TRS పార్టీలో ధిక్కారం.. ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి.. తగ్గేదేలే...!

ABN , First Publish Date - 2021-10-05T14:00:47+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌లో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి...

TRS పార్టీలో ధిక్కారం.. ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి.. తగ్గేదేలే...!

  • ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపాటు
  • అంబర్‌పేటలో వేర్వేరు కమిటీలు
  • తగ్గేదిలే అంటోన్న వైనం
  • ముషీరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలు బహిష్కరిస్తామని హెచ్చరిక
  • ఖైరతాబాద్‌లోనూ కుదరని ఏకాభిప్రాయం
  • పలు చోట్ల పెండింగ్‌

హైదరాబాద్‌ సిటీ : అధికార టీఆర్‌ఎస్‌లో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. డివిజన్‌ కమిటీల ఎంపిక సాక్షిగా పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఎమ్మెల్యే, కార్పొరేటర్‌/మాజీ కార్పొరేటర్ల మధ్య అంతర్గతంగా ఉన్న వార్‌ క్రమేణా బహిర్గతమవుతోంది. శాసనసభ్యులతో కొందరు కార్పొరేటర్లు, మాజీలు ఢీ అంటే ఢీ అంటున్నారు. పోటాపోటీగా డివిజన్‌ కమిటీలు ప్రకటించి తగ్గేదేలే అని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేటర్లు, మాజీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను కలుపుకొని.. అందరూ చర్చించి బస్తీ, కాలనీ, డివిజన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆదేశాలు కొందరు ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత నెల 30వ తేదీలోపు కమిటీల ఎంపిక పూర్తి చేయాలని కేటీఆర్‌ గడువు నిర్దేశించగా కలహాలు, కొట్లాటలతో ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.


పలు నియోజకవర్గాల్లో...

- ముషీరాబాద్‌లోనూ కమిటీల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ కార్యక్రమానికి వెళ్లిన స్థానిక శాసనసభ్యుడు ముఠా గోపాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. ఓ డివిజన్‌ అధ్యక్షుడిని మార్చని పక్షంలో పార్టీ కార్యక్రమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. భోలక్‌పూర్‌ డివిజన్‌ కమిటీ ఎంపిక సరిగా లేదని హోంమంత్రి మహమూద్‌ అలీకి కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినట్టు తెలిసింది. మాజీ కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకోకుండానే మెజార్టీ డివిజన్‌ కమిటీల ఎంపిక జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్త నేతల ఇళ్లకు స్వయంగా వెళ్తోన్న గోపాల్‌ వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.


- ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో రెండు డివిజన్‌ కమిటీల ఎంపికపై సందిగ్ధత ఏర్పడింది. ఖైరతాబాద్‌ డివిజన్‌ కమిటీకి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. బంజారాహిల్స్‌ డివిజన్‌ కమిటీని ఎమ్మెల్యేతో చర్చించి మేయర్‌ విజయలక్ష్మి ఖరారు చేసినట్టు తెలిసింది.


- గోషామహల్‌లో ఎమ్మెల్యే లేకున్నా.. కమిటీల ఎంపికలో స్థానిక నేతల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళ్‌హాట్‌ డివిజన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికలో మాజీ కార్పొరేటర్‌, మరో నేత మధ్య ఏకాభిప్రాయం లేదని సమాచారం. దీంతో ఈ డివిజన్‌ కమిటీని ఇంకా ఎంపిక చేయలేదు.


- కంటోన్మెంట్‌ పరిధిలోని రెండు వార్డుల అధ్యక్షుల ఎంపికపై.. తాజా మాజీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎమ్మెల్యే సాయన్న నిర్ణయం తీసుకున్నారని వారు అభిప్రాయ పడుతున్నారు. 


- సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో డివిజన్‌ కమిటీలను ప్రకటించ లేదు. సికింద్రాబాద్‌లో ఎంపిక పూర్తయినా.. మంచి రోజు కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. ఎల్‌బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బిజీగా ఉండడంతో కమిటీల కూర్పుపై దృష్టి సారించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


- జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో డివిజన్‌ కమిటీల ఎంపికపై కొందరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వేచి చూసే ధోరణి కనబరుస్తున్నారని నగర సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు.


అంబర్‌పేట.. తిరుగుబాట

టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికలు అంబర్‌పేట నియోజకవర్గంలో చిచ్చురేపాయి. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ప్రకటించిన డివిజన్‌ అధ్యక్షుల ఎంపికపై నిరసనలు పెల్లుబికాయి. నియోజకవర్గంలోని అంబర్‌పేట, కాచిగూడ డివిజన్లు కాక మిగతా మూడు బాగ్‌ అంబర్‌పేట, నల్లకుంట, గోల్నాక డివిజన్లలో ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోటీ సమావేశాలు నిర్వహించారు.


బాగ్‌ అంబర్‌పేటలో రెండు కమిటీలు..

బాగ్‌ అంబర్‌పేట డివిజన్‌కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ఓ కమిటీ ప్రకటించగా, దాన్ని వ్యతిరేకిస్తూ మాజీ కార్పొరేటర్‌ కె.పద్మావతిరెడ్డి సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మరో కమిటీ ప్రకటించింది. ఎమ్మెల్యే ఏకపక్షంగా చంద్రమోహన్‌ను డివిజన్‌ అధ్యక్షుడిగా ప్రకటించారని మాజీ కార్పొరేటర్‌ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. సోమవారం గౌడ సంఘం కార్యాలయంలో డివిజన్‌ మాజీ అధ్యక్షుడు ధనుంజయ ఆధ్వర్యంలో ఈ వర్గం సమావేశమైంది.


సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ కె.పద్మావతిరెడ్డి, సీనియర్‌ నాయకులు తొలుపునూరి కృష్ణగౌడ్‌, బొమ్మన నగే‌ష్‌ గౌడ్‌, గిరిధర్‌, హబీబ్‌, శ్రీనివా‌స్‌ యాదవ్‌, ప్రసాద్‌, సుధాతోపాటు అనేక మంది నాయకులు పాల్గొన్నారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేకు పోటీగా తాము మరో కమిటీని వేస్తున్నట్లు ప్రక టించారు. డివిజన్‌ అధ్యక్షుడిగా పంజాల మహేందర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌.రజనీకాంత్‌, ఉపాధ్యక్షులుగా కిషోర్‌గౌడ్‌, సుధలను ప్రకటించారు. వీరితో పాటు పూర్తి స్థాయిలో డివిజన్‌, అనుబంధ కమిటీలను వేసి ఎన్నికల ఇన్‌చార్జి బండి రమేష్‌, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివా‌స్‌ యాదవ్‌లకు సమర్పిస్తామన్నారు.


నల్లకుంటలోనూ వ్యతిరేక స్వరం..

నల్లకుంట డివిజన్‌ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మాజీ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవీ రమేష్‌ ఆరోపించారు. డివిజన్‌ అధ్యక్షుడిగా మేడి ప్రసాద్‌ను నియమించడాన్ని నిరసిస్తూ సీనియర్‌ నాయకులతో చర్చించి ఎమ్మెల్యే నిర్ణయాన్ని ఖండించారు. ఈ విషయంపై తాము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు.


ఏకపక్ష నిర్ణయం బాధాకరం..

తాను కార్పొరేటర్‌గా ఉన్నానన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా డివిజన్‌ అధ్యక్షుడిని ఎంపిక చేశారని గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివా‌స్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నియమించిన అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్‌ నియామకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ నియామకంపై ఎమ్మెల్యే పునరాలోచన చేయాలని ఆమె పేర్కొన్నారు. - దూసరి లావణ్య శ్రీనివా‌స్‌గౌడ్‌, కార్పొరేటర్‌.


అందరికీ అనుగుణంగానే..

నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే డివిజన్‌ అధ్యక్షులను నియమించామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - 2021-10-05T14:00:47+05:30 IST