'కాంట్రాక్ట్ కిల్లర్స్'గా కేంద్ర ఏజెన్సీలు.. శివసేన ఫైర్

ABN , First Publish Date - 2021-10-18T01:57:41+05:30 IST

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై శివసేన..

'కాంట్రాక్ట్ కిల్లర్స్'గా కేంద్ర ఏజెన్సీలు.. శివసేన ఫైర్

ముంబై: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై శివసేన విరుచుకుపడింది. మహారాష్ట్రలోని రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు 'కాంట్రాక్ట్ కిల్లింగ్స్' స్థానే 'గవర్న్‌మెంట్ కిల్లింగ్స్' వచ్చి చేరాయని శివసేన పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం తీవ్ర విమర్శలు చేసింది. శివసేన సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ఈడీ, ఆదాయం పన్ను స్కానర్‌లో ఉందని, వారిలో కనీసం ఒకరైనా సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారని, ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు ''కాంట్రాక్ట్ కిల్లర్లు''గా పనిచేస్తున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ 'రోహ్‌తక్' అనే వీక్లీ కాలమ్‌లో ఘాటుగా విమర్శించారు.


''చట్ట నిబంధనలు కానీ రూల్ ఆఫ్ రెయిడ్స్ కానీ మహారాష్ట్రలో ఉన్నాయా? కేంద్ర దర్యాప్తు సంస్థలు రికార్డు స్థాయిలో దాడులకు పాల్పడటం చూస్తే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే కలుగుతాయి'' అని రౌత్ పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ పాలకులు అబద్ధాలు చెబుతుండే వారని, ఇప్పుడు ఎలాంటి పెట్టుబడుల (క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) లేకుండానే తరచు దాడులు నిర్వహించడమే వ్యాపారంగా పెట్టుకున్నారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అంతం చేసేందుకు ప్రజాధనం, ప్రభుత్వ యంత్రాగం వాడుకుంటున్నారని, గతంలో అండర్ వరల్డ్ చురుకుగా పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఉండేవని, ప్రత్యర్థులను అంతం చేసేందుకు ఈ గ్యాంగులను ఉపయోగించే వారని, ఇప్పడు వారి స్థానంలో 'గవర్న్‌మెంట్ కిల్లింగ్స్' వచ్చి చేరాయని అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారి కోసం 'కాంట్రాక్టు కిల్లర్లు'గా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇదొక కొత్త పాలసీగా పెట్టుకున్నట్టు కనిపిస్తోందని కేంద్రాన్ని దుయ్యబట్టారు.


ఖాన్‌ను 8 నెలలు జైలులో ఉంచి...

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేయడాన్ని సంజయ్ రౌత్ తన సంపాదకీయంలో ప్రస్తావించారు. డ్రగ్స్ రాకెట్‌లో ప్రమేయం ఉందంటూ ఖాన్‌ను 8 నెలలు జైలులో ఉంచారని, ఇప్పుడు కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని చెప్పారు. ఖాన్ వద్ద దొరికినవి డ్రగ్స్ కాదని, హెర్బల్ టుబాకో అనీ కోర్టు పేర్కొందని, ఆ దృష్ట్యా ఎన్‌సీబీ అధికారులపై నవాబ్ మాలిక్ కేసు పెట్టాలని అన్నారు. ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపిందని సంజయ్ రౌత్ విమర్శించారు.


పీఎం కేర్స్ సొమ్ముల గురించి చెప్పరేం?

పీఎం కేర్స్ ఫండ్‌ వివరాలు ప్రజలకు బహిరంగ పరచకపోవడాన్ని సంజయ్ రౌత్ తన సంపాదకీయంలో ప్రశ్నించారు. ప్రభుత్వ ఫండ్ కాదని, ప్రైవేట్ ఫండ్ అని చెబుతున్నారని, ప్రధాని పేరుతో కోట్లాది రూపాయల నిధులను వసూలు చేశారని రౌత్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-18T01:57:41+05:30 IST