Abn logo
Apr 8 2020 @ 05:11AM

పేదలకు స్థలాల పేరిట కుట్ర

కోర్టులు వీల్లేదంటున్నా తొందర ఎందుకు

మా భూముల్లో వేరే వారిని అడుగు పెట్టనీయం

112వ రోజు కొనసాగిన అమరావతి రైతులు ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం ఇచ్చిన భూములను కావాలని పేదలకు ఇళ్ల స్థలాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు తెర తీస్తే సహించేది లేదని  రైతులు తేల్చి చెప్పారు. ప్రాణాలు పోయినా వేరే వారిని ఇక్కడి భూముల్లోకి అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పారు. అమరావతి నుంచే పాలనంతా సాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 112వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాల్లో రైతులు వంతుల వారీగా నిరసనలు చేపట్టారు. అనంతవరం, తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, బోరుపాలెం, వెంకటపాలెం, యర్రబాలెం, కొరగళ్లు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ఇంటి ముందు సేవ్‌ అమరావతి అంటూ ముగ్గులు వేశారు. ధాన్యం, కాయగూరలతో సేవ్‌ అమరావతి రాసి నిరసనలు తెలిపారు.   మంగళవారం కూడా ‘అమరావతి వెలుగు’ కార్యాక్రమాన్ని కొనసాగించారు. 29 గ్రామాల కూడళ్లలో మహిళల్లో కొవ్వొత్తులతో మానవహారాలుగా ఏర్పడి జై అమరావతి అంటూ నిరసనలు తెలిపారు. 


రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు స్థలాలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. కరోనా అని ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రానీయకుండా కూలీలతో భూముల్లో సర్వే రాళ్లు వేస్తున్నారు. ఈ నెల 14న పంపకం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా పంపకానికి సిద్ధం చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.


  ఐనవోలు, మందడం రెవెన్యూలో 39 ఎకరాలను సీఆర్డీఏ అధికారులు  మంగళవారం సర్వే కూలీలతో హద్దు రాళ్లు వేయించారు. ఇంటిలో నుంచి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని  చెపుతున్న పోలీసులు రాజధాని భూముల్లో సీఆర్డీఏ అధికారులు కూలీలను ఏర్పాటు చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తుంటే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ సమయంలో సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడిపై కోర్టుకు వెళతామని రాజఽధాని రైతులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement