ప్రభుత్వంపై పంతుళ్ల కన్నెర్ర

ABN , First Publish Date - 2022-01-21T05:23:37+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఉపాధ్యాయ లోకం నినదించింది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయ సంఘాల సంయుక్త వేదిక (ఫ్యాప్టో) గురువారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. తదనుగుణంగా ఒంగోలులోని కలెక్టరేట్‌ను వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముట్టడించారు.

ప్రభుత్వంపై పంతుళ్ల కన్నెర్ర
కలెక్టరేట్‌ను ముట్టడించి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

రివర్స్‌ పీఆర్సీ మాకొద్దంటూ కలెక్టరేట్‌ ముట్టడి

 కదలివచ్చిన వేలాదిమంది ఉపాధ్యాయులు

జిల్లావ్యాప్తంగా నామమాత్రంగా పనిచేసిన పాఠశాలలు

పలుప్రాంతాల్లో పోలీసుల అడ్డంకులు

అయినా ఒంగోలు చేరుకొని ఆందోళన విజయవంతం

పీఆర్సీ రద్దుచేస్తారా, గద్దె దిగుతారా అంటూ సీఎంకు అల్టిమేటం


ఒం గోలు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

పాఠాలు చెప్పే పంతుళ్లు ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. సెలవుల పెట్టి, పాఠశాలలు వదిలిపెట్టి ప్రభుత్వ అడ్డంకులు, ఆటంకాలు, అరెస్టులు వంటి నిర్బంధాలను అధిగమించి మరీ వేలాదిగా ఒంగోలుకు తరలివచ్చారు. రివర్స్‌ పీఆర్సీ మాకొద్దంటూ ఇక్కడి కలెక్టరేట్‌ ముట్టడించారు. సర్కారు తీరు మార్చుకోవాలంటూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కదంతొక్కారు. జీతాలు తగ్గించి వేసే కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేస్తావా లేక గద్దె దిగుతారో తెల్చుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. జీవో ప్రతులను దహనం చేశారు. ఒక ఉపాధ్యాయుడు తలకిందులుగా నిలబడి ‘అంతా రివర్స్‌’ అంటూ నిరసన తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని గెలిపించి తప్పుచేశామంటూ కొందరు బూట్లు, చెప్పులతో కొట్టుకున్నారు. అయ్యవార్లే గుంజిళ్లు తీశారు. ప్రకాశం భవనం ముట్టడిలో వేలాదిగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు తరలిరావడంతో అక్కడ జనసంద్రంగా మారింది. 

రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఉపాధ్యాయ లోకం నినదించింది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన నూతన పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయ సంఘాల సంయుక్త వేదిక (ఫ్యాప్టో) గురువారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. తదనుగుణంగా ఒంగోలులోని కలెక్టరేట్‌ను  వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముట్టడించారు. ఉదయం 8.30 నుంచే కలెక్టరేట్‌కు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు రావడం ప్రారంభం కాగా 10 గంటల కల్లా వేలాదిమంది చేరారు. జిల్లాలో సుమారు 15వేల మంది ఉపాధ్యాయుల ఉండగా దాదాపు సగానికిపైగానే ఈ ఆందోళనకు తరలివచ్చారు. వాస్తవానికి గురువారం పాఠశాలలకు సెలవుదినం కాకపోయినప్పటికి వేలాదిమంది స్వచ్ఛందంగా లీవ్‌ పెట్టి ఉద్యమంలోకి వచ్చారు. వారంరోజుల క్రితమే ఫ్యాప్టో ఈ ఆందోళనకు పిలుపునివ్వగా ఎలాగైనా ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం భావించింది. తదనుగుణంగా బుధవారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలపై నిర్బంధం పెట్టింది. సాధారణ ఉపాధ్యాయులు మండల స్థాయి నేతల కదలికలపై నిఘా పెట్టింది. అలా జిల్లాలోనూ పోలీసులు దృష్టిసారించారు. 

పోలీసు నిర్బంధాన్ని తప్పించుకుని..

