రూ.3 లక్షల కోట్ల రోడ్లు

ABN , First Publish Date - 2022-02-18T07:52:04+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 2024నాటికి రూ.మూడు లక్షల కోట్ల నిధులు ఖర్చు చేస్తాం. మా శాఖలో నిధులకేం లోటు లేదు. నిధులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు’’ అని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల శాఖ మంత్రి..

రూ.3 లక్షల కోట్ల రోడ్లు

2024 నాటికి ఏపీలో పూర్తిచేస్తాం

ఆరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేల నిర్మాణం

సీఎం 20 ఆర్‌వోబీలు అడిగారు

30కి అనుమతులు ఇస్తున్నా

దేశాభివృద్ధితో రోడ్ల అభివృద్ధి కాదు

రోడ్ల అభివృద్ధితోనే దేశాభివృద్ధి: గడ్కరీ

బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ సహా 51 

ఎన్‌హెచ్‌ల ప్రారంభం, భూమిపూజ

మరికొన్నింటికీ అనుమతివ్వండి: సీఎం


పోలవరం అలా పరుగులు.. 

‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వందల టీఎంసీల నీరు రైతుల పొలాలకు మళ్లుతుంది. అందుకే దానిపై శ్రమించాం. అప్పట్లో కాంట్రాక్టరు పెద్ద సమస్యగా మారారు. అయితే.. అన్ని సమస్యలూ అధిగమించి పోలవరం పనులను గత ప్రభుత్వంలో పరుగులు పెట్టించాం. చాలా వేగంగా పనులు నడిచాయి. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయండి. ఒక రైతుగా నాకు పోలవరంతో భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రాజెక్టు పూర్తికాగానే జరిపే ప్రారంభోత్సవానికి నన్నూ పిలవండి.’’ 

నితిన్‌ గడ్కరీగురువారం విజయవాడలో ప్రారంభించిన బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌


అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 2024నాటికి రూ.మూడు లక్షల కోట్ల నిధులు ఖర్చు చేస్తాం. మా శాఖలో నిధులకేం లోటు లేదు. నిధులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు’’ అని కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. బెంజ్‌సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ సహా రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన, కొత్తగా నిర్మించనున్న 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సీఎం జగన్‌తో కలిసి పర్చువల్‌గా ప్రారంభం, భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఉపరితల రవాణా సహాయమంత్రి వీకే సింగ్‌ జూమ్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్‌గడ్కరీ మాట్లాడారు. ‘‘ఇప్పుడు ప్రారంభించిన, భూమిపూజ చేసిన జాతీయ రహదారుల ప్రాజెక్టుల విలువ రూ.21,500కోట్లు. ఇంతేకాదు రాబోయే మూడేళ్లలో ఏపీలో మూడు లక్షల కోట్లు ఖర్చుచేస్తాం. దేశవ్యాప్తంగా 22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తున్నాం. అందులో ఆరు ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ఏపీలోనే వేస్తాం. ఇందులో అతి ముఖ్యమైనది విశాఖపట్నం-నయా రాయ్‌పూర్‌ గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే. 465 కిలోమీటర్ల మేర రూ.16,102కోట్ల ఖర్చుతో  2024చివరికి దీన్ని పూర్తిచేస్తాం.


రెండో ఎక్స్‌ప్రెస్‌ వే నాకూ ముఖ్యమే. ఎందుకంటే అది నాగపూర్‌లో... అంటే నా నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. విజయవాడకు వస్తుంది. ఇది 405కిలోమీటర్లు. 15వేల కోట్లతో నిర్మాణమవుతుంది. ఇందులో 95కిలోమీటర్ల పనులు నడుస్తున్నాయి. మిగతా 310కిలోమీటర్లకు డీపీఆర్‌ రూపొందిస్తున్నాం. దీన్ని 2025కి పూర్తిచేస్తాం. కృష్ణా జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇది ఉపకరిస్తుంది. చిత్తూరు-తట్చూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే 116కిలోమీటర్లు-5వేల కోట్ల ఖర్చు, హైదరాబాద్‌-విజయవాడ హైవే ఆరువేల కోట్లు, బెంగళూరు-చెన్నై బెటర్‌ కనెక్టివిటీకి రూ.17వేల కోట్లతో గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తున్నాం. ఇవన్నీ 2025నాటికి పూర్తిచేస్తాం. ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై 160 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్తాయి. గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణంతో వేగం పెరిగి..దూరం తగ్గుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఇంధనం ఖర్చు, సమయం, లాజిస్టిక్స్‌ ఖర్చులు తగ్గిపోతాయి. చైనాలో లాజిస్టిక్స్‌ ఖర్చులు జీడీపీలో 8-10శాతం ఉండగా...అమెరికాలో 12శాతం, భారత్‌లో 16శాతం ఉన్నాయి. మనదేశంలో ఈ ఖర్చులను ఆరుశాతానికి తీసుకురావాలనేది లక్ష్యం’’ అని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు.


