ఇంకెన్నాళ్లీ కష్టాలు

ABN , First Publish Date - 2020-08-13T10:13:42+05:30 IST

సిర్పూర్‌ నియోజక వర్గంలోని పలు మండలాల్లో వాగులపై వంతెనలు పూర్తి కాకపోవడంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు

ఇంకెన్నాళ్లీ కష్టాలు

వాగులపై వంతెనలు లేక వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం

ఏడేళ్లుగా కొనసాగుతున్న అంకుషాపూర్‌ బ్రిడ్జి నిర్మాణం

నారాపూర్‌లో హైలెవల్‌ వంతెన లేక ఇక్కట్లు


కాగజ్‌నగర్‌, ఆగస్టు12: సిర్పూర్‌ నియోజక వర్గంలోని పలు మండలాల్లో వాగులపై వంతెనలు పూర్తి కాకపోవడంతో ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్‌-వాంకిడి మండలాలకు అనుసంధానంగా ఉండేందుకు అంకు సాపూర్‌ వాగుపై 2013 సంవత్సరంలో రూ.1.50 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభించారు. కానీ బ్రిడ్జి నిర్మాణానికి ఆది నుంచి అవాంతరాలే ఎదుర వుతున్నాయి. దీంతో రెండేళ్లలో నిర్మించాల్సిన వంతెన  పనులు ఆరేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. కాగజ్‌ నగర్‌-అంకుసాపూర్‌-వాంకిడిని కలిసేందుకు ప్రత్యేక రోడ్డు సౌకర్యం కూడా పూర్తి చేశారు. నిధుల లేమి, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి కావటం లేదు. బ్రిడ్జి పనులు కేవలం పిల్లర్ల స్థాయిలోనే మగ్గుతున్నాయి. 2018లో బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని రూ.3కోట్లకు పెంచారు. వాస్తవంగా ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఆసిఫా బాద్‌తో సంబంధం లేకుండా నేరుగా కాగజ్‌నగర్‌ నుంచి వాంకిడికి వెళ్లేందుకు ఆస్కారం ఉంది.  కానీ వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఏటా ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. చిన్నపాటి వర్షం కురిసిందంటే అంకుసాపూర్‌ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. 


బెజ్జూరు మండలంలోని చిన్నసిద్దాపూర్‌, పెద్దసిద్దాపూర్‌ వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. నిధులు మంజూరైనప్పటికీ  అటవీ శాఖ అనుమతి రావాల్సి ఉంది. కృష్ణపల్లి, సోమిని మధ్య కూడా వంతెన నిర్మించాల్సి ఉంది. వర్షాకాలం వచ్చిదంటే పెద్దసిద్దాపూర్‌, చిన్నసిద్దాపూర్‌, కృష్ణపల్లి, సోమినితో పాటు మరో నాలుగు గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. పెంచికల్‌పేటలోని ఎర్రగుంట వద్ద ఉత్సమల్లివాగుపై వంతెన లేకపోవటంతో  స్థాని కులు ఇబ్బందులు పడుతున్నారు. లోడ్‌పల్లి వద్ద బొక్కివాగుపై వంతెన లేకపోవటంతో వర్షాకాలంలో గొల్లగూడ వాసులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. కాగజ్‌నగర్‌ నుంచి భీమిని వెళ్లే మార్గంలో జగన్నాథ్‌పూర్‌ గ్రామం సమీపంలోని వాగు వరా ్షకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ   వంతెన నిర్మించాలని కాగజ్‌నగర్‌, భీవిని మండలాల  ప్రజలు కోరుతున్నారు.


అత్యవసర సమయాల్లో దేవుడిపైనే భారం

కాగజ్‌నగర్‌ మండలం నారాపూర్‌లో ప్రధానంగా   హైలెవల్‌ వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ గ్రామానికి   ఒక్క బస్సు, ఆటో కూడా రాదు. ద్విచక్ర వాహనం పైనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో 50 కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ గ్రామ పొలి మేరలోనే కుమరం భీం నుంచి పోయే నీటి కాల్వ ఉంటుంది. వర్షాకాలంలో ఈకాల్వలో మోకాలి లోతుతో ఎప్పటికీ నీరు ప్రవహిస్తుండటం వల్ల ఆటోలన్నీ గ్రామ పొలిమేర వరకే నడుస్తుంటాయి. అయితే అర్ధరాత్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడి తే దేవుడిపైనే భారం వేసి బతుకాల్సిన పరిస్థితి ఉంది. కాగజ్‌నగర్‌కు సరిగ్గా 10కిలోమీటర్ల దూరం లోనే నారాపూర్‌ గ్రామం ఉండడం గమనార్హం. అధికారులు ముందస్తుగా స్పందించి ప్రత్యేకంగా హై లెవల్‌ వంతెన నిర్మాణం చేపట్టాలని నారాపూర్‌ గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 


అధికారులు స్పందించాలి-రాంతేజ్‌, అంకుషాపూర్‌

కాగజ్‌నగర్‌-వాంకిడి మార్గాల్లో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. వర్షం కురిసిందంటే రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి.   ఏటా ఇదే సమస్య పునరావృతం అవుతోంది. అధికారులు ముందస్తుగా స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో పనులు వేగవంతంగా అయ్యేట్టు చేస్తే బాగుంటుంది. 


వంతెన నిర్మాణం పూర్తి చేయాలి-పత్రు, అంకుషాపూర్‌

కాగజ్‌నగర్‌-వాంకిడికి నేరుగా వెళ్లేందుకు ప్రత్యేక రహదారి ఉంది. ఈ మార్గంలో అంకుషాపూర్‌ వంతెన ఉంది. ఈ వంతెనపై బ్రిడ్జి నిర్మాణం కోసం 2013లో నిధుల విడుదల చేశారు. ఇప్పటి నిర్మాణం పూర్తికాలేదు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కావడం లేదు. నిధులు పెంచినా బ్రిడ్జి నిర్మాణంలో ఇంత వరకు పురోగతి లేదు.

Updated Date - 2020-08-13T10:13:42+05:30 IST