంట్ హెచ్ పాలతో న్యూఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమావేశమై, రాష్ట్ర యూనిట్‌లో తలెత్తిన అంతర్గత పోరును చల్లబరిచారు. నాయకుల మధ్య సయోధ్యను నెలకొల్పారు.


మేఘాలయ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోవడం ఇటీవల చోటుచేసుకున్న పరిణామం. షిల్లాంగ్ ఎంపీ పాలను స్టేట్ చీఫ్‌గా ఏఐసీసీ నియమించడంతో వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే మేఘాలయా కాంగ్రెస్ నేతలతో సోనియాగాంధీ, రాహుల్ సమావేశం జరిపి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. ''సోనియాగాంధీని సోమవారంనాడు కలిశాం. సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. రాహుల్‌ను కూడా కలిశాం. అపోహలు తొలగిపోయాయి'' అని పాల తెలిపారు. సంగ్మా సమస్య ఆయన ఒక్కరిదే కాదనీ, ఏఐసీసీదని అన్నారు.


పాలను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంతో సంగ్మా అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. 2023 ఎన్నికల్లో సీఎం పదవికి పాల ప్రధాన పోటీదారు కావచ్చనే అభిప్రాయంతో ఆయన ఉండటమే కారణమని ప్రచారం జరిగింది. అయితే, పాల ఆ అపోహలను కొట్టిపారేశారు. తాను చాలా చిన్న వ్యక్తిననీ, రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు కొత్త కూడా కాదని అన్నారు. మూడున్నరేళ్ల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశానని, 12 ఏళ్లుగా ఎంపీగా ఉన్నానని చెప్పారు. అయినా తాను జూనియర్‌నని, పార్టీలో చిన్న వ్యక్తినని పాల వివరణ ఇచ్చారు. అధిష్ఠానం కోరిక మేరకు మూడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేస్తామని పాల స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-05T19:26:54+05:30 IST