సుశాంత్ మృతి కేసులో ఆదిత్యను ఇరికించేందుకు కుట్ర: శివసేన

ABN , First Publish Date - 2020-08-05T23:25:52+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర మంత్రి, యువసేన అధ్యక్షుడు ఆదిత్య...

సుశాంత్ మృతి కేసులో ఆదిత్యను ఇరికించేందుకు కుట్ర: శివసేన

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో మహారాష్ట్ర మంత్రి, యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరేని ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. శివసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రావత్ ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శివసేన నాయకత్వాన ప్రభుత్వం అధికారంలో ఉండడాన్ని జీర్ణించుకోలేకే ప్రతిపక్షాలు ఇప్పటికీ ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ఆదిత్య థాకరేకి ఏమి సంబంధం? శివసేన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి...’’ అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య థాకరేని ఇందులో ఇరికించాలని కుట్ర పన్నుతున్న వాళ్లంతా అంతకంతకూ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా సుశాంత్ మృతి కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మంగళవారం ఆదిత్య థాకరే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అకారణంగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓ బాలీవుడ్ నటుడి మృతిపై కొందరు ‘‘నీచ రాజకీయాలు’’ చేస్తున్నారంటూ పేర్కొన్న ఆయన.. రాజకీయ అక్కసుతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-05T23:25:52+05:30 IST