వైద్య నిర్లక్ష్యం బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం

ABN , First Publish Date - 2021-11-13T23:40:49+05:30 IST

వైద్య నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన మహిళ

వైద్య నిర్లక్ష్యం బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం

న్యూఢిల్లీ : వైద్య నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిని, ఓ డాక్టర్‌ను జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. తల్లిని కోల్పోవడం ఎన్నటికీ మానని శాశ్వత గాయమని కమిషన్ ప్రెసిడెంట్ ఆర్‌కే అగర్వాల్ అన్నారు. తల్లి లేని మదర్స్ డే ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోగలమన్నారు. 


బాధిత కుటుంబానికి రూ.16 లక్షలు పరిహారం చెల్లించాలని మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 2015 ఫిబ్రవరిలో తీర్పు చెప్పింది. దీనిపై ఈ ఆసుపత్రి, డాక్టర్ చేసిన అపీలును జాతీయ కమిషన్‌ విచారించింది. నవంబరు 11న ఇచ్చిన తీర్పులో ఈ అపీలును తోసిపుచ్చుతూ, పరిహారాన్ని రూ.20 లక్షలకు పెంచింది. బాధిత కుటుంబానికి వ్యాజ్య ఖర్చుల క్రింద రూ.1,00,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ డాక్టర్ సమంజసమైన నైపుణ్యం, శ్రద్ధ చూపడంలో విఫలమయ్యారని పేర్కొంది. వేరొక ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పడంలో విపరీతమైన జాప్యం జరిగిందని, ఇది నిర్లక్ష్యమేనని తెలిపింది.


ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 1995 సెప్టెంబరు 20న బాధిత మహిళకు ఈ ఆసుపత్రిలో లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ (ఎల్ఎస్‌సీఎస్) జరిగింది. ఉదయం 9.30 గంటలకు ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమెకు విపరీతంగా రక్తస్రావం జరిగింది. అయితే మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆ రక్తస్రావాన్ని డాక్టర్లు ఆపలేదు. బాధితురాలిని వేరొక ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె ఆ రోజు మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. సర్జరీ తర్వాత హెమరేజిక్ షాక్ వల్ల ఆమె మరణించినట్లు పోస్ట్ మార్టం నివేదిక పేర్కొంది. మృతురాలి భర్త, ఇద్దరు పిల్లలు ఈ ఫిర్యాదు చేశారు.  



Updated Date - 2021-11-13T23:40:49+05:30 IST