కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం జగన్!

ABN , First Publish Date - 2021-10-09T14:21:27+05:30 IST

కాంట్రాక్టు లెక్చరర్లకు..

కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాకిచ్చిన సీఎం జగన్!

విలీనంతో విలవిల!

కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగం గోవిందా

700 మంది ఉద్యోగాలకు ఎసరు 

ఎయిడెడ్‌ లెక్చరర్ల విలీన ప్రభావం

పర్మినెంట్‌ చేస్తామన్న హామీ ఉత్తదే 

కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్‌ హామీ

ఇప్పుడు ఉన్నవీ ఊడిపోయే పరిస్థితి 


‘‘కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పర్మినెంట్‌ ఉద్యోగులకు ఉన్న అర్హతలే ఉన్నాయి. వారందరినీ పర్మినెంట్‌ చేయాలి. అలా చేస్తానని చెప్పి చేయకుండా నట్టేట ముంచొద్దు. ఒకవేళ మీరు చేయకుంటే మేం వచ్చి వారందరినీ పర్మినెంట్‌ చేస్తాం’’.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవీ... అయితే ఇప్పుడు ఆ హామీకి ఎసరొచ్చింది. పర్మినెంట్‌ చేసే మాట అటుంచి ఏకంగా 700 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల విలీనం కాంట్రాక్టు లెక్చరర్లకు శరాఘాతంగా మారుతోంది. దశాబ్దాలుగా నడుస్తున్న కాలేజీలకు సాయం కోసేసి... అక్కడ విధుల్లో ఉన్న 900 మంది లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా కళాశాలల్లో ఇప్పటికే కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న 700మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఇప్పటికే 350 మందిని గత 20 రోజులుగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మిగిలిన 350 మంది పరిస్థితి కూడా అయోమయంలో పడింది. ఎయిడెడ్‌ లెక్చరర్లను ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. అంటే ఇప్పటివరకు ఎయిడెడ్‌ కళాశాలల్లో పాఠాలు చెప్పిన వీరంతా ఇకపై ప్రభుత్వ కాలేజీలకే పరిమితం కానున్నారు.


మరోవైపు ఎయిడెడ్‌ కళాశాలలకు లెక్చరర్ల జీతాల రూపంలో ఇస్తున్న సాయం ఆగిపోయింది. అవి ప్రైవేటు కళాశాలలుగా మారిపోయాయి. విలీనం చేసుకున్న లెక్చరర్లకు ప్రభుత్వ కళాశాలల్లో పోస్టింగులు ఇస్తున్నారు. దీంతో 21 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులు పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ అసెంబ్లీలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తున్నారు. తమను పర్మినెంట్‌ చేయకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా పోయే స్థితి వచ్చిందని వాపోతున్నారు. రెండు దశాబ్దాల పైబడి లెక్చరర్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్‌ చేసే దిశగా పరిశీలించకపోగా... ఇలా ఉద్యోగాలు తీసివేయడం దారుణమంటున్నారు. 



పోస్టులున్నా... అనుమతి లేదు 

వాస్తవానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎయిడెడ్‌ లెక్చరర్లకు పోస్టింగ్‌ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పనిచేస్తున్న 700 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు సరిపడినన్ని ఖాళీలు ఉన్నాయి. కానీ వాటి భర్తీకి సర్కారు అనుమతి ఇవ్వడం లేదు. గత ఐదారేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వరకూ డిగ్రీ కళాశాలలు కొత్తగా ఏర్పాటయ్యాయని చెబుతున్నారు. వీటిలో భర్తీ చేయాల్సిన లెక్చరర్ల ఉద్యోగాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయకుండానే తూతూమంత్రంగా లాగించేస్తున్నారు. పక్క కళాశాలల నుంచి లెక్చరర్లను తీసుకొచ్చి తరగతులు చెప్పిస్తున్నారు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, ఏలేశ్వరం, పిఠాపురం కళాశాలల్లో ముగ్గురేసి చొప్పున కామర్స్‌ లెక్చరర్లు ఉండాలి. కానీ ఒక్కొక్కరే ఉన్నారు. ఆలమూరు డిగ్రీ కళాశాలలో 23 పోస్టులుండగా 8 మాత్రమే భర్తీ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగానే పోస్టులు ఖాళీలున్నాయి.


ఇప్పుడు ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 900 మంది వచ్చి ప్రభుత్వ కళాశాలల్లో చేరినా కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలకు ఏ ఇబ్బందీ ఉండదు. కానీ ఈ ఖాళీల భర్తీకి సర్కారు అనుమతించాల్సి ఉంది. ఇప్పుడు విలీనమవుతున్న లెక్చర్లర్ల జీతభత్యాలకు ప్రభుత్వం ఏటా రూ.500కోట్లు ఖర్చు చేసేది. ఇప్పుడు వీరంతా విలీనం కావడంతో ఇక డిగ్రీ కళాశాల్లో పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం తగ్గిపోయింది. ప్రభుత్వానికి జీతభత్యాల ఖర్చు తగ్గినా కూడా ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తీసేయడం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు లెక్చరర్లు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-09T14:21:27+05:30 IST