నంది ఎల్లయ్య కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-09T07:29:16+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దళిత నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. గత నెల 29న ఆయన ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు...

నంది ఎల్లయ్య కన్నుమూత

  • కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస
  • కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం
  • ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన నేత
  • 2 సార్లు రాజ్యసభకు.. ఓ సారి మండలికి
  • సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు, నేతలు
  • కాంగ్రెస్‌ జెండా కప్పి సంపత్‌ నివాళులు 
  • కుటుంబానికి ఫోన్‌లో సోనియా పరామర్శ

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దళిత నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. గత నెల 29న ఆయన ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌ అని తేలడంతో పది రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం ఉదయం పదిన్నర గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన నంది ఎల్లయ్య ఎక్కువ కాలం పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగారు. ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఒక సారి శాసనమండలి సభ్యుడిగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడని పేరు తెచ్చుకున్న ఎల్లయ్య.. దళిత నేతగా గుర్తింపు పొందారు. 


కౌన్సిలర్‌ నుంచి ఎంపీ వరకూ.. 

ముషీరాబాద్‌లో నంది నర్సమ్మ, నంది నాగయ్య దంపతులకు 1942 జూలై 1న ఎల్లయ్య జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన ఆయన కాంగ్రె్‌సలో చేరి మర్రి చెన్నారెడ్డి అనుచరుడిగా పని చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లారు. 1964లో జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ముషీరాబాద్‌లోని జమిస్తాన్‌పూర్‌ డబుల్‌ నంబర్‌ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. 1977లో సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత 1980, 1989, 1991, 1996లో జరిగిన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2002 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రాష్ట్ర విభజనకు కొద్ది నెలల ముందు ఉమ్మడి ఏపీ శాసన మండలి సభ్యుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మందా జగన్నాథంపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య మాత్రమే గెలిచారు. అనంతరం సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరడంతో లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్‌ తరఫున నంది ఎల్లయ్య మాత్రమే మిగిలారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయసు రీత్యా ఆయనకు పార్టీ టికెట్‌ దక్కలేదు. నంది ఎల్లయ్యకు భార్య, పిల్లలు లేరు. సోదరుడు కృష్ణ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీలో ఉండే వారు. ఇటీవలే ఆయన సోదరితోపాటు సోదరుడి భార్య మరణించగా.. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఎల్లయ్య సైతం కరోనాతో మృతి చెందారు.


కొవిడ్‌ నిబంధనలతో అంత్యక్రియలు 

బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో శనివారం సాయంత్రం కొవిడ్‌ నిబంధనల ప్రకారం నంది ఎల్లయ్య అంత్యక్రియలు జరిగాయి. కరోనాతో మృతి చెందడంతో అతి కొద్ది మంది కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. వాస్తవానికి అధికారిక లాంఛనాలతో ఎల్లయ్య అంత్యక్రియలు జరగాల్సి ఉన్నా.. కొవిడ్‌ నిబంధనల మేరకు జీహెచ్‌ఎంసీ సిబ్బందే పూర్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆయన భౌతిక కాయంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. 


ప్రముఖుల సంతాపం

ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఈటల, ఎర్రబెల్లి, సత్యవతి, కొప్పుల, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. సిద్దిపేట ఎంపీగా ఎల్లయ్య ఉన్నప్పుడు.. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయనతో కలిసి పని చేశానని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లో నంది ఎల్లయ్య చిత్రపటానికి పలువురు కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. సంతాప సూచకంగా పార్టీ జెండాను అవనతం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ఖుంటియా, పొన్నం, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య కుటుంబ సభ్యులను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ ఫోన్‌లో పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నేతలు లక్ష్మణ్‌, డీకే అరుణ, సుధాకర్‌రెడ్డి, టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు రమణ, ఎల్లయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-08-09T07:29:16+05:30 IST