బలవంతపు మత మార్పిడులకు రాజ్యాంగ అనుమతి లేదు : అలహాబాద్ హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-01T18:20:09+05:30 IST

అవమానాన్ని ఎదుర్కొన్న మెజారిటీ మతస్థుడు వేరొక

బలవంతపు మత మార్పిడులకు రాజ్యాంగ అనుమతి లేదు : అలహాబాద్ హైకోర్టు

న్యూఢిల్లీ : అవమానాన్ని ఎదుర్కొన్న మెజారిటీ మతస్థుడు వేరొక మతంలోకి మారడం వల్ల దేశం బలహీనపడుతుందని, వినాశకర శక్తులు దానివల్ల లబ్ధి పొందుతాయని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. 21 ఏళ్ళ యువతిని పెళ్ళి చేసుకుని, చట్టవిరుద్ధంగా ఆమెను మతం మార్చిన వ్యక్తి బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఉత్తర ప్రదేశ్ యాంటీ కన్వర్షన్ చట్టంలోని సెక్షన్ 5(1), భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 366, 368, 120-బీ ప్రకారం ఇటావాకు చెందిన జావేద్‌పై కేసు నమోదైంది. 21 ఏళ్ళ యువతిని అపహరించి, పెళ్లి చేసుకుని, ఆమెను బలవంతంగా మతం మార్చినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. 


ప్రతి వయోజనుడికి వేరొక మతంలోకి మారే స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో చట్టం ప్రకారం ఎటువంటి అడ్డంకి లేదని తెలిపింది. అయితే మత ఛాందసవాదం, దురాశ, భయం వంటివాటికి దేశంలో చోటు లేదని తెలిపింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు భయంతో కానీ, దురాశతో కానీ మతం మారబోరని, అయితే అవమానాన్ని ఎదుర్కొనడంతో మతం మారుతారని తెలిపింది. ఇతర మతాల్లో తమకు గౌరవం లభిస్తుందని నమ్ముతారని పేర్కొంది. దీనిలో ఎటువంటి హాని లేదని పేర్కొంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ గౌరవ, మర్యాదలతో జీవించే హక్కు ఉందని తెలిపింది. ఓ వ్యక్తికి తన సొంతింట్లో గౌరవం లభించకపోతే, నిర్లక్ష్యానికి గురైతే, ఆ వ్యక్తి ఆ ఇంటిని వదిలిపెడతారని పేర్కొంది. 


మతం అనేది భక్తి సాధనమని తెలిపింది. దీనిని ఏదో ఒక ప్రార్థనా విధానానికి ముడిపెట్టకూడదని పేర్కొంది. భారత దేశం వేర్వేరు మతాలకు నిలయమని చెప్పింది. భారత దేశంలో మత ఛాందసత్వం, దురాశ, భయాలకు చోటు లేదని పేర్కొంది. ఈ మూడింటి ద్వారా ఎవరైనా తన మతం నుంచి వేరొక మతంలోకి వెళ్లడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. భారత రాజ్యాంగం కూడా దీనిని అనుమతించదని తెలిపింది. అన్ని వ్యక్తిగత చట్టాల ప్రకారం వివాహం అనేది పవిత్రమైన వ్యవస్థ అని,  హిందూ చట్టం ప్రకారం వివాహం అంటే యజ్ఞమని, సంస్కారమని వివరించింది. 


భారత రాజ్యాంగంలోని అధికరణ 15(1) ప్రకారం మత మార్పిడికి అనుమతి ఉందని, అయితే బలవంతపు మత మార్పిడికి అనుమతి లేదని తెలిపింది. ఈ కేసులో నిందితుడు జావేద్ వురపు జబీబ్ అన్సారీకి బెయిలును తిరస్కరించింది. 


Updated Date - 2021-08-01T18:20:09+05:30 IST