విజయవాడ తూర్పు బైపా్‌సరోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చి, జీఎ్‌సటీ మినహాయింపు ఇస్తే చాలు. ఆ ప్రాజెక్టు నిర్మిస్తాం. సీఎం జగన్‌ రాష్ట్రానికి 20 ఆర్‌వోబీలు కావాలని అడిగారు. 30కి అనుమతిస్తున్నా’’ అని తెలిపారు.  


గ్రీన్‌ హైడ్రోజన్‌తో వాహనాలు...ఎలక్ర్టిక్‌ ట్రక్‌లు

‘‘నా పేషీలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ కెన్నడీ సూక్తి ఒకటి ఉంటుంది. అమెరికా బాగున్నందున రోడ్లు బాగుండడం కాదు...  రోడ్లు బాగుండడం వల్లే అమెరికా బాగుందని ఆయన చెప్పారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. రవాణా ఖర్చు తగ్గించడంతోపాటు కాలుష్యం లేని రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కాలుష్యం లేకుండా చేసేందుకు గ్రీన్‌ హైడ్రోజన్‌తో వాహనాలు నడిచే సాంకేతికత వైపు చూస్తున్నామన్నారు. అదేవిధంగా ఎలక్ర్టిక్‌ ట్రక్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. 


గడ్కరీకి ధన్యవాదాలు.. ఇవీ కావాలి: సీఎం

రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ప్రాజెక్టులను పూర్తిచేసిన కేంద్రం, గడ్కరీకి ఎలాంటి సంకోచం, రాజకీయ ప్రమేయం లేకుండా ధన్యవాదాలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. రాష్ట్రానికి మరికొన్ని రోడ్ల ప్రాజెక్టులు ఇవ్వాలని ఈ సందర్భంగా గడ్కరీని ఆయన కోరారు. 20 ఆర్వోబీలకు అనుమతులు కావాలని, తెలుగువారైన కిషన్‌రెడ్డిని రాష్ట్రం మీద శ్రద్ధ చూపించాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు. సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నితిన్‌ గడ్కరీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను కేంద్ర మంత్రులకు అధికారులు, వేద పండితులు అందించారు. 


విశాఖలో అల్లూరి మ్యూజియం: కిషన్‌రెడ్డి

ఏపీకి ఏడున్నరేళ్లుగా కేంద్రం పూర్తి సహకారం అందించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిఅల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, హైదరాబాద్‌, ఢిల్లీలలో 125చోట్ల కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని, విశాఖలో మ్యూజియం నెలకొల్పుతామని తెలిపారు.


పర్యాటకానికి ‘జగన్‌’ వెన్న..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ హిందీలో కొంతసేపు మాట్లాడారు. ప్రసంగం ముగించాక ‘జై జగన్‌’ అని నినదించారు. దీనికి పోటీగా సభకు హాజరైన పలువురు ‘జై మోదీ’ అని నినాదాలు చేశారు. ఈ హడావుడి కొంతసేపు కొనసాగింది. పర్యాటకం గురించి జగన్‌ మాట్లాడుతూ...పర్యాటకానికి వెన్న (వన్నెతెచ్చేలా అనాలి)తెచ్చేలా అనడం కొసమెరుపు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. 


