స్వచ్ఛ ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-03-29T12:04:16+05:30 IST

కరోనా నేపథ్యంలో విజయనగరంలోని ఘోషాసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి

స్వచ్ఛ ఆస్పత్రి

‘ఘోషాసుపత్రి’లో ప్రత్యేక చర్యలు

నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ


(రింగురోడ్డు) : కరోనా నేపథ్యంలో విజయనగరంలోని ఘోషాసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ  ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి గర్భిణులు, బాలింతలు వస్తుంటారు. ఓపీ కూడా ఎక్కువే. ఘోషాసుపత్రిలో తగిన చర్యలు తీసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భావించిన వైద్యులు రెండురోజులుగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆసుపత్రిని శుభ్రపరుస్తున్నారు. రసాయనాలు, శానిటైజర్స్‌ను స్ర్పే చేస్తున్నారు. మామూలు రోజుల్లో పారిశుధ్య సమస్యతో పాటు ఎక్కడికక్కడ వైద్యానికి సంబంధించిన వ్యర్థాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బెడ్స్‌ని అదే విధంగా బెడ్స్‌పై ఉండే దుప్పట్ల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లను అందజేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్య సిబ్బంది వరకూ మాస్క్‌లను ధరిస్తున్నారు.


ఓపీ సమయంలో సామాజిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నాలుగు దఫాలుగా యాంటినేటల్‌ చెకప్‌ ( కడుపులో ఉన్న బిడ్డ స్థితిగతులు తెలుసుకునేందుకు)కు గర్భిణులు వెళ్లాల్సి ఉంటుంది. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లే సందర్భంలో మాస్క్‌లు ధరించాలని, తప్పనిసరి అయితేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.  సామాజిక దూరం పాటించాలని.. ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే సబ్బు నీటితో దుస్తులను, శానిటైజర్స్‌తో  చేతులను శుభ్రపరుచుకోవాలని ప్రత్యేకంగా స్లోగన్‌ల ద్వారా సూచిస్తున్నారు. 


అన్నీ అందుబాటులో ఉంచాం 

కరోనా నేపథ్యంలో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయి నుంచి వైద్యుల వరకూ అందరూ మాస్క్‌లు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శానిటైజర్స్‌ని అందుబాటులో ఉంచాం. రసాయనాలతో పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. ఆసుపత్రి అవరణలో డై క్లోర్వోస్‌-76 ఈసీ రసాయనాన్ని స్ర్పే చేస్తున్నాం. వైద్య పరీక్షల సమయంలో గర్భిణులు సామాజిక దూరాన్ని పాటించాలి.

   - డాక్టరు దినేష్‌, ఆర్‌ఎంవో, ఘోషాసుపత్రి 


Updated Date - 2020-03-29T12:04:16+05:30 IST