రాజకీయ కళ కోల్పోయిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-01-27T06:58:12+05:30 IST

‘మేముఇక్కడికి మోదీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము. మా పని పూర్తయింది. మమ్మల్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా...

రాజకీయ కళ కోల్పోయిన కాంగ్రెస్

‘మేముఇక్కడికి మోదీ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇచ్చేందుకు వచ్చాము. మా పని పూర్తయింది. మమ్మల్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా మేము ఎర్రకోటకు చేరుకోగలిగాం. మా లక్ష్యం నెరవేరేంతవరకూ మేము విశ్రమించే ప్రసక్తి లేదు. ప్రస్తుతానికి తిరిగి వెళతాం..’ అని ఒక రైతు ఎర్రకోట వద్ద మీడియాకు తెలిపారు. దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగ విలువలకు సంకేతంగా జరిగే గణతంత్ర దినం రోజే దేశ రాజధానిలో రైతులు సమాంతరంగా ట్రాక్టర్లతో పరేడ్ నిర్వహించడం, అడుగడుగునా నిర్మించిన భద్రతా వలయాల్ని కూడా ఛేదించుకుని, లాఠీలను, బాష్పవాయు గోళాలు ప్రయోగాలను కూడా ఎదుర్కొంటూ ముందుకు రావడం అనేది సాధారణ విషయం కాదు. రైతుల్లో సంఘవ్యతిరేక శక్తులు ప్రవేశించాయని, త్రివర్ణ పతాకానికి పోటీగా మరేవో జెండాలను ఎగురవేశారని విమర్శించడానికి పెద్ద బుర్రలు ఏమీ అవసరం లేదు. కాని రైతులు, రైతుల్లో ప్రవేశించారని చెబుతున్న సంఘ వ్యతిరేక శక్తులు ఇంత ప్రతిఘటన ఎందుకు ప్రదర్శించారన్న విషయం చర్చించవలసి ఉన్నది. కొందరు అభివర్ణిస్తున్నట్లుగా ఒక ఉద్యమం అరాచక రూపం నిజంగా తీసుకుంటున్నట్లయితే అది ఈ దేశంలో రాజకీయ శక్తుల వైఫల్యమే అని అర్థం చేసుకోవల్సి ఉంటుంది. గత రెండు నెలలుగా రైతులు సాగిస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్, వామపక్షాల నుంచి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ వరకు రాజకీయ మద్దతు ప్రకటించినప్పటికీ ప్రత్యక్షంగా ఈ రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి సారథ్యం వహించలేదు.


నిజానికి ఏ రాజకీయ పార్టీకి రైతులకు సారథ్యం వహించగలిగిన సామర్థ్యం కానీ విశ్వసనీయత కానీ లేవు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే నైతిక స్థైర్యం కానీ, కనీసం దాన్ని ఉపయోగించుకోగలిగిన రాజకీయ శక్తియుక్తులు కానీ లేవు. గత ఆరున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్వయంకృతాపరాధాల వల్ల కుదించుకుపోతుంటే. నరేంద్రమోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పద్ధతుల మూలంగా కాంగ్రెస్ అథఃపాతాళానికి కూరుకుపోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కొంత విజయం సాధించినా, నిలదొక్కుకున్నా, ఏ నేత అయినా బలపడినా ఆ పార్టీని మూలాలనుంచి నరకగలిగిన కళను బిజెపి నేర్చుకుంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని చేపట్టిన నరేంద్రమోదీ ఆలోచనా విధానం, అందుకు అనుగుణంగా చేపట్టిన చర్యల మూలంగానే ఇవాళ దేశంలో ప్రతిపక్షం అంటూ లేని పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్‌లో కూడా గొంతెత్తకుండా, ప్రజాస్వామిక ప్రమాణాలను కూడా పాటించకుండా, ప్రతిపక్షాలను పూర్తిగా తెగనరికితే దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్ని ఇచ్చే శక్తులు అంటూ ఉండవు. సోషల్ మీడియా ప్రకటనలు, ట్వీట్లు పిల్లిగొంతుకలుగానే మిగిలిపోతాయి. అప్పుడు ప్రజల ఆందోళన ఏ రూపం తీసుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఒక రాజకీయ నాయకత్వం అంటూ ప్రత్యక్షంగా లేని పరిస్థితుల్లో బలమైన రాతి బారికేడ్లను సైతం కుప్పకూల్చడం, పోలీసు వాహనాలపై దాడులు చేయడం, రాళ్లు రువ్వడం, లాఠీలు ప్రయోగించడం, కత్తుల్ని తిప్పడం, స్వంత జెండాలను ఎగురవేయడం వంటి ఆందోళనా రూపాల్ని ప్రదర్శించారు. దాదాపు 40కి పైగా సంఘాలలో రైతులు సంఘటితమయివున్న పరిస్థితుల్లో ఎవరు ఎవరిని నియంత్రించగలరు? అందుకే దాదాపు రెండు నెలలుగా శాంతియుతంగా సాగిన ఆందోళన ఒక్కసారి పెటిల్లుమని తన మరో రూపాన్ని ప్రదర్శించింది. బలమైన రాజకీయ వ్యూహరచన అంటూ లేకపోతే ఏమి జరుగుతుందో ఇవాళ ఢిల్లీలో ప్రజలకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ప్రజలు రోడ్లపైకి వెళ్లలేకపోవడం, ఎక్కడైనా వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుని మరో వైపు నుంచి వారిని మళ్లించడం, గంటలు గంటలు ట్రాఫిక్ రద్దీల్లో చిక్కుకుపోవడం దాదాపు రెండు నెలలుగా జరుగుతూనే ఉన్నది. రిపబ్లిక్ డే రోజు జరిగినట్లుగా ప్రతి రోజూ వేలాది మంది ఇలాంటి ఆందోళనలే సృష్టిస్తే పరిస్థితి మరింత అస్తవ్యస్తం కాక మానదు.


