జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఝలక్ ఇచ్చిన వినియోగదారుల ఫోరం!

ABN , First Publish Date - 2021-04-11T17:46:46+05:30 IST

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థను ఎన్‌సీఎల్‌టీ దివాలా కోరుగా ప్రకటించడంతో

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఝలక్ ఇచ్చిన వినియోగదారుల ఫోరం!

హైదరాబాద్‌ : జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థను ఎన్‌సీఎల్‌టీ దివాలా కోరుగా ప్రకటించడంతో టికెట్‌లు కొనుగోలు చేసి, నష్టపోయిన వినియోగదారుడి పక్షాన వినియోగదారుల ఫోరం నిలిచింది. నష్టపోయిన మొత్తంతోపాటు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. నగరానికి చెందిన దంపతు లు మార్చి 2019లో హైదరాబాద్‌ నుంచి అట్లాంటా వెళ్లి సెప్టెంబర్‌ 19న తిరిగి వచ్చేలా విమాన టికెట్‌లను అమీర్‌పేటలోని కార్తికేయ ట్రావెల్స్‌లో కొనుగోలు చేశారు. రూ.1,28,000 చెల్లించి జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ టికెట్‌లను ట్రావెల్స్‌ సంస్థ సమకూర్చింది. అనుకున్న విధంగా వారు జెట్‌ ఎయిర్‌వే‌స్‌లో అట్లాంటా వెళ్లారు. వారు అట్లాంటాలో ఉండగా జూన్‌ 2019లో ట్రావెల్‌ సంస్థ నిర్వాహకులు ఫోన్‌ చేసి ఎన్‌సీఎల్‌టీ జెట్‌ ఎయిర్‌వే‌స్‌ను దివాలాకోరు సంస్థగా ప్రకటించిందని, బుక్‌ చేసుకున్న రిటర్న్‌ టికెట్‌లు పనిచేయవని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా వేరే విమాన సంస్థ టికెట్‌లను అందించలేదు. దాంతో బాధితుడు తన సొంత డబ్బు రూ.27,306 వెచ్చించి తిరుగు ప్రయాణ టికెట్‌లు కొనుగోలు చేశారు.


నగరానికి వచ్చిన తర్వాత క్యాన్సలైన తిరుగు ప్రయాణటికెట్‌ డబ్బులు చెల్లించాలని పలుమార్లు ట్రావెల్‌ ఏజెన్సీని సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో ట్రావెల్‌ ఏజెన్సీతోపాటు ఎయిర్‌వే‌స్‌ను ప్రతివాదులుగా చేరుస్తూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. మనోవ్యధకు గురిచేసినందుకు, నైతిక ప్రమాణాలు పాటించనందుకు మొత్తం రూ.4.9లక్షల పరిహారం కోరుతూ ఆయన జిల్లా వినియోగదారుల ఫోరం 2లో వాజ్యం వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం క్యాన్సల్‌ చేసిన టికెట్‌ ఖరీదు వినియోగదారుడికి చెల్లించాల్సిన బాధ్యత రెండు సంస్థలపైనే ఉందని స్పష్టం చేసింది. వినియోగదారుడు నష్టపోయిన మొత్తం రూ.91,306 చెల్లించడంతోపాటు మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.50వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు 45 రోజుల్లో చెల్లించాలని జడ్జి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ జయశ్రీ తీర్పును ఇచ్చారు.

Updated Date - 2021-04-11T17:46:46+05:30 IST