మానవజన్మ ఎత్తిన వాడు ఈ శరీరం ఉండగానే కామక్రోధోద్భవమైన వేగాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత అవసరమో శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ఐదవ అధ్యాయంలో ఇరవై మూడో శ్లోకంలో చెప్పాడు.
శక్నో తీహైవ యస్సోఢుంప్రాక్ఛరీర విమోక్షణాత్
కామ క్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః
‘‘సరైనటువంటి కర్మయోగ సారం తెలిసిన వాడెవడంటే, అర్జునా! ఈ జన్మలోనే ఇక్కడే ఈ కోరికల వేగాన్ని, క్రోధం వేగాన్ని నిగ్రహించుకున్నవాడు. కాబట్టి నవ్వు కూడా ఆ ప్రయత్నం చేయి. కోపంతో యుద్ధం చేయవద్దు. ప్రశాంతంగా యుద్ధం చేయి. నీ ధర్మం నువ్వు చేయి. ఆవేశం తెచ్చి పెట్టుకోవద్దు. ఆవేశంలో ఏం మాట్లాడవద్దు’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన క్రోధాన్ని జయించలేకపోయాడు. ప్రపంచాన్ని జయించాలనే పిచ్చి కోరికను జయించలేకపోయాడు. కానీ ఆ విషయాన్ని మరణపు అంచుల మీద ఉన్నప్పుడు గ్రహించాడు. ‘‘ప్రపంచాన్ని జయించిన నేను ఏమీ తీసుకెళ్లడం లేదనే విషయం అందరికీ తెలియాలి’’ అని, చనిపోయిన తరువాత తన రెండు చేతులను శవపేటిక బయటకు కనిపించేలా పెట్టమని చెప్పాడు. ఇది అందరూ గ్రహించాలి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎవరైనా వట్టి చేతులతో వెళ్లిపోవాల్సిందే!