స్వాతంత్ర్య సమర కాలంలో కూడా ఇలాంటి ఆందోళనలు, హింసాత్మక నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే మొత్తం జాతీయోద్యమానికి కాంగ్రెస్ నాయకత్వం వహించడం వల్ల అది ప్రధానంగా రాజకీయ పోరాటం కాగలిగింది. చివరకు బ్రిటిష్ వారు కాంగ్రెస్‌కే అధికారం అప్పజెప్పి వెళ్లిపోవల్సి వచ్చింది. తర్వాతి కాలంలో దేశంలో ఎన్నో హింసాత్మక ఉద్యమాలు జరిగినప్పటికీ వాటికి రాజకీయ నాయకత్వం లేనందువల్ల అణిచివేతకు గురికావడం తప్ప జరిగిందేమీ లేకపోయింది. ప్రత్యేక తెలంగాణకోసం జరిగిన ఆందోళనలో మిలియన్ మార్చ్ వంటి ఘటనలు, ఆత్మాహుతులు జరిగాయి కాని ప్రధానంగా అది కేసిఆర్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమం అయినందువల్లే విజయవంతం కాగలిగిందన్న విషయం అవాస్తవం కాదు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఇదే కారణాల వల్ల కేసిఆర్‌కు అండగా నిలిచారు. కాని ఇవాళ దేశంలో రెండు నెలలుగా రైతుల ఆందోళన జరుగుతున్నప్పటికీ రైతుల దృష్టిని కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ నేతల దృష్టిని రైతులు కానీ బలంగా ఆకర్షించలేకపోతున్నారు.


ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌లో రాజకీయ నాయకత్వాన్ని అందించే జీవశక్తి లేకపోవడం. బలమైన రాజకీయ నాయకత్వం అందించగలిగిన ఒక పార్టీ బలమైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ ప్రాంతంలో ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుంటుంది. విచిత్రమేమంటే కాంగ్రెస్ తన నాయకత్వాన్ని తానే నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నది. సీతారాం కేసరి స్థానంలో 22 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన సోనియాగాంధీ ఇప్పటికీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. మధ్యలో కొంతకాలం పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సార్వత్రక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడం భరించలేక పార్టీ పగ్గాలు వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేశారు. ఒక సందర్భంలో మరో నేతకు పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ గాంధీ కుటుంబం మరొక నేతకు పగ్గాలు అప్పజెప్పేందుకు వెనుకాడింది. ఇంకెవరైనా పగ్గాలు చేపడితే తాము ప్రాధాన్యత కోల్పోతామని, తన కుమారుడు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశాలు కోల్పోతారని సోనియాగాంధీ భయపడుతున్నట్లు ఆమె చర్యలను బట్టి అర్థమవుతోంది. అధికారాన్ని మరొకరికి అప్పగించడానికి వెనుకాడే నాయకత్వం ఉండడమే కాదు, అవసరమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఆ నాయకత్వానికి లేకపోవడం వల్ల మోదీ వంటి నేతలకు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టగలిగే బలం చేకూరుతోంది. గత ఏడాది ఎప్పుడో దాదాపు 23 మంది పార్టీ నేతలు పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, బలమైన, సమర్థమైన, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఏర్పర్చుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించారు. దీనిపై రణగొణధ్వనులు చెలరేగినప్పటికీ సోనియా ఏ మాత్రం చలించలేదు. చివరకు ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సంస్థాగత ఎన్నికలు జరిపేందుకు సత్వరమే షెడ్యూలు నిర్వహిస్తారని చాలా మంది భావించారు. తీరా వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత సంస్థాగత ఎన్నికలను జూన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. పైగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కోరిన నేతలపై అశోక్ గెహ్లాట్ వంటి సోనియా విధేయులు దాడి చేశారు. ‘సోనియా లేకపోతే మీరెక్కడుండేవారు? ఆమె లేకపోతే మీకు పదవులు ఉండేవి కావు, మిమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు..’ అని విమర్శించారు. ‘ఇది నిజమే కావచ్చు. కాని భారత జాతీయ కాంగ్రెస్ లేకపోతే ఎవరూ లేరు. నేనూ లేనూ, మీరూ లేరు..’ అని మరో నేత ఆనంద్ శర్మ ఆయనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. చివరికి రాహుల్ గాంధీ వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది.


అసలు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలను మరో ఆరునెలలు ఎందుకు వాయిదా వేయాలనుకున్నారు? మరో మూడు నెలల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చెందింది, ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోరపరాజయం ఎదుర్కొంటే దాని ప్రభావం కొత్తగా ఎన్నికయిన పార్టీ అధ్యక్షుడిపై పడుతుందనే ఉద్దేశంతోనే సంస్థాగత ఎన్నికలను వాయిదా వేశారని ఒక పార్టీ నాయకుడు చెప్పారు. సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయని, తాను ఇప్పుడే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే ఓటమి కత్తి తన మెడపై వ్రేళ్లాడుతుందన్న భయంతోనే ఆయన పలాయన మంత్రం చిత్తగించారని ఈ నాయకుడు వెల్లడించారు. నాయకుడికి కావల్సింది పలాయనమంత్రం కాదు సర్వశక్తులనూ కూడగట్టుకుని, కార్యకర్తల్లోనూ, నేతల్లోనూ ఆత్మస్థైర్యం నింపి, వేగంగా నిర్ణయాలు తీసుకుని పార్టీని నడిపించే శక్తి. అది లేనందువల్లే వాయిదాల మధ్య కాంగ్రెస్ కొన ఊపిరితో కొనసాగుతూనే ఉంటుంది.


ఇదే పరిస్థితి గతంలో లేదని కాదు. నరేంద్రమోదీ కంటే గతంలో రాజీవ్ గాంధీకి లోక్‌సభలో అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు గడగడ లాడించాయి. 1989లో బోఫోర్స్ కుంభకోణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ (కాగ్) నివేదిక వెలువడిన తర్వాత ప్రతిపక్షనేతలందరూ ఏకమయ్యారు, ఎన్టీఆర్, నంబూద్రిపాద్, జ్యోతిబసు, వీపీసింగ్, అటల్ బిహారీ వాజపేయి లాంటి ఉద్దండులు వ్యూహరచన చేశారు. మొదట కేవలం 73 మంది ఎంపీలు మాత్రమే రాజీనామా చేశారు, తర్వాత అది క్రమంగా 104కు పెరిగింది దీనితో రాజీవ్ సర్కార్ కంపించిపోయింది. ఇవాళ ప్రతిపక్షాల్లో నాటి పోరాట పటిమ ఏ మాత్రం కనపడడం లేదు. 200 మందికి పైగా బిజెపియేతర పార్టీల ఎంపీలు సంఘటితం కాగలిగిన స్థితి ఉన్నప్పటికీ, ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు అతలాకుతలంగా మారుతున్నప్పటికీ నరేంద్రమోదీని ఢీకొనగలిగిన పటిమ ఎవరికీ లేదు. వారి దౌర్బల్యాలు, బలహీనతలే మోదీకి బలం. ఈ క్రమంలో ఎవరు ఆందోళన జరిపినా ఢిల్లీలో నేడు జరిగిన ఘటనలే పునరావృతమవుతాయి.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-01-27T06:58:12+05:30 IST