సందర్భం

ABN , First Publish Date - 2020-07-13T06:01:20+05:30 IST

ఆ నాలుక పై మచ్చలున్నట్టు ఏదంటే అదే శాసనమయితున్న పైచేయి అతడంటే పడుగూ పేకల రెక్కల కష్టం లెక్కగట్టు భూతద్దం ...

సందర్భం

ఆ నాలుక పై మచ్చలున్నట్టు 

ఏదంటే అదే శాసనమయితున్న పైచేయి 

అతడంటే 

పడుగూ పేకల రెక్కల కష్టం లెక్కగట్టు భూతద్దం 

తలవొంచితె చాలు 

నెత్తి కత్తిరించే కత్తెర చూపుల పెత్తనం 


ఊరంటే 

చిక్కు ముదురుతున్న తీగరాగం 

మూలమూలన 

పాముకాటుకు ఊదుతున్న తేలు మంత్రం 

కుటిలం దొరకబట్టు విద్య తెలియక 

పుండొక చోటయితే మందొక చోటులా 

రోగం మర్లబడుతున్న ఎనుకటి పాట 


పదిమందిల చావని పాములా 

పీటమీది పిండిముద్ద 

పెనం పైకెక్కముందుకే పొయ్యిల పడ్డ కొట్లాట 

సెలకల పోగొట్టుకున్న పెసరు గింజ 

పప్పటికెల వెతుకుతున్న ఆకలి ఆరాటం 


దూరం... దూరం... భౌతిక దూరం.. 

చీమల పుట్టల పొసగని 

సమైక్యతా గీతాక్షరం 

కొండంత 

నాలుగు కాళ్ళ ఏనుగు బలమయినా పట్టుబడు 

గడ్డిపోచల కట్టుబాటు ఆగమయిన కాలం 


కనబడని కరోనా శత్రువు 

చీర మడతల దాగినట్టు 

కొనుగోలు నడుమ అంతరాయం 

పోగులేని మగ్గం 

ఏకాకి విషాదం 

రెక్కాడితే డొక్కాడు నిలువెత్తు వెన్నుపూస మర్మం 

కుప్పకూలుతున్న భూకంపం 


కాలం కలిసి వస్తే మళ్ళీ కలుద్దామను 

పైస మాటల పెద్ద మనిషి 

కూలీ కత్తిరించు 

పదును నూరుతున్న సందర్భం. 

గజ్జెల రామకృష్ణ

89774 12795


Updated Date - 2020-07-13T06:01:20+05:30 IST