ప్రతి పంక్తిలో పలికే చేతనా సౌకుమార్యం

ABN , First Publish Date - 2020-10-19T06:28:38+05:30 IST

వైదేహి కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి, కారుణ్యానికి, సున్నితమైన బంధాలకు సంబంధించి ఆమె ఆర్ద్రమైన అంతఃచేతనలోంచి వచ్చిన స్పందనలే...

ప్రతి పంక్తిలో పలికే చేతనా సౌకుమార్యం

వైదేహి కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి, కారుణ్యానికి, సున్నితమైన బంధాలకు సంబంధించి ఆమె ఆర్ద్రమైన అంతఃచేతనలోంచి వచ్చిన స్పందనలే. అందమైన పదచిత్రాల రూపకాల సున్నితమైన ప్రచ్ఛన్నతతో, మధురాక్షర రూపంలో అవి కవితలుగా రూపుదిద్దుకున్నవే.


వైదేహి శశిధర్‌ కవిత్వం

పాఠకుని అనుభూతికి లోనుజేసేది, ప్రధానంగా కవితలోని క్రాఫ్ట్‌ లేదా శిల్పమేగాని, కవితా వస్తువు కాదు. కవితలో శిల్పం ప్రాముఖ్యత అపారం. ఈ శిల్పం ద్వారానే కవి అనుభవం పాఠకుని అనుభవమైపోతుంది. అదే రసానంద సిద్ధిని సాధించడం. True poetry is transference of experience.


కవిత ప్రధానంగా సౌందర్య సృజన. కళాత్మక రసానందం అది సాధించవలసిన పరమార్థం. మన ప్రాచీన ఆలంకారికులు నుడివిన ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనే సూక్తి కవితా విలువలు అంచనా వేయడానికి నూటికి నూరు పాళ్ళు అన్వ యింపదగిన సిద్ధాంత ప్రతిపాదనగా నాకనిపిస్తుంది. కవిత రసానంద సిద్ధి సాధించే ప్రక్రియలో మహా మానవీయ విలువలు ప్రాణం పోసుకుంటే మరీ మంచిది. అంతేకాని, జీవిత సత్యాలను అదే పనిగా ఏకరువు పెట్టడం కానీ, ఏదో ఒక ఐడియాలజీని ప్రాపగేట్‌ చేయడానికి సందేశాలను గుప్పించడం గాని కవిత్వం చేయవలసిన పని కాదు. కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ చెప్పేది కూడా ఇదే: అందం, ఆనందం కవిత పరమావధని. వైదేహి శశిధర్‌ ఈ కోవకు చెందిన కవయిత్రి.


వచన కవిగా ప్రశంసనీయమైన పరిణతి సాధించిన డాక్టర్‌ వైదేహి శశిధర్‌ వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్ర కవయిత్రి. ఆమె కవిత్వంలో ప్రత్యేక ఆక ర్షణలు రెండు. రామణీయకమైన శైలితో పాటు ఆకర్షణీయ మైన కవిత్వీకరణ రీతి. పాఠకుని అనుభూతికి లోనుజేసేది, ప్రధానంగా కవితలోని క్రాఫ్ట్‌ లేదా శిల్పమేగాని, కవితా వస్తువు కాదు. కవితలో శిల్పం ప్రాముఖ్యత అపారం. ఈ శిల్పం ద్వారానే కవి అనుభవం పాఠకుని అనుభవమై పోతుంది. అదే రసానంద సిద్ధిని సాధించడం. True poetry is transference of experience. ఈ ప్రక్రియ విజయవంతమవడానికి దోహదపడేది శిల్పమన్నాము గదా: శిల్పమంటే- అనుభూతి లేదా భావావేశ వ్యక్తీకరణకు దోహద పడే ఉపకరణాల, ప్రయోగాల సముదాయాలను సముచిత రీతిలో చేపట్టి, సాధ్యమైనంత సౌందర్యం సాధించే రీతి. ఈ కవిత్వ కళారీతిని వైదేహి శశిధర్‌ పుణికిపుచ్చుకున్నట్లు ఆమె కవిత్వం నిరూపిస్తుంది.


