అదానీని కలిసిన మమత.. కాంగ్రెస్ విమర్శలు

ABN , First Publish Date - 2021-12-03T02:44:58+05:30 IST

2022, ఏప్రిల్‌లో బెంగాల్‌లో ‘బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్) నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు..

అదానీని కలిసిన మమత.. కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అపర కుబేడరుడు గౌతమ్ అదానీ కలుసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భారతీయ జనతా పార్టీ బీ-టీం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, టీఎంసీ విధానాలు ఒకటేనని, కార్పొరేటర్లకు ప్రజా సొమ్మును దోచి పెట్టడమే వారి లక్ష్యమని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘యూపీఏ లేనే లేదు’ అంటూ కాంగ్రెస్‌ను పక్కన పెట్టేసి దేశంలోని స్థానిక పార్టీలతో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న మమతపై కాంగ్రెస్ చాలా గుర్రుగా ఉంది. ఈ సందర్భంలో ఆమెను అదానీ కలవడం కాంగ్రెస్ కార్యకర్తలకు అభ్యంతరంగా మారింది.


2022, ఏప్రిల్‌లో బెంగాల్‌లో ‘బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బీజీబీఎస్) నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఈ ట్వీట్‌లో మమతా బెనర్జీని కలిసినప్పుడు తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఇప్పటికే మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు అనుకూలమనే విమర్శలు పెద్ద ఎత్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీపై కూడా అలాంటి విమర్శలే చేస్తోంది కాంగ్రెస్ వర్గం.


గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ బీజేపీని ప్రశ్నించిన వారిని పాకీస్తానీలు అని నిందించినట్లుగానే మమతాను ప్రశ్నించిన వారిని మావోయిస్టులు అని నిందించడం పరిపాటి అని.. మోదీ, మమత ఇద్దరూ నియంతలేనని, వారికి ప్రశ్నలు నచ్చవని విమర్శిస్తున్నారు. ఇదే విషయమై తెలంగాణ కాంగ్రెస్ నేత సీతక్క కూడా విమర్శించారు. గౌతమ్ అదానీ ట్వీట్‌ని షేర్ చేస్తూ ‘‘ఐపాక్ నుంచి అదానీ వరకు మమతా బెనర్జీ ప్రయాణం.. డైరెక్టర్: మోదీ, ప్రొడ్యూసర్: అమిత్ షా’’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2021-12-03T02:44:58+05:30 IST