Abn logo
Sep 19 2021 @ 13:10PM

‘ఏపీ ఫైబర్ నెట్‌’పై కుట్ర చేస్తున్నారు: చినరాజప్ప

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ అంశంలో కావాలనే బురద చల్లుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కుట్రలో భాగంగానే.. గౌరీశంకర్‌ను ఎండీగా నియమిస్తూ సంబంధిత నోట్‌ ఫైల్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. స్వయంగా సంతకం చేశారని పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో దిక్కుతోచక తొలగించారని తెలిపారు. అనంతరం గౌరీశంకర్‌ నకిలీ ధ్రువపత్రాలపై ఎందుకు విచారణ చేయలేదని, ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ప్రశ్నించారు. మీకు కావాల్సిన వ్యక్తి కాబట్టే వదిలేశారా.. అంటూ దుయ్యబట్టారు.


ఈ వ్యవహారంలో గౌరీశంకర్‌ నకీలీ సర్టిఫికెట్లపై  ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 24వేల కిలోమీటర్ల ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్‌ వేయాలంటే రూ.4 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని.. దీన్ని టీడీపీ ప్రభుత్వం రూ.330 కోట్లకు పూర్తి చేయగలిగిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.149కే అంతర్జాలం, ఫోన్‌, టీవీ వంటి సౌకర్యాలను అందించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ కూడా అభినందించారని తెలిపారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపన్ని నాశనం చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని.. ఏ స్థాయికైనా తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కుట్రలోని భాగస్వాములందరినీ బయటకు తెచ్చి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption