HYD : ఆయన BJPలో చేరడంతో.. ఇద్దరు యువ నాయకుల పోటాపోటీ.. Congressలో ఈ కీలక పదవి ఎవరికో..!?

ABN , First Publish Date - 2021-10-04T14:15:24+05:30 IST

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ కావడంతో...

HYD : ఆయన BJPలో చేరడంతో.. ఇద్దరు యువ నాయకుల పోటాపోటీ.. Congressలో ఈ కీలక పదవి ఎవరికో..!?

  • కాంగ్రెస్‌ బాలానగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎవరు?
  • పోటీ పడుతున్న ఇద్దరు యువనాయకులు

హైదరాబాద్ సిటీ/బాలానగర్‌ : కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాంగ్రె‌స్‌ డివిజన్‌ కమిటీల కసరత్తు మొదలైంది. కొద్ది రోజుల్లోనే  డివిజన్‌ల వారీగా అధ్యక్ష కార్యదర్శుల పేర్లను ప్రకటించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకులు వేర్వేరుగా తయారు చేసిన జాబితాలను మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్‌చార్జి మల్లు రవికి అందజేసినట్లు సమాచారం. కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు కూన శ్రీశైలంగౌడ్‌ అధ్యక్షతన డివిజన్‌ కమిటీలు వేసినప్పటికీ ఆయన బీజేపీలో చేరడం, రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ కావడంతో డివిజన్‌ కమిటీల ఎన్నిక మళ్లీ తెరపైకి వచ్చింది. డివిజన్‌ అధ్యక్ష పదవికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న  మధూగౌడ్‌, ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్న నరేందర్‌ ముదిరాజ్‌ పోటీ పడుతున్నారు.


అధిష్ఠానాన్ని మెప్పించి మధూగౌడ్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడొకరు గట్టి ప్రయత్నం చేస్తుంటే... అధ్యక్ష పదవి తనకు ఇవ్వాల్సిందేనని నరేందర్‌ పట్టుబడుతున్నట్లు సమాచారం. మధూగౌడ్‌ స్థానిక సమస్యలపై స్పందించి పార్టీ క్యాడర్‌ను గాడిలో పెట్టగలడా అనే కోణంలో కొందరు పార్టీ నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. మాస్‌ కమ్యూనికేషన్‌లో పట్టా పుచ్చుకుని ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నరేందర్‌కు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని స్థానిక నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బాలానగర్‌ డివిజన్‌లో మాత్రమే అధ్యక్ష పదవికి నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. చివరికి అధిష్ఠానం బాలానగర్‌ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెడుతుందో వేచిచూడాల్సిదే.

Updated Date - 2021-10-04T14:15:24+05:30 IST