Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 2 2021 @ 01:32AM

కాంగ్రెస్‌ను తోసి..రాజని!

వివిధ రాష్ట్రాల్లో విస్తరణకు తీవ్ర యత్నాలు

నాయకత్వ సంక్షోభంతో కాంగ్రెస్‌ విలవిల

కీలక నేతలను లాక్కుంటున్న మమత 

గోవా, మేఘాలయ, త్రిపురల్లో గేలం

2024 లోక్‌సభ ఎన్నికల్లో

అధిక స్థానాలు గెలవడమే లక్ష్యం

ఇతర పార్టీల అండతో గద్దెనెక్కే ఎత్తు

తెలంగాణ రాష్ట్రంపైనా దృష్టి

ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌దీ అదే బాట

పంజాబ్‌లో ఆప్‌ ముందంజ

హరియాణా, యూపీలపైనా కన్ను


బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు మమత, ఆప్‌ తహతహజాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌.. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. సంస్థాగతంగా బలోపేతం కాలేకపోతోంది. ఈ నేపథ్యంలో.. ఆ అగాధాన్ని పూరించి తామే జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ అద్మీ పార్టీ భారీ ‘విస్తరణ’ను లక్ష్యం పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలను తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఈశాన్యం, పశ్చిమ భారతంపై టీఎంసీ కన్నేయగా.. పంజాబ్‌, హరియాణా, యూపీ వంటి హిందీ రాష్ట్రాల్లో పుంజుకోవడానికి ఆప్‌ కసరత్తు చేస్తోంది.


(న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి)

దేశంలో యూపీఏకి.. ప్రధానంగా కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ చేస్తున్న సన్నాహాలు విస్తృతమయ్యాయి. అటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా పంజాబ్‌తో పాటు హిందీ రాష్ట్రాల్లో సత్తా చాటి.. జాతీయ ప్రత్యామ్నాయం తానేనని చాటుకోవాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలూ కాంగ్రెస్‌లోని కీలక నేతలను తమ వైపు లాక్కుంటున్నాయి. ముఖ్యంగా టీఎంసీ అధినాయకురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రె్‌సను బలహీనపరచి.. బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు నడుంబిగించారు. గోవాలో కాంగ్రెస్‌ పెద్ద నేతల్లో ముఖ్యుడైన మాజీ సీఎం లూయిజిన్హో ఫెలీరోను తన పార్టీలో చేర్చుకున్నారు. టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌, సినీనటి, సామాజిక కార్యకర్త నఫీసా అలీ కూడా తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గోవా ఫార్వర్డ్‌ పార్టీ వర్కింగ్‌ అధ్యక్షుడు కిరణ్‌ కకోడ్కర్‌ 40 మంది నేతలతో టీఎంసీలో చేరారు. వీరందరి చేరికతో గోవాను కైవసం చేసుకోగలమని మమత విశ్వసిస్తున్నారు. మేఘాలయలో కాంగ్రె్‌సకే చెందిన మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా సహా 11 మంది టీఎంసీలో చేరిపోవడం విశేషం. అక్కడ తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం కాంగ్రె్‌సకు షాక్‌ ఇచ్చింది. ఇదే సమయంలో ఆ పార్టీతో మమత అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. సోనియాగాంధీతో ఆమెకు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ.. కొద్ది రోజుల కింద ప్రధాని మోదీతో సమావేశానికి ఢిల్లీలో పర్యటించినప్పుడు సోనియాను కలవలేదు సరికదా.. ప్రతిసారీ భేటీ అవ్వాలని రాజ్యాంగ నిబంధనేమైనా ఉందా అని కటువుగా వ్యాఖ్యానించారు. గోవా, మేఘాలయల్లో కాంగ్రె్‌సను మమత బలహీనపరచడం సోనియాకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. పార్లమెంటులో సమన్వయానికి కాంగ్రెస్‌ నిర్వహించే విపక్ష సమావేశాలకు టీఎంసీ ఎంపీలు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మహారాష్ట్రపై మమత కన్నేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో మంతనాలు జరిపాక.. యూపీఏ ఎక్కడుందని ఆమె ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. 


అధిక స్థానాలపై మమత కన్ను?

2024 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో సాధ్యమైనన్ని అత్యధిక సీట్లు సాధిస్తే.. ఇతర పార్టీలను కూడగట్టుకుని కేంద్రంలో అధికారంలోకి రావచ్చని మమత ఆశాభావంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతలు అవసరమని తలపోస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా (జార్ఖండ్‌), కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌ (బిహార్‌ మాజీ ఎంపీ), అశోక్‌ తన్వర్‌ (హరియాణా పీసీసీ మాజీ అధ్యక్షుడు), జేడీయూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ (బిహార్‌) వంటి వారిని టీఎంసీలో చేర్చుకున్నారు. అసోం కాంగ్రెస్‌ నేత సుస్మితా దేవ్‌ ఇప్పటికే తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్నారు. త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్‌ దాస్‌తో పాటు అనేక మంది బీజేపీ కార్యకర్తలు తృణమూల్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో తృణమూల్‌ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా తృణమూల్‌కు గుర్తింపు లభించింది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం ద్వారా మమత బీజేపీ విస్తరణను విజయవంతంగా అడ్డుకోగలిగారు. ఇక తెలంగాణలో కూడా టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఉన్న కొందరు నేతల గురించి ఆమె ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. యూపీ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన మమత.. అక్కడి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. 


విస్తరిస్తున్న ఆప్‌..

ఆమ్‌ ఆద్మీ పార్టీకి కూడా ఎప్పటి నుంచో జాతీయ ఆకాంక్షలు ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఆ పార్టీ 434 మంది అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో 414 మంది డి పాజిట్లు కోల్పోయారు. అయితే.. 2015, 2020ల్లో బీజేపీని ఢీకొని ఢిల్లీలో అధికారంలోకి రాగలిగింది. పంజాబ్‌లోనూ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ నిష్క్రమించడంతో పంజాబ్‌ కాంగ్రెస్‌ బలహీనపడింది. ఇదే అవకాశంగా ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ పంజాబ్‌ను చుట్టేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌దే విజయమని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. అదే సమయంలో యూపీ ఎన్నికలూ జరుగనున్నాయి. అక్కడా వేళ్లూనుకోవాలని ఆప్‌ ప్రయత్నిస్తోంది. ఇక గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కూడా పోటీకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. గుజరాత్‌లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. సూరత్‌ కార్పొరేషన్‌లో 27సీట్లు గెలుచుకుని.. కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించింది. కాగా.. మమత ముంబైలో శివసేన, ఎన్‌సీపీ నేతలను కలవడం ఓ ‘షో’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అన్నారు. ‘బెంగాల్లో చేసిన హింస, హత్యల పాపాలను.. ముంబై సిద్ధి వినాయకస్వామిని దర్శించి పోగొట్టుకోవాలని మమత ప్రయత్నం’ అని ఆయన వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఓడించలేరు: వేణుగోపాల్‌

యూపీఏ ఎక్కడుందని మమత అడిగిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఓడిస్తామనుకోవడం పగటికలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం వ్యాఖ్యానించారు. ‘భారత రాజకీయాల్లోని వాస్తవికత అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కలే’ అని అన్నారు.


ప్రధాని రేసులో ఉద్ధవ్‌: సేన

ప్రధాని రేసులో శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఉన్నారని ఆ పార్టీ ఎంపీ అరవింద్‌ సావంత్‌ అన్నారు. ‘ప్రతిపక్షాలకు సైద్ధాంతిక సారూప్యత ఉండాలి. దేశంలోని నలుగురైదుగురు ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఉద్ధవ్‌ ఒకరు. మేం కూడా ఆయన ప్రఽధాని కావాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement