కంగనపై కాంగ్రెస్ లీగల్ చర్యలు: నానా పటోలే

ABN , First Publish Date - 2021-11-17T20:28:20+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీని కించపరచేలా వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై

కంగనపై కాంగ్రెస్ లీగల్ చర్యలు: నానా పటోలే

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని కించపరచేలా వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ లీగల్ చర్యలకు వెళ్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే బుధవారంనాడు తెలిపారు. ముంబై పోలీసులకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయనుందని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు మహాత్మాగాంధీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదని ఆమె విమర్శించారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమని గాంధీ చెప్పిన అహింసా సూత్రాన్ని ఆమె పరిహసించారు. ఇదెంలాంటి ఆజాదీ అని ప్రశ్నించారు. ''మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ''నేతాజీని అప్పగించేందుకు గాంధీజీ, ఇతరులు అంగీకరించారు'' అనే శీర్షికతో వచ్చిన క్లిప్‌ను కూడా ఆమె జతచేశారు.


ఇప్పటికే 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదని, భిక్ష అని, నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని కంగనా వ్యాఖ్యానించడం సంచలనమైంది. దీనికి తోడు తాజాగా ఆమె గాంధీపై విమర్శలు చేయడం మరింత వివాదం రేపుతోంది. భగత్‌సింగ్‌ను ఉరి తీయాలని గాంధీ కోరుకున్నారనడానికి సాక్ష్యాలున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, స్వాంతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే దుమారం రేగుతోంది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రపతికి సైతం వినతిపత్రాలు వెళ్లాయి.

Updated Date - 2021-11-17T20:28:20+05:30 IST