వాజపేయీ అడిగారు.. ఇచ్చాను : గడ్కరీ

‘‘వాజపేయీ ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు ఒక ప్రణాళిక ఇవ్వాలని అడిగారు. అప్పుడు నా వయసు 32ఏళ్లు. అందరితో మాట్లాడి ఆనాడు నేనిచ్చిన ప్రణాళికే గ్రామీణ భారత్‌ సడక్‌ యోజనగా విస్తృత ప్రచారం పొందింది’’


గడ్కరీ వరాల జల్లు

విజయవాడ తూర్పు బైపాస్‌, భీమిలి-భోగాపురం బీచ్‌ కారిడార్‌  

భూసేకరణ  ఖర్చు పూర్తిగా కేంద్రానిదే : గడ్కరీ హామీలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రతిపాదించిన కీలక రహదారి ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చు తాము భరిస్తామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.ఇంకా కేంద్రం పరిధిలో పరిశీలనలో ఉన్న మరో ఆరుప్రాజెక్టుల ప్రతిపాదనలను వెంటనే పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు జాతీయరహదారులకు శంకుస్థాపనతోపాటు, ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం గడ్కరీ తాడేపల్లిలోని సీఎం జగన్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ విందు అనంతరం కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు, ఏపీ ఆర్‌అండ్‌బీ అధికారులతో అటు కేంద్ర మంత్రి, ఇటు సీఎం సంయుక్తంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో ఒక్కో అంశంపై ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నేతృత్వంలో  ఏపీ అధికారుల బృందం గడ్కరీతో చర్చలు జరిపింది.


పలు ప్రాజెక్టులపై ప్రజంటేషన్లు ఇచ్చింది. విజయవాడ తూర్పుబైపాస్‌, భీమిలీ-భోగాపురం బీచ్‌కారిడార్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి పూర్తిస్తాయిలో అంగీకరించారు. విజయవాడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టు భూ సేకరణకు అయ్యే రూ.2200 కోట్లు, విశాఖలో భీమిలీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రతిపాదించిన 20 కిలోమీటర్ల బీచ్‌కారిడార్‌ రహదారికి సంబంధించిన భూసేకరణకు చేయాల్సిన రూ.1400 కోట్ల ఖర్చును భరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. రాష్ట్ర, జాతీయ రహదారులపై మొత్తం 33 ఆర్‌ఓబీల నిర్మాణానికి 2200 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నిజానికి సీఆర్‌ఐఫ్‌ కింద రాష్ట్రానికి వచ్చిన నిధులను సర్కారు వాడేసింది. ఇప్పుడు అదనంగా ఆ నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి అంగీకరించినట్లు తెలిసింది. 


4 వరుసల రహదారిగా అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే: అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను తాము ప్రతిపాదించినట్టు గుంటూరు వరకు తీసుకురావాలని, దాన్ని ఆరువరుసల స్థానంలో నాలుగు లేన్లుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఇంతకుముందే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు భూ సేకరణ కూడా కేంద్రమే భరించాలని తాజాగా అధికారులు కోరినట్లు తెలిసింది. 


పులివెందుల-కొడికొండ వరకు హైవే... 

సీఎం సొంత జిల్లా కడప నుంచి పులివెందుల మీదుగా కర్ణాటకలోని కొడికొండ చెక్‌పోస్టు వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా చేపట్టాలన్న ప్రతిపాదనను కేంద్రం ఇంతకుముందే అంగీకరించింది. భూ సేకరణ ఖర్చును భరించేందుకు కూడా ఈ సమావేశంలో గడ్కరీ అంగీకరించారు.




జనంలోకి మన పథకాలు, సంక్షేమం : బీజేపీ నేతలకు గడ్కరీ నిర్దేశం

బీజేపీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆపార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘అనేకసార్లు విజయవాడ రావాలని అనుకున్నా కొవిడ్‌ నేపథ్యంలో ఆలస్యమైంది. ఎట్టకేలకు ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మోదీ నేతృత్వంలో దేశం అభివృదిఽ్ధ పథంలో ముందుకు సాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూసేలా మోదీ అభివృద్ధి చేస్తున్నారు. యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని బీజేపీ ప్రభుత్వం ఈ పదేళ్లలో చేసి చూపించింది. జాతీయ రహదారుల అభివృద్ధి ద్వారా అనేక రహదారులను అనుసంధానం చేశాం. నా శాఖపరంగా ఎలాంటి సహకారం కావాలన్నా ఏపీ ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమే’’నని గడ్కరీ అన్నారు. కాగా, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్ర నిధులు లేకుంటే రాష్ట్రంలో రహదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-18T07:52:04+05:30 IST