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం ఆరు గంటలకే ఉపాధ్యాయులు ఒంగోలు వచ్చేందుకు బయలుదేరారు. అలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు చాలా ప్రాంతాల్లో వారు ఒంగోలు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొన్నిచోట్ల ఏకంగా అరెస్టులు చేయగా మరికొన్నిచోట్ల ఒంగోలు వెళ్లరాదంటూ నోటీసులు ఇచ్చారు. మరికొన్నిచోట్ల వాహనాల్లో వస్తున్న వారిని మార్గమధ్యంలో ఆపి తనిఖీలు చేసి అడ్డుకున్నారు. మార్కాపురంలో కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించగా మరికొందరి వాహనాలను అడ్డుకున్నారు. చీరాల నుంచి బస్సులో వస్తున్న వారిని పందిళ్లపల్లి దగ్గర బస్సులో నుంచి దించి నోటీసులు ఇచ్చారు. కందుకూరు ప్రాంతం నుంచి వస్తున్న వారి వాహనాలను మంగదేవపురం రోడ్డు, సింగరాయకొండ అడ్డరోడ్డు సెంటర్స్‌లో ఆపి అడ్డుకున్నారు. దోర్నాలలోనూ యూటీఎఫ్‌ నేతలను అదుపులోకి తీసుకోగా సీఎస్‌పురంలో నేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు పాఠశాలలకు కొన్నిచోట్ల వెళ్లిన పోలీసులు సెలవు పెట్టిన ఉపాధ్యాయుల వివరాలను సేకరించారు. ఇలా అనేక ఆటంకాలు, అడ్డుంకులు కల్పించినా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు ఒంగోలు తరలివచ్చారు. 

మహిళా ఉపాధ్యాయులే అధికం

ముట్టడికి తరలివచ్చిన వారిలో మహిళా ఉపాధ్యాయులు కూడా భారీగానే ఉండగా ఉదయం 9 గంటలకే ప్రకాశం భవన్‌ రెండు గేట్లను మూసివేసి ఆందోళన ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కలెక్టరేట్‌ ముట్టడి చేయడమే కాక ప్రకాశం భవన్‌ వెలుపల రెండు వైపులా రోడ్డు పూర్తిగా బ్లాక్‌ చేసి ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతం అంతా తీవ్రరద్దీ ఏర్పడింది. కాగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపైనా, అందుకు సంబంధించిన జీవోలపైనా మండిపడిన టీచర్లు 27శాతంపైగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, గతంలో ఉన్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు కొనసాగించాలని, సీపీఎస్‌ రద్దుచేయాలని, క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70ఏళ్లు నుంచి ఇవ్వాలని, పీఆర్సీ పదేళ్లకు కాకుండా ఐదేళ్లకు ఒకసారి విధానం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేస్తావా-గద్దెదిగుతామా, సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. 

వెల్లువెత్తిన మద్దతు

కాగా ఉపాధ్యాయులకు మద్దతుగా ఎన్‌జీవో అసోసియేషన్‌ నేతలు వెంకటేశ్వరరావు, షరీఫ్‌, కిషోర్‌, మాధవి తదితరుల నేతృత్వంలో ఉద్యోగులు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇదిలాఉండగా 10.30 ప్రాంతంలో డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఉపాధ్యాయులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో వారంతా ప్రతిఘటించారు. ఒకనొక సందర్భంలో డీఎస్పీనే స్వయంగా ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ ఆందోళనను విరమించాలని కోరడం గమనార్హం.  ఎంతకీ వినకపోవడంతో పోలీసులే వెనక్కు వెళ్లారు. కలెక్టరేట్‌ ముట్టడి అనంతరం చర్చి సెంటర్‌లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. రివర్స్‌ పీఆర్సీ వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామన్న నేతలు ఈనెల 28న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నేతలు శెట్టి రవి, ఓవిరెడ్డి, ఐ.విజయసారథి, మంజుల, చల్లా శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, జనార్దన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, గురునాథశర్మ, డి.శ్రీనివాసులు తదితరులు ఆందోళనకు సారథ్యం వహించారు. 

 



Updated Date - 2022-01-21T05:23:37+05:30 IST