ధిక్కారమే ఆయుధం!

ABN , First Publish Date - 2021-09-09T06:09:58+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఆధిపత్య యుద్ధకాండ మీద ఎదిరించే కలమే ధిక్కార స్వరమై ప్రతిధ్వనిస్తుంది. తెలంగాణలో కవిగా కాళోజీ కలం నిర్వర్తించిన చారిత్రక పాత్ర అదే. కవికి ఆవేశం ఒక సుగుణం....

ధిక్కారమే ఆయుధం!

ప్రజాస్వామ్యంలో ఆధిపత్య యుద్ధకాండ మీద ఎదిరించే కలమే ధిక్కార స్వరమై ప్రతిధ్వనిస్తుంది. తెలంగాణలో కవిగా కాళోజీ కలం నిర్వర్తించిన చారిత్రక పాత్ర అదే. కవికి ఆవేశం ఒక సుగుణం. ఉద్యమ కవికి మరింత ఆగ్రహావేశాలుండాలి. నిరంకుశుడైన నిజాం అయినా, నాన్ ముల్కీ ఆంధ్ర పాలకులైనా తెలంగాణా కోసం ప్రతిఘటించిన కంఠం ఆయనది. ‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్’ అనే విధంగా ప్రజలతో మమేకమైనాడు. సుదీర్ఘకాలం తెలంగాణలో జరిగిన అన్నీ పోరాటాల్లో మడమతిప్పని ఉద్యమ కవిగా కాళోజీ కనిపిస్తాడు. శాసన సభలో ప్రతిపక్షాలకంటే ప్రజాపక్షంలో మోగిన ప్రతిఘటన కంఠం ఆయనది.


ఆంగ్లేయుల మీద, నిజాం మీద, ఆంధ్ర పరిపాలకుల మీద ముప్పేటలా దాడి చేసిన నికార్సయిన కవి కాళోజీ. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఆయనకు ఊపిరి. వాటికి భంగం కలిగితే భరించలేడు. ధర్మాగ్రహం, ఆత్మగౌరవాలే నిరంకుశ ప్రభుత్వాల మీద ప్రతిఘటన కవిత్వం రాయడానికి దోహదపడ్డాయి. ప్రభుత్వం ఆయన్ని జైల్లో నెట్టడానికి కూడా అవే హేతువులయ్యాయి. 1938కి పూర్వం వందేమాతర ఉద్యమంలో పి.వి. నరసింహరావుతో కలిసి దేశ స్వాతంత్య్రం కోసం ఆయన తీవ్రంగా పోరాడిందీ ఎవరూ విస్మరించకూడదు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆనాడు కవితలల్లి 1939లోనే మొదటిసారి జైలు పాలైనాడు. పాలన పేరిట రజాకారు సైన్యం పల్లెపల్లెల్లో జరిపే దమన కాండ మీద ఉద్యమించి 1943లో రెండోసారి, ప్రజాశక్తిని ఎదిరించి ఎన్నాళ్లు ఏలుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీసి 1947లో మూడోసారి ఆయన జైలు పాలైనాడు. ఆయనపై నిజాం ప్రభుత్వం విధించిన నిర్బంధం 1948 సెప్టెంబర్17నాడు నిజాం ప్రధాని రాజీనామా చేసేదాకా సాగింది.


భారత దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణాలో 1953లో వచ్చిన నాన్ ముల్కీ ఉద్యమం, ఆ తర్వాత 1969లో సాగిన ‘జై తెలంగాణ ఉద్యమం’లో కాళోజీ ప్రధాన భూమిక పోషించారు. 1969 జనవరి 22న ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ని స్థాపించి, దాని ఆధ్వర్యంలో ఒక విద్యా సదస్సును వరంగల్‍లో నిర్వహించాడు. 1969 ఫిబ్రవరిలో ‘జై తెలంగాణ’ నినాదాన్ని లేవదీయడమే గాక, అదే ఏడాది జులై 16న ‘లిబరేషన్ డే’ పాటించి తిరగబడినందుకు ప్రభుత్వం ఆయన్ని జైల్లో పెట్టింది. 


‘కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గొడవొక్కటి 

తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన’

అంటూ తెలంగాణవాదిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షించిన కవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దమన నీతి మీదే కవన దండయాత్ర చేసినవాడు. ఇప్పటి దాకా బతికి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా విశ్రమించకపోయేవాడేమో? అవినీతి బంధుప్రీతి మీద ప్రశ్నల వర్షం కురిపించేవాడెమో? ల్యాండ్, సాండ్, ఫార్మా మాఫియాల మీద తిరుగుబాటు బావుటాను ఎగరేసేవాడేమో? నేడు ప్రజా కవులంతా ప్రభుత్వ పాలనలో భాగస్వాములై ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పెదవి విప్పడంలేదు. అందుకే కవి కాళోజీ మళ్లీ పుట్టాలి.


‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి’ అన్న కవి కాళన్న గొడవ తెలంగాణ రాష్ట్రావతరణతో ముగిసి పోతుందనుకొన్నాం. కానీ అది అంతరించలేదు. ప్రశ్నించడానికి ఆయన వారసులు ఉద్యమకారుల రూపంలో పుట్టుకు వస్తారనేది మాత్రం నిజం. 

ప్రొ. ననుమాస స్వామి

రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ యోధుల ఫోరం

Updated Date - 2021-09-09T06:09:58+05:30 IST