Abn logo
Oct 27 2021 @ 15:53PM

మన్ కీ బాత్ కాదు.. జన్ కీ బాత్ వినండి మహాప్రభో: కాంగ్రెస్ నేత

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ పక్కన పెట్టి జన్ కీ బాత్ వినాలని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నేత రామా గౌడ్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామా గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పక్షపాతి అని చెప్పుకునే మోదీ ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల హిందువుల కోసమైనా ఇంధన ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో హైదరాబాద్ మహానగరంలో రోడ్ల మీదకు వాహనాలు తీసుకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ఇంధన ధరలను తగ్గించే వరకు సామాన్య ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ధరలను ఇలాగే పెంచుకుంటూ పోతే రోడ్ల మీద బీజేపీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రామా గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, ఎత్తరు నాని, సతీష్, నవీన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.