కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వైద్యఉద్యోగుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2021-10-04T04:43:37+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఏపీ వైద్యవిధానపరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వైద్య సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడంలేదు.

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వైద్యఉద్యోగుల ఆకలి కేకలు

  • నెలల తరబడి జీతాలందక ఆర్థిక ఇబ్బందులు
  • పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు 

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 3: జిల్లా వ్యాప్తంగా ఏపీ వైద్యవిధానపరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ వైద్య సిబ్బందికి సక్రమంగా జీతాలు అందడంలేదు. వీరికి నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ఆయా కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విభాగాల సిబ్బందికైతే మూడు, నాలుగు నెలలు పెండింగ్‌లో ఉంటు న్నాయి. ఒక పక్క ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, మరోపక్క కరోనా పరిస్థితుల్లో ఒక్క నెల జీతం డబ్బులు రాకపోతేనే అల్లాడిపోవాల్సి వస్తుంది. అలాంటిది నెలల తరబడి జీతాలు రాకపోతే తాము ఎలా బతకాలంటూ చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో సుమారు 30 వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, డీఈవోలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్‌ తదితర సుమారు 320 మంది వైద్య సిబ్బంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. వీరందరికీ నెలల తరబడి జీతాలు ఆలస్యం అవుతున్నాయి. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన జీతాలకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నట్టు సమాచారం ఉందని, అయితే సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌ పెడుతున్నారని, కారణం ఏమీ లేకుండా ఇలా చేయడం వల్ల చిరుద్యోగులైన వైద్య సిబ్బందికి జీతాలు సక్రమంగా అందడంలేదని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగుల సంఘం నాయకుడు పి. రవికుమార్‌ అన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన చిరుద్యోగులకు ఇలా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే దృష్టిసారించి జీతాలు సకాలంలో చెల్లించి తమను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని చిరుద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-04T04:43:37+05:30 IST