పేర్లు మార్చి పధకాలు అమలు చేసిన ఘనత వైసీపీదే: గంగాధర్

ABN , First Publish Date - 2020-05-30T18:40:06+05:30 IST

పేర్లు మార్చి పధకాలు అమలు చేసిన ఘనత వైసీపీదే: గంగాధర్

పేర్లు మార్చి పధకాలు అమలు చేసిన ఘనత వైసీపీదే: గంగాధర్

విజయవాడ: ఎన్నికలలో ప్రత్యేక హోదా, నవరత్నాల పేర్లతో ప్రజల్ని ఓట్లు అడిగి... చెప్పిన దానికి మాట తప్పి ఇప్పుడు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు, రైతు భరోసాలో అన్ని మార్పులు చేర్పులే అని మండిపడ్డారు. ఎస్టీ,  ఎస్సీ, బీసీల నిధులు అమ్మ ఒడికి మళ్లించారని అన్నారు. పేర్లు మార్చి పధకాలు అమలు చేసిన ఘనత కేవలం జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. ప్రచారం ఎక్కువ పనులు తక్కువ అని ఆయన విమర్శించారు. 


గతంలో కాంగ్రెస్ పార్టీ, అందరికి విద్య పధకాన్ని నేడు జగనన్న విద్యా దీవెనగా మార్పు చేశారని ఆరోపించారు. మద్యం నిషేధం అని చెప్పి మద్యం దుకాణాలు తెరిచి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం  కలిగించే నిర్ణయాలు తీసుకున్న ఘనత వైసీపీదే అని వ్యాఖ్యానించారు. జగనన్న వసతి దీవెన కూడా పాత పథకానికి కొత్త పేరు పెట్టారన్నారు. సంవత్సరంలోనే జగన్ 80 వేల కోట్లు అప్పులు చేసారన్నారు. రాజధాని గురించి స్పష్టత ఇస్తానని ఎక్కడా చెప్పలేదు కానీ... అస్పష్ట ప్రకటనలు చేశారని గంగాధర్ మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా 64 నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. 


ఎన్నికల కమిషనర్ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్తామంటున్నారని... మరి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ఎందుకు రివ్యూకి వెళ్ళలేదని ప్రశ్నించారు. అప్పులు, విద్యుత్ చార్జీలు పెంపు, కరోనా సమయంలో ఆర్థిక సాయం చేయలేదన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారని... తమరెందుకు స్పందించలేదని నిలదీశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు అడగలేకపోతున్నారన్నారు. పూర్తిగా కేంద్రానికి సరెండర్ అయిపోయారని గంగాధర్ వ్యాఖ్యానించారు. 



Updated Date - 2020-05-30T18:40:06+05:30 IST