Abn logo
Oct 27 2021 @ 01:34AM

తిరునగరిపై నిరంతర నిఘా

బ్లూకోల్ట్స్‌ శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ వెంకట అప్పలనాయుడు

112మందితో స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ దళం ఏర్పాటు 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 26: తిరుపతిలో ఇకపై సాలెగూడులా స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ పోలీసులు అల్లుకుపోనున్నారు.మూడు షిఫ్టుల్లో.. రాత్రింబవళ్లూ నగరమంతటా తిరుగుతుంటారు. దీనికోసం 112 మందితో స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ దళం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తిరుపతిలోని నాలుగు పోలీసు స్టేషన్లలో ఒక్కో స్టేషన్‌కు మూడు లేక నాలుగు బ్లూకోల్ట్స్‌ ద్విచక్రవాహనాలు, ఒక్కోదానికి ఇద్దరు చొప్పున అత్యధికంగా స్టేషన్‌కు ఎనిమిదిమంది సిబ్బంది విధులు నిర్వహించేవారు. దీనివల్ల పటిష్టమైన నిఘా సాధ్యం కాని పరిస్థితి. ఈ క్రమంలో తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో 150 మంది సిబ్బందితో స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ను అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఏర్పాటు చేశారు. వీరిలో 112 మంది.. 25 ద్విచక్ర వాహనాల్లో మూడు షిఫ్టులుగా విధులు నిర్వహించనున్నారు.దీనివల్ల నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసు నిఘా పెరగనుంది. స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ విధానం వల్ల విజిబుల్‌ పోలీసింగ్‌ను పెంచడంతోపాటు రౌడీలు, ఆకతాయిలు, పోకిరీలు, మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్టవేసి ఓపెన్‌ బూజింగ్‌న్‌ అరికట్టే అవకాశం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. 

దొంగతనాలకూ చెక్‌

స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌తో దొంగతనాలకూ చెక్‌ పడనుంది. వీరు ప్రతివీధిలో నిరంతరం తిరుగుతూ ఉండాలి. ఆయా ప్రాంతాల్లో తాళాలు వేసున్న ఇళ్లను గుర్తించాలి. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు తెలియజేయాలి. అప్పటికప్పుడు వీలైతే ఇంట్లో లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం ఏర్పాటు చేయించాలి. లేదంటే ఇంటి యజమానులు తిరిగి వచ్చేవరకు ఆ ఇంటిపై నిఘాపెట్టి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఎల్‌హెచ్‌ఎంఎ్‌సపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆయా ప్రాంతాలకు చెందిన పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా పెట్టడం, అనుమానితులను గుర్తించడం, అవసరమైతే సాంకేతిక పరికరాల ద్వారా బయటప్రాంత నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం తదితర బాధ్యతలను స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌పై ఉంచారు. 


పట్టణ, గ్రామీణ ప్రాంతాలకూ

స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ను తిరుపతితోపాటు అర్బన్‌ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించారు. శ్రీకాళహస్తి పట్టణానికి 10 మంది, ఏర్పేడు- 6, రేణిగుంట- 6, గాజులమండ్యం- 4, చంద్రగిరి- 6, తిరుమల- 5 మంది చొప్పున బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని కేటాయించారు. వీరికి అనేక అంశాల్లో నిష్ణాతులతో రెండు రోజులపాటు శిక్షణ ఇప్పించారు. 


ఇకపై మీరే కీలకం: ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణలో ఇకపై స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ పాత్ర అత్యంత కీలకమని అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు పేర్కొన్నారు. ఎస్వీయూ సెనేట్‌ హాలులో మంగళవారం రెండు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా ప్రప్రథమంగా బ్లూకోల్ట్స్‌ అక్కడికి చేరుకోవాలని చెప్పారు. సరైన సమయంలో పోలీసులు చేరుకోగలిగితే చాలా సమస్యలు ఆదిలోనే అంతమవుతాయన్నారు. అందుకే సత్వర సాయం అందిచేందుకు స్పైడర్‌ బ్లూకోల్ట్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీలు కొండయ్య (కమాండ్‌ కంట్రోల్‌), రామరాజు(దిశ), కాటమరాజు(ట్రాఫిక్‌), మురళీధర్‌ (సీసీఎస్‌), సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.