ఫ్లాట్ల ధరలు పైపైకి!

ABN , First Publish Date - 2021-03-08T07:38:51+05:30 IST

పద్మారావునగర్‌కు చెందిన రాజేశ్‌ గత ఆగస్టులో సికింద్రాబాద్‌లోని బౌద్దనగర్‌లో నిర్మాణం జరుగుతున్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులో ఫ్లాట్‌ కొనుగోలుకు వెళ్లాడు.

ఫ్లాట్ల ధరలు పైపైకి!

  • 20 శాతం పెరిగిన భవన నిర్మాణ వ్యయం
  • భారీగా పెరిగిన అపార్ట్‌మెంట్ల ధరలు
  • లాక్‌డౌన్‌కు ముందుకన్నా చదరపు అడుగుకు
  • రూ.500 నుంచి రూ.1500 వరకు పెరుగుదల
  • ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పద్మారావునగర్‌కు చెందిన రాజేశ్‌ గత ఆగస్టులో సికింద్రాబాద్‌లోని బౌద్దనగర్‌లో నిర్మాణం జరుగుతున్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులో ఫ్లాట్‌ కొనుగోలుకు వెళ్లాడు. చదరపు అడుగుకు రూ.3800గా డెవలర్‌ ధర చెప్పడంతో ఆరు నెలల తర్వాత చూద్దామంటూ వెనుదిరిగాడు. ఆ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దశకు చేరడంతో రాజేశ్‌ ఇటీవల మరోసారి సందర్శించాడు. అపార్ట్‌మెంట్‌ మొత్తం కలియ తిరిగి.. చివరకు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. డెవలపర్‌ను సంప్రదించగా.. చదరపు అడుగుకు రూ.5 వేలు చెప్పాడు. ‘‘6 నెలల క్రితం రూ.3800 మాత్రమే ఉంది కదా..’’ అని ప్రశ్నిస్తే, ‘‘అప్పటికి, ఇప్పటికి ధరలు ఒకే విధంగా ఉన్నాయా?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. దాంతో ఆలస్యమైతే ధర మరింత పెరిగే అవకాశముందని రాజేశ్‌ అడ్వాన్స్‌ చెల్లించాడు.


ఈ పరిస్థితి కేవలం సికింద్రాబాద్‌ పరిధిలోనే కాదు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ధరలు కొవిడ్‌-19కు ముందు కన్నా భారీగా పెరిగాయి. లాక్‌డౌన్‌ తర్వాత  భవన నిర్మాణానికి అవసరమైన 78 రకాల వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. స్టీల్‌ ధర కిలోకు రూ.16 నుంచి రూ.20కి చేరింది. సిమెంటు బస్తా ధర ఒకప్పుడు రూ.220 నుంచి రూ.250 వరకు ఉండగా, రూ.320 నుంచి రూ.350 వరకు పెరిగింది. ఇటుక, కాంక్రీట్‌, చివరికి రోబోసాండ్‌ ధరలూ పెరిగాయి. వీటికితోడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లిన కార్మికులు.. తిరిగి రావడానికి దినసరి వేతనాన్ని పెంచాలని డెవలపర్లపై ఒత్తిడి తీసుకురావడంతో అవి కూడా పెరిగాయి. పెరిగిన డీజిల్‌ ధరలు కూడా నిర్మాణ రంగంపై ప్రభావం చూపాయి. వెరసి.. నిర్మాణ వ్యయం 20% పెరిగింది.


సిద్ధమైన ప్రాజెక్టులకు డిమాండ్‌..

