రాజ్యాంగంతో స్వేచ్ఛాయుత జీవనం

ABN , First Publish Date - 2021-11-27T06:13:56+05:30 IST

దేశంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యాంగ రచన జరిగిందని సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు.

రాజ్యాంగంతో స్వేచ్ఛాయుత జీవనం
దివాన్‌చెరువు: అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న ‘నన్నయ’ వీసీ

  • సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా.. ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
  • అంబేడ్కర్‌కు ప్రముఖల నివాళులు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 26: దేశంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యాంగ రచన జరిగిందని సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్ర వారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు ప్రముఖులు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు, చిత్రపటా లకు పూలమాలలతో నివాళులర్పించారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ అప్పటి న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేడు ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగఫలమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో దేవి, డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్‌, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక విజిలెన్స్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్‌ ప్రతిజ్ఞ చేయించారు. పౌరులంతా భారత రాజ్యాంగం పట్ల పూర్తి నిబద్ధతతో ఉండాలని అన్నారు. విజిలెన్స్‌ డీఎస్పీ పి.ముత్యాలరాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళాశాల ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.

Updated Date - 2021-11-27T06:13:56+05:30 IST