Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరుస జల్లులు..రైతులకు ఇక్కట్లు

 విక్రయిద్దామంటే కొనేవారు లేరు..

 ఆరబెడదామంటే సాధ్యం కావడంలేదు

 అనేకచోట్ల ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

 ఆందోళనలో అన్నదాతలు

త్రిపురారం/ దేవరకొండ/ మాడ్గులపల్లి/ పెద్దఅడిశర్లపల్లి/ కనగల్‌/ మునుగోడు/ నకిరేకల్‌, నవంబరు 16: వరుసగా రోజూ జల్లులు..ధాన్యం ఆరబెట్టాలంటే.. సాధ్యం కావడం లేదు.. విక్రయిద్దామంటే కొనేవారు లేరు..ఇదీ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దుస్థితి.. త్రిపురారం మండలంలో సాంబమసూరి ధాన్యాన్ని 10శాతం మేర రైతులు సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం ఆరబెడదామంటే రోజు చినుకులు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు కేంద్రం ఏర్పాటు కాలేదు.. మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు ఏం చేయాలలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.  దేవరకొండ డివిజన్‌లో రెండు రోజులుగా ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. మంగళవారం దేవరకొండ డివిజన్‌ పరిధిలోని దేవరకొండ, పీఏపల్లి, చింతపల్లి, డిండి, చందంపేట మండలాలలో ముసురుతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి కోతలు కోసిన రైతులు ధాన్యం తడుస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఏఎమ్మార్పీ  పరిధిలోని 60వేల ఎకరాలు, డిండి ప్రాజెక్టు కింద 16వేల ఎకరాల వరకు వరిపంటను సాగు చేశారు. ధాన్యం చేతికొచ్చే సమయానికి వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొండమల్లేపల్లి, పీఏపల్లి, డిండి మండలాలలో ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం అకాల వర్షం కురవడంతో ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. 20రోజులుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడంతో కొనుగోలు ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. పెద్దఅడిశర్లపల్లి మండలంలో పలుచోట్ల వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసింది. ఘనపురం, అంగడిపేట ఎక్స్‌రోడ్డు  గ్రామంలో ఈ నెల 8వ తేదీనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మునుగోడు, కనగల్‌ మండలంలోని పలు ఐకేపీ కేంద్రాల్లోకి వరద నీరు చేరి వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి.  తడిసిన కుప్పలను ఆరబెట్టే పనిలో రైతులు నిమగ్నమైయ్యారు. నకిరేకల్‌లో మంగళవారం కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. నకిరేకల్‌ మార్కెట్‌లో రైతులు పోసిన ధాన్యం వర్షపు వరద నీటిలో కొట్టుకపోయింది. నకిరేకల్‌ మార్కెట్‌తో పాటు చీమలగడ్డ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్ద ముద్దయ్యింది.  నెల రోజుల నుంచి మార్కెట్‌యార్డు, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. 


Advertisement
Advertisement