కరోనా కల్లోలం, లాక్‌డౌన్‌తో నాలుగు నెలలపాటు అపార్ట్‌మెంట్ల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆపేయడంతో మరోసారి స్తంభించాయి. రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం కాగానే.. ఎంతోకాలంగా ఫ్లాట్ల కొనుగోలు కోసం వేచిచూస్తున్న వారితో.. రెడీ టు మూవ్‌ ఫ్లాట్లకు డిమాండ్‌ పెరిగింది. కొవిడ్‌-19తో సొంతింటి అవసరం ఏర్పడడంతోపాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం కారణంగా ప్రజలు చాలా వరకు ఇంట్లోనే ప్రత్యేక సౌకర్యాలను వెతుక్కుంటున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో ఉన్నవారు ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ను, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌లో ఉండేవారు విల్లాలు, వ్యక్తిగత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటి డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో గత ఏడాది లాక్‌డౌన్‌ తర్వాత ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే సుమారు 40 శాతం ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభమయ్యాయి. మూఢాలు, సంక్రాంతి తర్వాత మంచిరోజులు లేకపోవడంతో 2020లోనే కొత్త ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. ఇవి ప్రారంభమయ్యే సమయానికి నిర్మాణ వ్యయం 20ు పెరిగింది. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల్లో బుకింగ్‌లు చేసుకునేవారికి పెరిగిన వ్యయం ఆధారంగానే ఫ్లాట్‌లను విక్రయిస్తున్నారు. రెరా నియమాల ప్రకారం.. బుకింగ్‌ చేసుకున్న వారికి నిర్ణీత గడువులోపు ఫ్లాట్‌లను అప్పగించాల్సి ఉండడంతో ఆ మేరకు క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి.


ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా..

ఉప్పల్‌, బోడుప్పల్‌లో ఒకప్పుడు చదరపు అడుగుకు రూ.4వేలు-రూ.5వేల వరకు ఉన్న ఫ్లాట్ల ధరలు ప్రస్తుతం రూ.5వేలు-రూ.5500 వరకు ఉన్నాయి. మల్కాజిగిరిలో ధరలు రూ.4వేల నుంచి 4,500 పెరిగాయి. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో రూ.5,500-రూ.7వేల వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.500 మేర పెరిగింది. సీతాఫల్‌మండిలో రూ.4500 ఉన్న ధర.. రూ.6 వేలకు పెరిగింది. కాగా, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌, నార్సింగి ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.


సొంతింటి కలకు ఇదే సరైన సమయం

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మార్కెట్‌ పడిపోయినా.. హైదరాబాద్‌లో డెవలపర్లు, బిల్డర్లు ఆందోళన చెందలేదు. మార్కెట్‌  మరింత పుంజుకుంటుందని భరోసా కల్పించాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫీజులను వాయిదాల చొప్పున చెల్లించడానికి, పలు ఇన్సెంటివ్‌లను కల్పించడం వల్ల మార్కెట్‌ పుంజుకుంది. ఇటీవల నిర్మాణ వ్యయం పెరిగినా.. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల ధరలు మాత్రం అందుబాటులోనే ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగానే ఉన్నాయి. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

- రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి 


రెడీ ఫర్‌ మూవ్‌ ఫ్లాట్‌లకు డిమాండ్‌ 

నగరంలో ప్రస్తుతం రెడీ ఫర్‌ మూవ్‌ ఫ్లాట్‌లకు డిమాండ్‌ పెరిగింది. కొవిడ్‌-19 తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇరుకు ఇళ్లలో, అద్దె ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు సొంతింటికి ప్రాధాన్యమిస్తున్నారు. చాలా మంది విశాలమైన ఇల్లు, సౌకర్యాలు కోరుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మందగించిన మార్కెట్‌ ప్రస్తుతం అంతకుమించిన స్థాయిలో ముందుకెళ్తోంది. కొత్త ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయంతోపాటు రుణాలపై వడ్డీభారం కూడా అధికమైంది. దీంతో ఆ భారం వినియోగదారులపై పడుతోంది. 

- ఎం.విజయసాయి, ట్రేడ్‌ ఉపాధ్యక్షుడు

Updated Date - 2021-03-08T07:38:51+05:30 IST