కాంట్రాక్టు ఉద్యోగులకు.. త్వరలో శుభవార్త!

ABN , First Publish Date - 2021-12-10T16:37:49+05:30 IST

కాంట్రాక్టు ఉద్యోగుల..

కాంట్రాక్టు ఉద్యోగులకు.. త్వరలో శుభవార్త!

రెగ్యులరైజ్‌ చేసేనా?

కాంట్రాక్టు ఉద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు..
క్రమబద్ధీకరణ కోసం ఏళ్లుగా నిరీక్షణ

హైకోర్టు క్లియరెన్స్‌తో పెరిగిన నమ్మకం

రాష్ట్రంలో 50,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు

అందరూ డీఎస్సీల ద్వారా ఎంపికైనవారే

దశలవారీగా క్రమబద్ధీకరించే అవకాశం

గతంలోనే వివరాలు సేకరించిన జీఏడీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై హైకోర్టు ధర్మాసనం లైన్‌ క్లియర్‌ చేయడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమను రెగ్యులరైజ్‌ చేస్తుందని ఆశిస్తున్నారు. 25 ఏళ్ల నుంచి అందిస్తున్న సేవలకు గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వయసు మీరి పోతోందని, ఇతర ఉద్యోగాలకు పరీక్షలు రాయలేమని, ఉన్న ఉద్యోగాల్లోనే రెగ్యులరైజ్‌ అయితే.. కుటుంబాలకు కాస్తంత ఆసరా లభిస్తుందని అంటున్నారు. నిజానికి కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ సమయంలోనే ప్రకటించింది. 2014లో అధికారంలోకి వచ్చాక ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలు తీసింది. వీరిని రెగ్యులరైజ్‌ చేయడానికి 2016 ఫిబ్రవరి 26న జీవో నంబర్‌ 16ను జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాలు చేస్తూ కొంత మంది నిరుద్యోగులు కోర్టు మెట్లెక్కారు. ఎట్టకేలకు నిరుద్యోగుల పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం మంగళవారం కొట్టివేసింది. జీవో 16ను అమలు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. 


దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. తెలంగాణ రాష్ట్ర మొదటి పీఆర్సీని వెల్లడించిన  వివరాల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని శాఖ ల్లో కలిపి 50,400 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో కొంత మంది 25 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నిజానికి ఈ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థలు ఇప్పటివి కావు. 1996లో చంద్రబాబు హయాంలోనే కాంట్రాక్టు వ్యవస్థ పుట్టుకొచ్చింది. 2005 నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇలా అప్పటి నుంచి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వివిధ కేటగిరీల్లో భర్తీ అవుతూ వస్తున్నారు. వైఎస్‌ హయాం నాటికే కాంట్రాక్టు నియామకాలు కనుమరుగైనా.. ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రంలో 3,00,178 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలిపిన పీఆర్సీ.. మిగతా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఖాళీ పోస్టుల్లో 50,400 మంది కాంట్రాక్టు, 58,128 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు తెలిపింది. అంటే.. రాష్ట్రంలోని 1,08,528 పోస్టులు వీరితోనే భర్తీ అయి ఉన్నాయి. 1996 నుంచి కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు 20 వేల మంది వరకు ఉండగా, ఆ తర్వాత వివిదదశల్లో మిగతావారు నియమితులయ్యారు. నిబంధనల ప్రకారం 50,400 మంది క్రమబద్ధీకరణకు అర్హులవుతారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల నేతలు వివరిస్తున్నారు.


డీఎస్సీల ద్వారా ఎంపిక...

సాధారణంగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నిబంధనల ప్రకారం ఎంపిక చేసి నియమించుకుంటే వారిని రెగ్యులరైజ్‌ చేయడానికి అవకాశముంటుంది. ఈ 50,400 మంది కూడా నిబంధనల ప్రకారమే నియమితులయ్యారని సంఘాల నేతలు చెబుతున్నారు. వివిధ సందర్భాల్లో ‘జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ)’లు వీరిని ఎంపిక చేస్తూ వచ్చాయి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు వంటిని పరిగణనలోకి తీసుకుని నియమించారు. ముఖ్యంగా విద్య, వైద్య ఆరోగ్యం, రెవెన్యూ, మునిసిపల్‌ వంటి శాఖల్లో ఎక్కువగా నియమితులయ్యారు. 50,400 మందిలో 5150 మంది వరకు లెక్చరర్లుగా కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లుగా, వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, పారామెడికల్‌ సిబ్బందిగా, పురపాలక శాఖలో బిల్‌ కలెక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్‌ క్లర్కులు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా నియమితులయ్యారు. 


స్కీమ్‌ వర్కర్స్‌ సంఖ్య పెద్దదే

డీఎస్సీల ద్వారా ఎంపికై పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులే కాకుండా వివిధ ప్రాజెక్టుల కింద పని చేస్తున్న కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ స్కీమ్‌ వర్కర్స్‌ కూడా ఉన్నారు. 60 వేల వరకు అంగన్‌వాడీ వర్కర్స్‌, 45 వేల వరకు ఆశా వర్కర్లు, సమగ్ర శిక్షా అభియాన్‌ కింద 31 వేల మంది, ఐకేపీ, మెప్మాల కింద 25 వేలు, ఆర్టీసీలో 4 వేలు, మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో 12 వేలు.. ఇలా 3 లక్షలకు పైగా స్కీమ్‌ వర్కర్స్‌ పని చేస్తున్నారు. వీరి గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్‌ చేస్తామంటూ జీవో నంబర్‌ 16ను జారీ చేసింది.


దశలవారీగా క్రమబద్ధీకరణ ?

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వం భావించినా.. ఒకేసారి 50,400 మందిని చేయకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఆయా శాఖల అవసరాలు, ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగుల ను రెగ్యులరైజ్‌ చేస్తారని చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ ప్రకటించింది. ఈ పోస్టుల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. అయితే ఒకేసారి 50 వేల మందిని నియమిస్తే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వం 50 వేల మందిని రెగ్యులరైజ్‌ చేయకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. పైగా వీరిని రెగ్యులరైజ్‌ చేయాలంటే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ రావాలి. అలా కాకుండా.. క్యాబినెట్‌ ఆమోదం పొంది పోస్టులను రెగ్యులరైజ్‌ చేయవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఏమైనా ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉందని జీఏడీ అధికారి ఒకరు చెప్పారు.


50 వేల మందిని రెగ్యులరైజ్‌ చేయాలి 

హైకోర్టు ధర్మాసనం జీవో 16ను అమలు చేసుకోవచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందున.. రాష్ట్రంలోని 50,400 కాంట్రాక్టు పోస్టులను రెగ్యులరైజ్‌ చేయాలి. ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగాలనే నమ్ముకుని సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వయసు మీరిపోయారు. ఇతర ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి. 

- జె.వెంకటేశ్‌, అధ్యక్షుడు, తెలంగాణ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య

Updated Date - 2021-12-10T16:37:49+05:30 IST