మమతకు అంత సీన్ లేదు : కాంగ్రెస్ సీనియర్లు

ABN , First Publish Date - 2021-12-03T00:06:06+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత

మమతకు అంత సీన్ లేదు : కాంగ్రెస్ సీనియర్లు

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. యూపీఏ ఎక్కడుందని, యూపీఏ ఇప్పుడు ఉనికిలో లేదని ఆమె బుధవారం వ్యాఖ్యానించడంతో, కాంగ్రెస్ లేకపోవడం ఆత్మ లేని శరీరం అవుతుందని హితవు పలికారు. 


ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌తో బుధవారం మమత సమావేశమయ్యారు. అనంతరం ఉభయులూ మీడియాతో మాట్లాడారు. యూపీఏకి సారథి అయిన కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేశారు. ‘యూపీఏ అంటే ఏంటి? యూపీఏ అనేదే లేదు’ అని మమత అన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలూ కలిస్తే బీజేపీని ఓడించడం తేలికేనన్నారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీచేయదన్నారు. తమ భేటీ 2024 ఎన్నికలకు సన్నాహకమని శరద్ పవార్‌ తెలిపారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి గురువారం మీడియాతో మాట్లాడుతూ, మమత బెనర్జీకి జాతీయ గీతాన్ని ఎలా గౌరవించాలో తెలియదన్నారు. దేశానికి ఏదో చేయాలనేదాని కన్నా తన మేనల్లుడిని పొగుడుకోవడంపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఓ జాతీయ పార్టీ అని, ఆ విధంగానే వివిధ రాష్ట్రాల్లోని సమస్యలపై స్పందిస్తుందని చెప్పారు. 


కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకపోతే యూపీఏ ఆత్మ లేని శరీరం వంటిదవుతుందన్నారు. మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి అనేదే ఉండదని తెలిపారు. రాజకీయాల్లో మతాన్ని ఉపయోగించేవారికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామన్నారు. అన్ని మతాల పట్ల సమాన భావాన్ని కలిగియుండటం, అన్ని మతాలను గౌరవించడం, సమాజాన్ని ఏకతాటిపై నడిపించడం అవసరమని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, బీజేపీ ముంబై నగర శాఖ కార్యదర్శి వివేకానంద గుప్తా బుధవారం నగర పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రలేకి  ఓ లేఖ రాశారు. మమత బెనర్జీ అర్థాంతరంగా జాతీయ గీతాన్ని నిలిపేయించారని, ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. ఆమె చర్య జాతీయ గీతాన్ని తీవ్రంగా అవమానించడమేనని తెలిపారు. 


Updated Date - 2021-12-03T00:06:06+05:30 IST