ఇదెలా మరిచారు?

ABN , First Publish Date - 2021-04-28T06:25:46+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా..

ఇదెలా మరిచారు?

నాటి ఆంక్షలు నేడు ఏవీ?

కంటైన్‌మెంట్‌ జోన్స్‌, బఫర్‌ ఏరియాల సంగతి మరిచిన జిల్లా యంత్రాంగం 

విజయవాడ, శివారు ప్రాంతాల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు 

సామూహిక వ్యాప్తి దశకు చేరిక.. ప్రతిరోజూ భారీగా కేసులు 

ఆందోళన కలిగిస్తున్న మరణాలు.. కట్టడి చర్యలు శూన్యం


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ప్రస్తుత దశలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ కలవరపెడుతున్నాయి. కానీ కొవిడ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు అమలు చేయటం లేదు. కరోనా మొదటి దశలో ఈ విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కూడా సామూహిక దశలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయటం ముఖ్యం. దీంతో కొవిడ్‌ కేసులను పకడ్బందీగా కట్టడి చేయవచ్చు. 


కొవిడ్‌ సెకెండ్‌వేవ్‌ నియంత్రణకు జిల్లా యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అతి ముఖ్యమైన కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ విషయాన్ని ఎందుకు మరచిందో అర్థం కావటం లేదు. గతంలో లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ లేదు. ఇలాంటప్పుడే కంటైన్‌మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు అతి ముఖ్యం. దీనివల్ల ఆర్థికంగా ప్రభావం పడే అవకాశం లేదు. పైగా కేసుల కట్టడికి దోహదపడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీటింగ్‌ (ట్రిపుల్‌ - టీ) విధానాలను చేపడుతున్నట్టు జిల్లా యంత్రాంగం చెబుతోంది. అంటే కొవిడ్‌ పరీక్ష ఫలితాలతో ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయో ముందుగానే తెలుస్తోంది. విజయవాడ నగరంతో పాటు పరిసర రూరల్‌ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతోంది. ఇలాంటపుడు ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిలోకి తీసుకొస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ కట్టడికి దోహదపడుతుంది.


గతంలో కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు గుర్తించి వాటిని కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌గా గుర్తించేవారు. వాటి చుట్టూ బఫర్‌ ఏరియాలు కూడా అమలు చేసేవారు. అర్బన్‌ ప్రాంతాల్లో 500 మీటర్లు, రూరల్‌ ప్రాంతాల్లో 1000 మీటర్ల వ్యాసార్ధంలో బఫర్‌ ఏరియాలుగా పరగణించేవారు. ఇక్కడ కూడా కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ తరహాలోనే నిబంధనలు అమలయ్యేవి. అలాగే కంటైన్‌మెంట్‌ క్లస్లర్స్‌లో కేసుల తీవ్రతను బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా ప్రకటించేవారు. ఈ ప్రాంతాల్లో కేసులు క్రమం తప్పకుండా పెరుగుతుంటే రెడ్‌జోన్లుగా ప్రకటించేవారు. ఇక్కడ కంటైన్‌మెంట్‌ విధానాలు గట్టిగా ఉండేవి. కేసులు కాస్త తగ్గుతుంటే ఆరెంజ్‌ జోన్లుగా చూపేవారు. కేసులు తగ్గిపోయాక 28 రోజులు దాటినా కొత్త కేసులు నమోదవకపోతే వాటిని గ్రీన్‌ జోన్లుగా ప్రకటించేవారు. ప్రస్తుతం మొదటి దశ కంటే పతాక స్థాయిలో కేసులు నమోదవుతున్నా ఎక్కడా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను అమలు చేయటం లేదు. 


కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ నిబంధనలు

గతంలో విజయవాడలో అత్యధికంగా 20 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా, రూరల్‌లో 16 ఏర్పాటు చేశారు. నగరంలో ప్రధానంగా సెంట్రల్‌ మండల పరిధిలో అత్యధికంగా 8 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా, పశ్చిమలో 7, నార్త్‌లో నాలుగు ఉండగా ఈస్ట్‌లో ఒకే ఒక్క కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ ఉంది. రూరల్‌లో అయితే జగ్గయ్యపేట, విజయవాడ రూరల్‌ మండలాల్లో అత్యధికంగా 3 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉన్నారు. నూజివీడులో రెండు ఉన్నాయి. ఇలా రూరల్‌లో అక్కడి పరిస్థితులను బట్టి కంటైన్‌మెంట్ల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్లలో ఎలాంటి షాపులు తీయటానికి వీలులేదు. మద్యం షాపులు, పాన్‌షాపులు తెరవకూడదు. ఈ-కామర్స్‌ కార్యకలాపాలకూ అనుమతి లేదు. వ్యవసాయ పనులు, చేపలవేట, ఉపాధి పనులు, పారిశ్రామిక యూనిట్లకు అనుమతి లేదు. ఎలాంటి నిర్మాణ పనులకు, ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర కార్యకలాపాలకు అనుమతులు లేవు. 


ప్రస్తుతం పరిస్థితి చేయిదాటుతోంది? 

ప్రస్తుతం కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. నగరంతో పాటు రూరల్‌లోనూ పెద్దసంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. వీటి కట్టడికి ఎక్కడా కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలవటం లేదు. కేసులు బాధితులు చాలా వరకు హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. వారికి వలంటీర్లు కిట్‌ అందించి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతున్నారు. ఆ వీఽధిలో ఆరోగ్య సిబ్బంది బ్లీచింగ్‌ చల్లి వెళ్లిపోతున్నారు. కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్న బాధితులు బయట తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరు. నగరంతోపాటు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. వీరిద్వారా మరో పదిమందికి వచ్చే అవకాశం ఉంది. సెకండ్‌ వేవ్‌ సామూహిక దశకు చేరింది. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే కుటుంబం మొత్తానికి చుట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయటం తప్పనిసరి. జిల్లా యంత్రాంగం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-04-28T06:25:46+05:30 IST