జీవుని ఆవేదన

ABN , First Publish Date - 2020-10-04T08:25:46+05:30 IST

జనన మరణాలు చక్రభ్రమనాలు. పూర్వము చిత్రకేతువు అను రాజు సంతానలేమితో కృంగిపోయేవాడు.

జీవుని ఆవేదన

పునరిపి జననం.. పునరపి మరణం.. 

పునరపి జననీ జఠరే శయనమ్‌.. 

ఇహ సంసారే బహు దుస్తారే- (ఆది శంకరులు)


జనన మరణాలు చక్రభ్రమనాలు. పూర్వము చిత్రకేతువు అను రాజు సంతానలేమితో కృంగిపోయేవాడు. అంగీరస మహర్షి ఆ రాజు మనోవేదనను గుర్తించి, పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించాడు. యజ్ఞ శేషమును, రాజు జేష్ఠ భార్య కృతద్యుతికి ఇచ్చి.. దీవించి వెళ్లాడు. పట్ట మహిషి పుత్రుని ప్రసవించింది. ఆ తర్వాత రాజుకు పట్టపు రాణిపై ప్రత్యేక అనురాగాన్ని చూపసాగాడు. దానికి ఇతర రాణులు ఈర్శ్వతో ఆ బాలుడిని వధించారు. రాజు, భార్య చింతాక్రాంతులయ్యారు. దాంతో.. అంగిరసుడు నారదుని వెంటపెట్టుకుని వచ్చి... రాజును ఓదార్చాడు. ‘‘ఓ చిత్రకేతా..! ఎందుకు దుఃఖిస్తావు? లోకంలో భార్యలు, ఐశ్వర్యాలు, రాజ్య వైభవాలు శాశ్వతం కాదు. అవి దుఃఖాన్నే కలిగిస్తాయి. భృత్యాలు, మిత్రులు, ధనం, భోగాలు, శోకమోహ భయాన్ని కలిగిస్తాయి. అవి సుఖప్రదాయకాలు కనేకావు. స్వప్నములో భావించునట్లు ఈ మానవ బంధాలు, అనుబంధాలు, అదృశ్యమగుచూ, మరలా మానవుని మోహ భ్రాంతికి గురిచేస్తాయి. నీ కుమారుని మేము ఇప్పుడు బతికించినా.. దుఃఖము నీకు మరలా ప్రాప్తిస్తుంది. అందుకే.. దుఃఖించవద్దు’’ అని ఊరడించాడు. నారద మునీంద్రుడు కూడా.. ‘‘రాజా! శ్రీహరిని నమ్మితే నీవు మోహబంధాల నుంచి విముక్తుడవు కాగలవు.


నీకు ఈ బాలకునకు ఎలాంటి సంబంధం లేదు’’ అని పలికి, పిల్లవాని కళేబరము చూచి, జీవుని అందులో ప్రవేశపెట్టి, ‘‘బాలుడా! నీ బంధుమిత్రులందరినీ చూడు. వారి దుఃఖము నివారించి, రాజ్య పాలనము చేసి, అందరినీ సంతోషపెట్టు’’ అని ఆదేశించాడు. దానికి ఆ బాలుడు ‘‘నారద మునీంద్రా! నేను కర్మబద్ధుడనై, ఎన్నో జన్మలెత్తి, అనేక కష్టాలు పడ్డాను. ఇప్పటికీ అనుభవిస్తున్నాను. పూర్వం నేను ఎన్నో జంతువులు, ఎందరో మానవుల గర్భంలో జన్మించి ఉంటాను కదా? ఆ జన్మల్లో నాకు ఎందరో తల్లిదండ్రులు ఉంటారు కదా? ఇప్పుడు ఈ తల్లిదండ్రుల దుఃఖాన్ని తీరిస్తే.. వారి సంగతేంటి? వారి బాధలు ఎవరు తీరుస్తారు? వీరు నాకు ఏనాటి తల్లిదండ్రులు?’’ అని ఎదురు ప్రశ్న వేశాడు. ఆ తర్వాత బాలునిలోని జీవుడు అంతర్థానమయ్యాడు. రాజు ఆ బాలకుడి శరీరానికి అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత చిత్రకేతు మహారాజు.. నారద మహర్షి నుంచి నారాయణ మంత్రాన్ని స్వీకరించి, శ్రీహరి అనుగ్రహం పొందాడు. గీతోపదేశంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా.. 


జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్యచ

తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితు మర్హతి

అంటూ.. పుట్టినవారికి మరణం తప్పదని, మరణించిన వారికి తిరిగి జననం తప్పదని ఉపదేశించారు.

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః

ఋణక్షయే క్షయం యాతి కాతత్రపరి వేదనా!


ఋణానుబంధము తీరగానే బంధుమిత్రులు, దూరమగుదురు. మృత్యువు కబళించగనే ఎవరి దారి వారిదే. ఈ మాయా నాటకమే సృష్టి రహస్యం. దేహికి దేహానికి భేదం అజ్ఞాన కల్పితమే. ధర్మం కీర్తి మాత్రమే స్థిరంగా ఉంటాయని గుర్తెరిగి.. అంతా మంచి కర్మలనే ఆచరించాలి.


- రాయసం రామారావు, సెల్‌ 9492191360

Updated Date - 2020-10-04T08:25:46+05:30 IST