రెండు డిమాండ్లు రాష్ట్రపతి ముందుంచాం: రాహుల్

ABN , First Publish Date - 2021-10-13T20:20:22+05:30 IST

లఖింపూర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి..

రెండు డిమాండ్లు రాష్ట్రపతి ముందుంచాం: రాహుల్

న్యూఢిల్లీ: లఖింపూర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసినట్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి ఈ మేరకు ఒక మెమొరాండం అందజేసింది. అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ఈ ఘటనలో నిందితుడి తండ్రి హోం శాఖ సహాయ మంత్రి అయినందున ఆయన పదవిలో ఉండే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని, ఆ దృష్ట్యా ఆయనను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి చెప్పామని అన్నారు. సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలనే మరో డిమాండ్‌ను కూడా రాష్ట్రపతి ముందు ఉంచినట్టు చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయడం లేదా పదవి నుంచి తప్పించినప్పుడు మాత్రమే లఖింపూర్ హింసాత్మక ఘటనలో న్యాయం జరుగుతుందని రాహుల్ పేర్కొన్నారు.


లఖింపూర్ ఘటనపై ఈరోజే తాను ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-13T20:20:22+05:30 IST