ప్రాకృతిక సౌందర్యాన్ని గాని, సున్నితమైన మానవ సంబంధాలను గాని, జీవన గమనంలో జంటగా కలిసి మెలిసి సాగే సుఖదుఃఖాలను గాని, విధి వంచితులై బాధామయ జీవితాలను వెళ్ళదీస్తున్న నిర్భాగ్యుల వేదనలను గాని, లేదా మరి ఏ ఇతరమైన జీవితానుభవాలను గాని తన కవితా త్మతో దర్శించి ప్రతిభావంతంగా పాఠకులనాకట్టుకునే శైలిలో ప్రతిఫలింపజేయగలరు వైదేహి.


ఇంతవరకు ఆమె వెలయించిన కవితా సంకలనాలు రెండు: ‘నిద్రిత నగరం’, ‘పునశ్చరణం’. వీటిని సమగ్రంగా పరిశీలిస్తే వీటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి: వైయక్తిక అనుభూతి మార్దవం, మృదుమధుర సమశబ్ద జనిత లయ విన్యాసం, తన్మూలకంగా ఆమె కవితలు కంఠవశమయ్యే సౌలభ్యం, పదచిత్ర నిర్మాణ ప్రౌఢిమ, సునిశితమైన ప్రకృతి పరిశీలన, మానవ స్వభావతత్త్వావగాహన, అన్వయ కాఠిన్యం లేని గొలుసులు గొలుసులుగా సాగే అలంకార మాధ్యమాలలో పొదగబడిన భావసౌందర్య సమ్మోహన శక్తి, ఆర్ద్రమైన ఆమె అంతఃచేతన. ఒక విశిష్టమైన ఆమె కవిత్వీకరణ రీతిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసి వుంది: ఒక భౌతికమైన మహా సౌందర్యవంతమైన దృశ్యాన్ని, లేదా విషయాన్ని సరైన సందర్భంలో జాతి సామూహిక సాంస్కృ తిక చైతన్యంలో శాశ్వతమైన స్థానం వున్న అధిభౌతిక సౌందర్యం ద్వారా తన కవితలో ఆవిష్కరించడం. అంటే, మిత్‌(myth)ను సమయోచితంగా కవిత్వీకరణ మాధ్య మంగా అందంగా ఉపయోగించుకోవడం.


కవిత్వంలో, ముఖ్యంగా వచన కవిత్వంలో, సౌందర్యం సాధింపబడేది మెటఫర్‌ వల్ల (మెటఫర్‌ అన్నప్పుడల్లా సిమిలి --ఉపమ--ని కలిపి ప్రస్తావించినట్లే; వాడకాన్ని, నిర్వహించే తీరును బట్టి.) ఈ విషయంలో వైదేహి శశిధర్‌ విశిష్టతను చూడగలం. మెటఫర్‌ను ఆమె ఒక అలంకారంగా ఎన్నడూ చూడరు, అలా ఎన్నడూ వాడరు. మెటఫర్‌ ఆమె సాంద్ర మైన అనుభూతి వ్యక్తీకరణకు మాధ్యమమై పోతుంది. ఆమె కవితల నిండా అలా వాడబడిన మెటఫారికల్‌ లాంగ్వేజ్‌ను, సౌందర్యంతో మెరిసే పదచిత్రాలను చూడవచ్చు. వైదేహి కవితలన్నీ ప్రకృతి సౌందర్యానికి, కారుణ్యానికి, సున్నితమైన బంధాలకు సంబంధించి ఆమె ఆర్ద్రమైన అంతఃచేతనలోంచి వచ్చిన స్పందనలే. అందమైన పదచిత్రాల రూపకాల సున్నితమైన ప్రచ్ఛన్నతతో, మధురాక్షర రూపంలో అవి కవితలుగా రూపుదిద్దుకున్నవే.


Almost all her poems gradually pass through a creative process towards structural evolution gaining greater and greater effect from line to line. ముఖ్యంగా ‘నిద్రితనగరం’, ‘నేరేడు చెట్టు’, ‘నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’, ‘మంచులో తడిసిన ఉదయం’, ‘అంధగీతం’, ‘నాయనమ్మ’, ‘కచేరి’, ‘జీవితం’, ‘అమ్మ’ మొదలుగా గల కవితలు. ప్రతి కవిత చక్కగా చెక్కిన సజీవ శిల్పంలా వుంటుంది. పరమ సాత్వికమైన ప్రాకృతిక సౌందర్య వీక్షణానికి ‘నిద్రితనగరం’ లాంటి కవితలు అద్దంబడితే, దిగులుతో బరువెక్కే ఆమె కరుణార్ద్రమైన హృదయాన్ని ‘అంధగీతం’, ‘నాయనమ్మ’, ‘అమ్మ’ లాంటి కవితలు ప్రతిబింబిస్తాయి.


ఆమె కవిత్వ స్వభావాన్ని, శిల్ప చాతుర్యాన్ని, శైలీ రమ్యతను, మెటఫర్ల సౌందర్యాన్ని, కదిలించే శక్తిని, అక్కడక్కడ నిర్వచనాత్మక క్లుప్తతను తెలియజేసే కొన్ని పంక్తులివి: 

ఏ హరిణ నయన చేతి అమృత

          భాండంలోంచి తొణికిన వెన్నెలో

సముద్రం మీద చెల్లాచెదరైన ముత్యాల

        సరంలో పరచుకుంది (నిద్రిత నగరం)

దేవకన్యల తారాహారాలు నేలకు జారాయేమో

నగరం జడలో దీపాల మాలల్ని

అలంకరించుకుంది 

(నిద్రిత నగరం)

ఉబ్బిన నల్లనిరెప్పల క్రింద 

     గాజు గోళీల్లా వ్రేలాడే కళ్ళలో

అనంతమైన చీకటిని దాచుకొని

తన అయిదారేళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకొని

అతడు పెట్టెపెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు. (అంధగీతం)

చేత వెన్నముద్దతో దోగాడే, నీ చిన్ని కృష్ణుడి కంచు విగ్రహం

ఎన్నిసార్లు శుభ్రం చేసినా నా తడి కళ్ళకి

ఎప్పుడు మసక మసకగానే కనబడుతుంది (నాయనమ్మ)

నాయనమ్మా, నీవు కాలం గడిస్తే మరచిపోయే జ్ఞాపకానివి కావు

నా జీవితంలో తేనెలు చిందించిన బంగారు బాల్యానివి 

    (నాయనమ్మ)

అందుకోలేని స్వప్నాల సరిహద్దులను

                    తాకే ఊహారేఖ జీవితం (జీవితం)

ఆదమరచి నిద్రించిన హిమసుందరి ధవళ చేలాంచలం

విశ్రమించిన వేయిపడగల శ్వేతనాగై తోటను కప్పేసింది  

                      (మంచులో తడిసిన ఉదయం)

అసహనం నీ అరచేతిలో రిమోట్‌లా ఒదిగి

ఆలోచనల చానళ్లను అస్తవ్యస్తంగా మారుస్తుంది

పరధ్యానం నా పుస్తకంలో తలదాచుకొని

అన్యమనస్కంగా పేజీలు తిరగేస్తుంది 

                       (నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య)

పిట్టలు తమ వాయిద్యాలను పక్కకు బెట్టి

చెదిరిన స్వప్నంలాగా ఎక్కడికో ఎగిరిపోతాయి (నేరేడు చెట్టు)

వైదేహీ శశిధర్‌ నిజాయితీ కలిగిన కవయిత్రి. అంటే, నిజ జీవితంలోని ఆమె వ్యక్తిత్వానికి (person), తన కవితలో కానవచ్చే వ్యక్తిత్వానికి (persona) మధ్య అభేదం చూడ గలం. ఆమె తత్త్వంలోనే ఒక తేజోవంతమైన సాహితీ సౌందర్యాభిలాషతో పాటు పరుల యెడల, ప్రకృతి యెడల సహజసిద్ధమైన కారుణ్యభావన ఉంది. ఈ లక్షణాలు అంతర్లీనంగా దాదాపు ఆమె కవితలన్నిటిలో కనబడుతూనే వుంటవి. ప్రతీకలతో, రూపకాలతో అందమైన శబ్దార్థ భావ సంయోగంతో మెరిసే ఆమె కవితాపంక్తులు మన మనస్సు లలో మననమవుతూనే వుంటాయి.

చేపూరు సుబ్బారావు

99892 34505

Updated Date - 2020-10-19T06:28:38+05:30 IST