ఇంధనం ధరల పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

ABN , First Publish Date - 2021-06-11T22:50:17+05:30 IST

అడ్డూఅదుపూ లేకుండా రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ..

ఇంధనం ధరల పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

న్యూఢిల్లీ: అడ్డూఅదుపూ లేకుండా రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు దేశవ్యాప్త నిరసనలు నిర్వహించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్లకార్డులతో, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు.


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని సామాన్య ప్రజలను మోదీ ప్రభుత్వం లూటీ చేయడం మానాలని అన్నారు. గత ఐదు నెలల్లో ఇంధనం ధరలు 44 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఒకవైపు కోవిడ్ మహమ్మారితో ప్రజలు బాధపడుతుండే, మరో వైపు కేంద్రం ఇంధనం ధరలు పెంచుకుండా పోతోందని, పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ.6,000 చొప్పున కేంద్రం జమ చేయాలని తాము కోరుతున్నామని అన్నారు. ఇంధనం ధరలపై ఎక్సైజ్ డ్యూటీ అనేక సార్లు పెంచుకుంటూ పోవడం వల్ల 250కి పైగా నగరాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100 దాటిపోయిందని పేర్కొన్నారు.


''కేంద్రం సెట్రల్ విస్తా ప్రాజెక్టు నిర్మాణంలో బిజీగా ఉంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్‌పై పన్ను రూ.9.20గా ఉంది. ఇప్పుడది రూ.32 అయింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపును పూర్తిగా ఉపసంహరించుకోవాలి. జీస్‌టీ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకురావాలి'' అని వేణుగోపాల్ అన్నారు.


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్ నిరసనలకు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సారథ్యం వహించారు. ఎక్సైజ్ డ్యూటీని కనీసం 25 శాతం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంధనం ధరల పెంపుపై ఒకప్పుడు యూపీఏ సర్కార్‌పై నోరు పారేసుకున్న వాళ్లంతా ఇప్పుడు ఎక్కడకు పోయారని ఆయన నిలదీశారు. ఇంధనం ధరలు పెరుగుతూ పోతుండటంతో నిత్యవాసరాల ధరలు కొండొక్కుతున్నాయని పేర్కొన్నారు. కాగా, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాంగ్రెస్ వర్కర్లు వినూత్న నిరసన తెలిపారు. ఒక తుక్కుకారును ఎద్దుల బండిపై ఉంచి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు, చెన్నైలోని కీల్పాక్‌లోనూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి సారథ్యంలో పార్టీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.

Updated Date - 2021-06-11T22:50:17+05:30 IST