ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-06-19T01:47:25+05:30 IST

స్థానిక ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది శుక్రవారం ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. 15 ఏళ్లుగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నామన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా
ఏరియాఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

గూడూరురూరల్‌, జూన్‌ 18: స్థానిక ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న   కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది శుక్రవారం ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. 15 ఏళ్లుగా ఆసుపత్రిలో  విధులు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయడంతోపాటు సమానపనికి సమానవేతనం అందించాలన్నారు. నర్సింగ్‌ కేడర్‌లో వేతన వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు.  తమ సమస్యలన పరిష్కరిస్తామని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మౌలాలి, దొరసానమ్మ, జోత్స్న, చందన, బాబురావు, ఆదిశేషయ్య, అపర్ణ, సుజాత, వినయ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

===================================================================


సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

గూడూరురూరల్‌, జూన్‌ 18: మండలంలోని కొమ్మనేటూరు సచివాలయాన్ని శుక్రవారం డివిజనల్‌ పంచాయతీ అధికారి పీ వెంకటరమణ  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు కొమ్మనేటూరు సచివాలయం తలుపులు తెరిచి లోపలకి వెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందిందన్నారు.  జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి ఆదేశాల మేరకు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ఈ సచివాలయంలో 11 మంది సిబ్బంది సిబ్బంది పని చేస్తుండగా ఉదయం  10 గంటలకు అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మాత్రమే విధులకు హాజరయ్యారన్నారు. మిగిలినవారు వేళలు పాటించడంలేదన్నారు. సచివాలయం తాళాలు సిబ్బంది తమ దగ్గర ఉంచుకోకుండా గ్రామంలోని కొందరి దగ్గర ఉంచడంతో రాత్రి వేళల్లో వారు సచివాలయం తలుపులు తెరిచి లోనికి వెళుతున్నారన్నారు. సిబ్బందిపై పంచాయతీ కార్యదర్శికి నియంత్రణ లేకుండా పోయిందని తనిఖీల్లో తేలిందన్నారు. ఈ నివేదికలను జిల్లా పంచాయతీ అధికారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T01:47:25+05:30 IST