Abn logo
Mar 27 2020 @ 05:40AM

నిశ్శబ్దం

లాక్‌డౌన్‌పై చైతన్యం.. ఇక్కడ ఇళ్లకే పరిమితం


న్యూస్‌ నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌తో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.. అంతటా నిశ్శబ్ధం .. నిత్యావసరాల కోసం ఉదయం వేళ మాత్రమే జనం బయటకు వస్తున్నారు. తర్వాత అంతా గప్‌చిప్‌..  గ్రామాల్లో  కార్లు తిరగకుండా ప్రధాన కూడళ్లన్నింటిని బారికేడ్లతో మూసివేశారు.  ప్రతీ సెంటర్‌లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం వచ్చిన వారిని మాత్రమే పోలీసులు అనుమతించారు. 


జిల్లాలో లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారు... గురువారం జిల్లా అంతటా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం నిత్యావసర సరుకుల కోసమే బయటకు వచ్చారు.. 


భీమవరంలో చాలామంది పలు కారణాలు చూపి వాహనాలపై బయటకు రావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రూరల్‌ గ్రామాల్లో టీవీలకే పరిమితమయ్యారు. యువత ఇంట్లో క్యారమ్స్‌, చదరంగం ఆటలతో సమయం గడుపుతున్నారు.


ఉండి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో కొత్తపేటలోకి ఇతరులు ఎవరూ అటుగా రాకుండా కర్రలను ఏర్పాటు చేశారు. ఉండిలో ఎన్‌హెచ్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగా రైల్వేస్షేషన్‌ రహదారికి వెళ్లే పాత వంతనపై నుంచి బయట వారు రాకుండా కర్రల ఏర్పాటు చేశారు. 


పెంటపాడు మండలంలో రూరల్‌ సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసరావు ప్రధాన రహదారులను పరిశీలించారు. అకారణంగా రహదారులపై సంచరించే 15 మంది వాహనదారులకు అపరాధరుసుం విధించారు.


భీమడోలు, గుండుగొలను, పూళ్ళ ప్రధాన గ్రామాలతో పాటు కొల్లేరు, మెట్ట గ్రామాల్లో ప్రజలెవరూ బయటకు రాలేదు . రోడ్లపైకి ప్రజలు రావొద్దంటూ పోలీసు, పంచాయతీ అధికారులు గ్రామాల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు.  


పెరవలి మండలంలోని ఆయా గ్రామాలకు బయటి నుంచి ప్రజలు రాకుండా అడ్డుగా కంచెలు వేస్తున్నారు. కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, ఖండవల్లి గ్రామాల్లో రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేశారు.


గోపాలపురం మండలంలో సగ్గొండ, గోపవరం, కొవ్వూరుపాడు, కరిచర్ల గూడెం, బుచ్చంపేటలో గ్రామాల్లో రోడ్లను నిర్భందించారు. యువకులు ఇంటింటికి వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.


అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న కొండరెడ్డి గ్రామాలు కూడా స్వీయ నియంత్రణలోకి వెళ్తున్నాయి.బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న అలివేరులో రోడ్డుకు అడ్డంగా తాటి ఆకులతో కంచె ఏర్పాటు చేశారు.


హైదరాబాద్‌ నుంచి వస్తున్నవారిని కుక్కునూరు సరిహద్దు ప్రాంత చెక్‌పోస్టుల్లో పోలీసులు నిలిపి వేశారు.వారికి  ఎటువంటి అనారోగ్యం లేదని తెలుసు కుని అనుమతించారు. వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement