అమ్మో ఇప్పుడు షాపింగా..!

ABN , First Publish Date - 2020-06-10T06:17:37+05:30 IST

మూడు నెలలుగా సాగుతున్న లాక్‌డౌన్‌, నానాటికీ పెరిగిపోతున్న కొవిడ్‌-19 కేసుల నేపథ్యంలో ప్రజలు షాపింగ్‌ అంటేనే హడలెత్తిపోతున్నారు. పైగా ఉద్యోగాలు కోల్పోవడం లేదా వేతనాల కోత కారణంగా షాపింగ్‌ వ్యయాలు కూడా భారీగా కుదించుకుంటున్నారు...

అమ్మో ఇప్పుడు షాపింగా..!

  • రిటైలర్ల సర్వేలో కస్టమర్ల అభిమతం


న్యూఢిల్లీ: మూడు నెలలుగా సాగుతున్న లాక్‌డౌన్‌, నానాటికీ పెరిగిపోతున్న కొవిడ్‌-19 కేసుల నేపథ్యంలో ప్రజలు షాపింగ్‌ అంటేనే హడలెత్తిపోతున్నారు. పైగా ఉద్యోగాలు కోల్పోవడం లేదా వేతనాల కోత కారణంగా షాపింగ్‌ వ్యయాలు కూడా భారీగా కుదించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం వినియోగ ధోరణులపై భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ఆర్‌ఏఐ) నిర్వహించిన సర్వేలో ఈ వైఖరి వెల్లడైంది. దేశంలో పలువురు వినియోగదారులు తమ షాపింగ్‌ వ్యయాలను తగ్గించుకుంటామన్న అభిమతం ప్రకటించగా మూడింట ఒక వంతు మంది మాత్రమే షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. మొత్తం 4,239 మంది వినియోగదారులను భవిష్యత్‌ షాపింగ్‌ ధోరణులపై ఈ సర్వేలో ప్రశ్నించారు. అధిక శాతం మంది సమీప భవిష్యత్తులో షాపింగ్‌  ఆలోచనే లేదని తేల్చేశారు. రిటైల్‌ రంగం రికవరీ జాప్యం అవుతుందనేందుకు కస్టమర్ల వైఖరి దర్పణం పడుతున్నదని, వారిని షాపింగ్‌కు సుముఖంగా చేయడానికి భద్రత, పారిశుధ్య చర్యలు పెంచడంతో పాటు సురక్షితమైన షాపింగ్‌ అనుభవం ఉంటుందనే భరోసా ఇవ్వడం తప్పనిసరి అని ఆర్‌ఏఐ పేర్కొంది. 




  • కొత్త కారు కన్నా యూజ్డ్‌ కారే మిన్న


ప్రస్తుత వాతావరణంలో అధిక శాతం మంది యూజ్డ్‌ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కొత్త కారు కొనాలనుకుంటున్నట్టు తెలిపిన వారు కూడా ఇప్పుడు తమ ప్రాధాన్యత మారిందని కార్స్‌ 24 సర్వేలో చెప్పారు. అలాగే ఎక్కువ మంది మారుతి స్విఫ్ట్‌, స్విఫ్ట్‌ డిజైర్‌, హ్యుండయ్‌ శాంత్రో జింగ్‌, గ్రాండ్‌ ఐ10, హోండా సిటీ, కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజా రవాణా వ్యవస్థలో తిరిగే కన్నా లాక్‌డౌన్‌ అనంతరం సొంత వాహనంలోనే తిరగనున్నట్టు చెప్పారని కార్స్‌ 24 సీఎంఓ గజేంద్ర జంగీద్‌ తెలిపారు. అలాగే ప్రస్తుతం తాము నడుపుతున్న కార్లను విక్రయించాలన్న ఆకాంక్ష ప్రకటించే వారు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. 


Updated Date - 2020-06-10T06:17:37+05:30 IST