కాంగ్రెస్ దేశవ్యాప్త 'కిసాన్ విజయ్ దివస్‌'

ABN , First Publish Date - 2021-11-20T00:54:56+05:30 IST

రైతులు నిలకడగా, స్ఫూర్తివంతమైన పోరాటం సాగించినందుకు ప్రశంసిస్తూ శనివారంనాడు దేశవ్యాప్త..

కాంగ్రెస్ దేశవ్యాప్త 'కిసాన్ విజయ్ దివస్‌'

న్యూఢిల్లీ: రైతులు నిలకడగా, స్ఫూర్తివంతమైన పోరాటం సాగించినందుకు ప్రశంసిస్తూ శనివారంనాడు దేశవ్యాప్త ''కిసాన్ విజయ్ దివస్'' నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర విభాగాలన్నీ 'కిసాన్ విజయ్ ర్యాలీలు', 'కిసాన్ విజయ్ సభలు' నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ప్రకటించిన నేపథ్యంలో 'కిసాన్ విజయ్ దివస్'కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.


కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ శుక్రవార ఉదయం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. ‘‘నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను. మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. అందువల్లే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల జరిగే పార్లమెంటు సమావేశాల్లో చట్టాల రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’’ అని ప్రధాని ప్రకటించారు. మోదీ ప్రకటనతో ఏడాదికి పైగా సాగిస్తున్న ఆందోళనలను విరమించే విషయమై రైతు సంఘాల ప్రతినిధులు శనివారం సమావేశం కానున్నారు. అనంతరం, అధికారికంగా ఒక ప్రకటన చేస్తారు.

Updated Date - 2021-11-20T00:54:56+05:30 IST