ప్రతిపక్ష పార్టీల భేటీకి హాజరుపై నిర్ణయం టీఎంసీదే : కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-29T00:13:09+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు

ప్రతిపక్ష పార్టీల భేటీకి హాజరుపై నిర్ణయం టీఎంసీదే : కాంగ్రెస్

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరవడంపై నిర్ణయం తీసుకోవలసినది టీఎంసీయేనని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సోమవారం ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి గైర్హాజరవాలని టీఎంసీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29 (సోమవారం) నుంచి ప్రారంభమవుతాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23 వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకాకూడదని టీఎంసీ నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఓ వార్తా సంస్థతో ఆదివారం మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు అభిప్రాయాలను పంచుకోవడం కోసం ప్రతి ప్రతిపక్ష పార్టీని తాము ఆహ్వానించామని చెప్పారు. ఈ సమావేశానికి హాజరవడంపై నిర్ణయం తీసుకోవలసినది వారేనని (టీఎంసీయేనని)  చెప్పారు. ఖర్గే ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పార్లమెంటులో లేవనెత్తవలసిన అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం కోసం సోమవారం జరిగే సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరు కావాలన్నారు. ప్రాధాన్యంగల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. 


ఇదిలావుండగా, టీఎంసీ ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొంది. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించినట్లు టీఎంసీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. 


Updated Date - 2021-11-29T00:13:09+05:30 IST